పోటెత్తిన అభిమానం

 YS Jagan Mohan Reddy Praja Sankalpa Yatra  in east godavari district - Sakshi

రాజోలులో జనçహోరు

జన సంద్రమైన రహదారులు

జై జగన్‌ నినాదంతో  మార్మోగిన రాజోలు, పి.గన్నవరం గ్రామాలు

  తాటిపాక మఠం వద్ద జగన్‌కు ఘన స్వాగతం 

సాక్షి ప్రతినిధి, కాకినాడ :  జననేతకు రాజోలు జేజేలు పలికింది. జగన్‌ కోసం బారులు తీరింది. అశేషజనంతో పులకించిపోయింది. జై జగన్‌ నినాదంతో హోరెత్తింది. మునుపెన్నడూ లేనివిధంగా జన సందోహం పోటెత్తింది. ప్రజానేత రాకతో రోడ్లన్నీ జనమయమయ్యాయి. కిలోమీటర్లు పెరుగుతున్న కొద్దీ అభిమానం రెట్టింపు అవుతోంది.  పలువర్గాలు ఎదురేగి స్వాగతం పలుకుతున్నాయి. అక్కచెల్లెమ్మలు దిష్టి తీసి హారతి పడుతున్నారు. రంగవల్లులతో, పూల తివాచీలతో పల్లెలు స్వాగతం చెబుతున్నాయి. 

వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర బుధవారం పి.గన్నవరం, రాజోలు నియోజకవర్గాల్లో జరిగింది. 194రోజు యాత్ర నాగుల్లంక, చాకలిపాలెం, తాటిపాక మఠం, పొదలాడ, సోంపల్లి, రాజోలు మీదుగా శివకోడు వరకు సాగింది. పి.గన్నవరం నియోజకవర్గ పరిధిలోని చాకలిపాలెం మీదుగా తాటిపాక మఠం వద్ద రాజోలు నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశించింది. తమ నియోజకవర్గంలోకి ప్రవేశించిన సందర్భంలో రాజోలు నియోజకవర్గ ప్రజలు కొబ్బరి పుష్పాలు...పూల తివాచీ...డప్పుల వాయిద్యాల మధ్య వైఎస్‌ జగన్‌కు ఘనస్వాగతం పలికారు. నక్షత్రాలు మీద పడుతున్నట్టు ప్రత్యేక ఎయిర్‌ ప్రెజర్‌తో వైఎస్సార్‌ సీపీ జెండా రంగులైన పచ్చ, నీలం, తెలుపు రంగుల్లో ఉన్న కాగితపు ముక్కలను రహదారి పొడవునా ఎగురవేశారు. రాజోలు నియోజకవర్గంలోకి ప్రవేశించే ముందు తాటిపాకమఠం వద్ద శుభసూచకంగా శాంతి కపోతాలను ఎగురవేశారు.

 అక్కడి నుంచి సాగిన పాదయాత్రలో అడుగడుగునా ప్రజా సమస్యలు తెలుసుకుని జననేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు భరోసా ఇచ్చారు. ప్రభుత్వ తీరుతో మోసపోయామని కొందరు....చావు బతుకుల మధ్య ఉన్నా చికిత్స అందడం లేదని ఇంకొందరు...అర్హత ఉన్నా పింఛన్‌ ఇవ్వలేదని మరొకరు...ఇలా ప్రతి ఒక్కరూ తమ అభిమాన నేత జగన్‌ ముందు సమస్యలు ఏకరువు పెట్టారు. అండగా ఉండాల్సిన ప్రభుత్వమే పక్షపాత ధోరణితో వ్యవహరిస్తే బతికేదెట్టాగని బోరుమన్నారు. చుట్టూ గోదావరి ఉన్నా తాగడానికి మంచినీళ్లు లేవని... గుక్కెడు నీటికోసం అవస్థలు పడుతున్నామని స్థానికులు మొర పెట్టుకున్నారు. గోదావరి కాలువలున్నా శివారు భూములకు సాగునీరు అందడం లేదని....ధాన్యానికి, కొబ్బరికి గిట్టుబాటు ధర లేదని...ధాన్యం కొనుగోలు కేంద్రాలు అలంకారప్రాయంగా మారాయని అన్నదాతలు తమ గోడు తెలియజేశారు. 

