ఊరూరా... ముందే వచ్చిన దసరా...

ys jagan mohan reddy praja sankalpa yatra in Bobbili constituency - Sakshi

బొబ్బిలి నియోజకవర్గంలో జననేతకు అఖండ స్వాగతం

దారి పొడవునా బారులు తీరిన పల్లెవాసులు

కష్టాలు తీర్చే నాయకుడొచ్చాడని వెల్లువెత్తిన నినాదాలు

ఆపదలో ఆదుకునే యోధుడొచ్చాడని సంబరాలు

జిల్లాలో ఐదు నియోజవకర్గాల్లో పూర్తయిన సంకల్ప యాత్ర

సాక్షిప్రతినిధి,విజయనగరం: జననేతను చూసి పల్లెలన్నీ ఉత్సాహంతో ఉప్పొంగాయి. కష్టాలు తీర్చే ఆశల రేడు వచ్చాడని పల్లెలన్నీ సంబరాలు చేసుకుంటున్నాయి. ఏ పల్లెలో చూసినా ఇప్పుడు దసరా ముందే వచ్చినట్టుంది. తమ నాయకుడు వచ్చాడన్న ఆనందంలో ఉబ్బితబ్బిబ్బవుతోంది. నాలుగేళ్ల టీడీపీ ప్రజా కంటక పాలన నుంచి విముక్తి కల్పించేందుకు నడిచొస్తున్న నవరత్నంగా భావిస్తూ ఘన నీరాజనం పలుకుతున్నారు. దారి పొడవునా అక్క చెల్లెమ్మలు.. అవ్వలు హారతులు పట్టారు.

 అలుపెరగని బాటసారికి  పూల బాటలు వేశారు. చౌదంతివలస గ్రామానికి చేరుకున్న జగన్‌మోహన్‌రెడ్డికి ఊరు ఊరంతా కదలివచ్చి ఆదరించింది. స్థానిక నాయుడువీధిలోని కొత్తపల్లి సీతాలక్ష్మి అనే వృద్ధ బ్రాహ్మణ మహిళ నుదుట తిల కం దిద్ది ఆశీర్వదించింది. రాజన్నబిడ్డను చూసేందుకు బయటకు వచ్చిన ఆమె కీళ్ల నొప్పులతో బాధపడుతూ ముందుకు కదల్లేని పరిస్థితిని స్వయంగా చూసిన జననేత స్వయంగా ఆమె వద్దకు వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తాను ఎంతగానో అభిమానించే జననేత స్వయంగా దగ్గరకు రావటంతో సీతాలక్ష్మి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. 

ఐదు నియోజకవర్గాల్లో యాత్ర పూర్తి
జన ప్రభంజనం నడుమ విజయనగరం జిల్లాలో అడుగుపెట్టిన వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప యాత్రకు ఆదినుంచీ అపూర్వ స్పందన లభిస్తోంది. ఇప్పటికే ఎస్‌కోట, విజయనగరం, నెల్లిమర్ల, చీపురుపల్లి, గజపతినగరం నియోజకవర్గాలను సోమవారానికి పూర్తి చేసుకుని బొబ్బిలి నియోజకవర్గంలోకి ప్రవేశించింది. సోమవారం దత్తిరాజేరు మండలంలోని ఎస్‌.బూర్జవలస క్రాస్‌ నుంచి విశాఖ–రాయపూర్‌ జాతీయ రహదారి మీదుగా జననేత పాదయాత్ర చౌదంతివలస క్రాస్, చౌదంతివలస గ్రామం మీదుగా బొబ్బిలి నియోజకవర్గంలోని బాడంగి మండలం పిండ్రంగివలసకు చేరుకుంది. మధ్యాహ్న భోజన విరామానంతరం ప్రారంభమై డొంకినవలస, పెదపల్లి క్రాస్, లక్ష్మీపురం క్రాస్‌ వద్ద ముగిసింది. 

