అందరినీ ఆదుకుంటా..

ys jagan mohan reddy praja sankalpa yatra  - Sakshi

 జనంతో మమేకమవుతూ ముందుకు సాగుతున్న జననేత

 వైఎస్సార్‌సీపీకి ఓటేశామని  కక్ష సాధిస్తున్నారని పలువురి ఆవేదన

 ఏడాది ఓపిక పట్టండి అందరి కష్టాలు తీరుస్తామన్న వైఎస్‌జగన్‌

కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ప్రజాసంకల్పయాత్రలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఓపికగా సమస్యలు వింటూ.. అందరికీ ఆత్మీయతను పంచుతూ ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా దారి వెంబడి సమస్యలను చెప్పుకోవడానికి వచ్చిన వృద్ధులు, మహిళలు, వికలాంగులు, అన్నదాతలు..ఇలా ప్రతి ఒక్కరినీ వైఎస్‌ జగన్‌ ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలను ఆలకిస్తున్నారు. ప్రజాసంకల్పయాత్రసోమవారం బనగానపల్లె నుంచి బత్తులూరుపాడు, యనకండ్ల, హుస్సేనాపురం, పలుకూరు క్రాస్, గోవిందిన్నె, గోర్లగుట్ట వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ప్రజలు వైఎస్‌జగన్‌కు విన్నవించిన కొన్ని సమస్యలు, వినతులు..

రామకృష్ణాపురానికి చెందిన దేవదానమ్మ 12 ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్న భూమికి పట్టా ఇప్పించాలని విన్నవించింది. 

► తాము వైఎస్‌ఆర్‌సీపీకి ఓటు వేశామని తమకు ప్రభుత్వ పథకాలు అందడం లేదని లింగాలకు చెందిన కొందరు మహిళలు ఫిర్యాదు చేశారు.

► అవుకు మండలం అన్నవరం గ్రామం వైఎస్‌ఆర్‌సీపీకి అనుకూలంగా ఉండడంతో అక్రమంగా 20మందిపై కరెంట్‌ కేసులు పెట్టించారని ఆ సర్పంచ్‌ రఘురామి రెడ్డి తనయుడు సాయినాథ్‌రెడ్డి వైఎస్‌ జగన్‌ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.

► ‘నా భర్త సుబ్బారాయుడు మూడేళ్ల క్రితం చనిపోయాడు. అప్పటి నుంచి వితంతు పింఛన్‌ కోసం దరఖాస్తు చేస్తుంటే ఎవరూ పట్టించుకోవడం లే దు’ అని నాగలక్ష్మి ఫిర్యాదు చేసింది. 

 ‘ఐదేళ్ల క్రితం నా భర్త చనిపోయాడు. కుటుంబపోషణ కోసం కూలి పోతున్నా. వితంతు పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకుంటే ఎవరూ పట్టించుకోవడం లేదు’అని అవుకు మండలం మిచిరోళ్లకు చెందిన ఓబులమ్మ ఆవేదన వ్యక్తం చేసింది.

 తనకు మతిస్థిమితం లేని పిల్లవాడు ఉన్నాడని, వాడి పోషణకు ఆసరా కల్పిం చాలని, తనకు ఇల్లు కూడా లేదని బనగానపల్లెకు చెందిన షేకూన్‌బీ వాపోయింది.

 తాము వైఎస్‌ఆర్‌సీపీకి ఓట్లు వేశామని తమ గ్రామానికి ఇళ్లు, పింఛన్లు, మరుగుదొడ్లు ఇవ్వడం లేదని అవుకు మండలం ఇస్రానాయక్‌ తండా మహిళలు వైఎస్‌ జగన్‌కు విన్నవించారు. అదేవిధంగా రైతు హేమానాయక్‌కు చెందిన 9 ఎకరాల్లోని పొగాకు పంటకు కొందరు టీడీపీ నాయకులు నిప్పుపెట్టడంతో రూ.10 లక్షలు నష్టపోయాడని.. అతన్ని ఆదుకోవాలని ఆ మహిళలు కోరారు. 

పింఛన్లు రావడం లేదన్నా..
కోవెలకుంట్ల: బనగానపల్లె మండలం పలుకూరుకు చెందిన దివ్యాంగుడు శ్రీనివాసులు తనకు ప్రమాదంలో కాలు విరిగిందని, నాలుగేళ్ల నుంచి పింఛన్‌ కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోలేదని జగన్‌ ఎదుట వాపోయాడు. 

► ఉయ్యాలవాడ మండలం కాకరవాడకు చెందిన తన అక్క ఫకూర్‌బీకి వృద్ధాప్య పింఛన్‌ రావడం లేదని, అల్లుడు కమాల్‌షా రోడ్డు ప్రమాదంలో గాయపడి అవిటివాడయ్యాడని, ఇద్దరికీ పింఛన్‌ రాకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని రమీజాబీ వైఎస్‌ జగన్‌ ఎదుట వాపోయింది.

 బనగానపల్లె మండలం బత్తులూరుపాడుకు చెందిన కమాల్‌బీ తన కుమార్తెకు కళ్లు సరిగా కనిపించవని, తన కుటుంబాన్ని ఆదుకోవాలని జననేతకు విన్నవించుకుంది. అలాగే యనకండ్లకు చెందిన పలువురు ఏఎన్‌ఎంలు తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్‌ చేయాలని వైఎస్‌ జగన్‌కు వినతిపత్రం అందజేశారు. సమస్యలను ఓపికగా వైఎస్‌జగన్‌ స్పందిస్తూ వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అందరికీ న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top