జనం గోడు విన్న జగన్‌
డిజిటల్‌ వ్యవస్థతో తమ జీవన విధానం దెబ్బతిందని రాయితీపై విద్యుత్తు ఇవ్వాలని, ఆరోగ్య కార్డులు జారీ చేయాలని ఫొటోగ్రాఫర్లు కోరారు. దేవాదాయ శాఖలో పనిచేస్తున్న అర్చక ఉద్యోగులు.. జీతభత్యాల కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని విన్నవించుకున్నారు. కౌలు రైతులను చంద్రబాబు మోసం చేశారని కొందరు చెప్పుకోగా, సదరం ధ్రువపత్రం ఉన్నా పింఛను ఇవ్వడం లేదని అంకాని తాతాజీ అనే దివ్యాంగుడు జగన్‌ వద్ద వాపోయాడు. తమ కుమార్తె బ్రెయిన్‌కు సంబంధించిన వ్యాధితో బాధపడుతోందని ఆదుకోవాలని నాగుల్లంక గ్రామానికి చెందిన దుర్గాభవాని, శ్రీరామమూర్తి దంపతులు మొర పెట్టుకున్నారు. 

బ్రాందీషాపుల వల్ల కుటుంబాలు ఛిన్నాభిన్నమవుతున్నాయని చాకలిపాలెం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉండటానికి ఇల్లు లేదని, స్థలం కోసం దరఖాస్తు చేసినా పట్టించుకోవడం లేదని గంట రోజ్లిన్‌ జగన్‌కు విన్నవించుకున్నారు. రేషన్‌కార్డులు లేవని, పింఛన్లు రావడం లేదని జగన్‌ వద్దకు వచ్చి పలువురు విన్నవించారు. రాజోలు బహిరంగ సభలో ప్రజల బాధలను ప్రస్తావించి వారందరికీ వైఎస్సార్‌ సీపీ అండగా ఉంటుందని, అధికారంలోకి వచ్చాక ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. స్థానిక సమస్యలను ఎక్కువగా ప్రస్తావించడంతో రాజోలు ప్రజలు ఆనందభరితులయ్యారు.