అఖండ స్వాగతం పలికిన బొబ్బిలి
బొబ్బిలి నియోజకవర్గంలోకి ప్రవేశించిన జననేత పాదయాత్రకు అఖండ స్వాగతం లభించింది. నియోజకవర్గ  పార్టీ సమన్వయకర్త శంబంగి వెంకటచినఅప్పలనాయుడు, మాజీ ఎమ్మెల్సీ వాసిరెడ్డి వరదరామారావుతో పాటు అధిక సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు బాడంగి మండలం పిండ్రంగివలసకు పాదయాత్రగా చేరుకున్న జగన్‌మోహన్‌రెడ్డికి ఘన స్వా గతం పలికారు. తప్పెటగుళ్లు, డప్పు వాయిద్యాలు, మందుగుండు సామగ్రి పేలుళ్ల నడుమ అభిమాన నాయకుడికి అపురూప ఆహ్వానం పలికారు. పిండ్రంగివలస, డొంకినవలస, పె దపల్లి క్రాస్, లక్ష్మీపురం క్రాస్‌ ప్రాంతాల్లో జననేతను కలిసేందుకు పెద్ద సంఖ్యలో మహిళలు, రైతులు, కార్మికులు, యువ త,విద్యార్థులు తరలివచ్చారు. వారందరిని అప్యాయంగా పల కరిస్తూ, అభివాదం చేస్తూ జననేత జగన్‌ ముందుకు సాగారు. 

ఆపదలో ఉన్నాం..ఆదుకో అన్నా:
బాడంగి మండలం వీరసాగరం గ్రామానికి చెందిన వి.దాలమ్మ జననేతను కలిసి పప్పలలింగాల వలస నుంచి డొంకినవలస రైల్వేస్టేషన్‌ వరకు రోడ్డు ఆధ్వానంగా ఉందని ముఖ్యమంత్రి కాగానే తమ కష్టాలు తీర్చాలని కోరింది. బాడంగి మండలానికి చెందిన రైతులు పెద్దగెడ్డ జలాశయాన్ని విస్తరిస్తే అధిక మొత్తంలో ఆయకట్టుకు సాగునీరందుతుందని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం డీలర్లకు ఇస్తున్న కమీషన్‌ చాలటం లేదని, కమీషన్‌లు పెంచి తమకు న్యాయం చేయాలని రేషన్‌ డీలర్లు వేడుకున్నారు. పాచిపెంట జలాశయం నుంచి సాగునీరందించి 550 ఎకరాల్లో వ్యవసాయం చేసుకునేలా చూడాలని లక్ష్మీపురం రైతులు కోరారు. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ పింఛను ఇవ్వటం లేదని ఇదే విషయమై మంత్రి సుజయ్‌ కు ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవటం లేదని లక్ష్మీపురానికి చెందిన పలువురు మహిళలు జననేతకు చెప్పారు. వీరే కాకుండా అడుగడుగునా వివిధ వర్గాలవారు కలసి తమ సమస్యలు ప్రస్తావించారు. అందరితో ఆప్యాయంగా మాట్లాడిన వైఎస్‌ జగన్‌ వారికి భరోసా కల్పిస్తూ ముందుకు సాగారు. 

నాయకుడి వెంట నడిచిన పార్టీ శ్రేణులు
పాదయాత్రలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,   విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ఇన్‌చార్జి భూమన కరుణాకరరెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రొగ్రామ్స్‌ కమిటీ కోఆర్డినేటర్‌ తలశిల రఘురాం, పశ్చిమగోదావరి జిల్లా ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణరాజు,   జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య, విజయనగరం, అరకు పార్లమెంటరీ జిల్లాల అధ్యక్షులు బెల్లాన చంద్రశేఖర్, శత్రుచర్ల పరీక్షిత్‌రాజ్, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు, రాజానగరం నియోజకవర్గ సమన్వయకర్త జక్కంపూడి రాజా, బొబ్బిలి నియోజకవర్గ సమన్వయకర్త శంబంగి వెంకట చినఅప్పలనాయుడు, మాజీ ఎమ్మెల్సీ వాసిరెడ్డి వరదరామారావు, ఏలూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కోటగిరి శ్రీధర్, పోలవరం నియోజకవర్గ సమన్వయకర్త టి.బాలరాజు, పెద్దాపురం నియోజకవర్గ సమన్వయకర్త తోటనాయుడు  తదితరులు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top