పాదయాత్రలో పాల్గొన్న పార్టీ శ్రేణులు 
ఉభయగోదావరి జిల్లాల రీజనల్‌ కోఆర్డి       నేటర్, ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి, రాజంపేట ఎంపీ మిధున్‌రెడ్డి, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, కె.నారాయణస్వామి, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, పీఏసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పినిపే విశ్వరూప్, తలశిల రఘురాం, కాకినాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, నరసాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, మాజీ ఎమ్మెల్యేలు పాముల రాజేశ్వరి, అల్లూరి కృష్ణంరాజు, రౌతు సూర్యప్రకాశరావు, సమన్వయకర్తలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి. బొంతు రాజేశ్వరరావు, కొండేటి చిట్టిబాబు, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, అనంత ఉదయభాస్కర్, ఆకుల వీర్రాజు, రాష్ట్ర కార్యదర్శులు మిండగుదిటి మోహన్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు అడ్డగల సాయిరాం, చెల్లుబోయిన శ్రీనివాసరావు, దొమ్మేటి వెంకట శివరామన్, నీతిపూడి విలసిత మంగతాయారు, జంపల బుజ్జిరాజు, రాష్ట్ర బీసీ సెల్‌ సంయుక్త కార్యదర్శులు పితాని నరసింహారావు, రాష్ట్ర లీగల్‌ సెల్‌ కార్యదర్శి మంగిన సింహాద్రి, రాష్ట్ర ఐటీ విభాగం కార్యదర్శి సూరిశెట్టిబాబి, రాష్ట్ర ఎస్సీసెల్‌ కార్యదర్శి నల్లి డేవిడ్‌రాజ్, రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శులు యన్నాబత్తుల ఆనంద్, పేర్ని శ్రీనివాసరావు, రాష్ట్ర సేవాదళ్‌ కార్యవర్గ సభ్యుడు చల్లా ప్రభాకరరావు, రాష్ట్ర బీసీ విభాగం కార్యవర్గ సభ్యులు దొంగ నాగసత్యనారాయణ, బొమ్మిడి వెంకటేష్, కొండేటి గణేశ్వరరావు, రాష్ట్ర నాయకుడు కర్రి పాపారాయుడు, జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు జున్నూరి వెంకటేశ్వరరావు, అమలాపురం పార్లమెంటరీ జిల్లా మహిళా అధ్యక్షురాలు కాశీ మునికుమారి, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి విపత్తు వేణుగోపాల్, జిల్లా వాణిజ్య విభాగం కార్యదర్శి మంతెన రవిరాజు, జిల్లా బీసీ సెల్‌ అ«ధ్యక్షుడు మట్టపర్తి మురళికృష్ణ, అమలాపురం పార్లమెంటరీ జిల్లా యువజన విభాగం అ«ధ్యక్షుడు కసిరెడ్డి అంజిబాబు, అమలాపురం పార్లమెంటరీ జిల్లా సేవాదళ్‌ కార్యదర్శి నల్లమిల్లి గోవింద్‌రెడ్డి, జిల్లా నాయకుడు కె.ఎస్‌.ఎన్‌.రాజు, యువజన నాయకుడు జక్కంపూడి గణేష్, రాజమహేంద్రవరం కార్పొరేషన్‌ ఫ్లోర్‌లీడర్‌ మేడపాటి షర్మిలారెడ్డి, జిల్లా నాయకులు సాగి రామరాజు, తోటే జాన్‌బాబు, మామిడికుదురు, పి.గన్నవరం, అంబాజీపేట మండల కన్వీనర్లు కొమ్ముల రామచంద్రరావు, నక్కా వెంకటేశ్వరరావు, వాసంశెట్టి చినబాబు, రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి మండల కన్వీనర్లు గుబ్బల నారాయణరావు, అడబాల బ్రహ్మాజి, జిల్లెల బెన్ని సుధాకర్‌ 
పాల్గొన్నారు. 

కాపులను మోసం చేసిన చంద్రబాబు : జగన్‌
కాపులను బీసీల జాబితాలో చేరుస్తానన్న చంద్రబాబు ఆ మాట నిలబెట్టుకోకుండా వారిని మోసం చేశారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆక్షేపించారు. కాపు ఉద్యమ నేత అయిన ముద్రగడ పద్మనాభంతోపాటు, ఆయన కుటుంబ సభ్యులను దారుణంగా అవమానపర్చారని, చేయని నేరాలకు మరీ కేసులు పెట్టి వేధిస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి కులానికి ఒక పేజీ పెట్టి, ఏ ఒక్కటీ అమలు చేయకుండా, అన్ని కులాలను, మతాలను చంద్రబాబు మోసం చేశారన్నారు. ఇన్ని చేసిన చంద్రబాబు ముఖ్యమంత్రిగా కొనసాగడం ధర్మమేనా? అని ప్రశ్నించారు. మోసం చేయడంలో చంద్రబాబు పీహెచ్‌డీ చేశారని నాలుగేళ్లుగా ఏదీ పట్టించుకోని సీఎం, ఆరు నెలల్లో ఎన్నికలు జరగనుండడంతో ఇప్పుడు అన్నీ ప్రకటిస్తున్నారని ఆరోపించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top