అన్నదాతకు అభయం

ys jagan mohan reddy meeting Farmer communities in Kurnool - Sakshi

రైతులను అన్ని విధాలా ఆదుకుంటామన్న వైఎస్‌ జగన్‌ 

ముందుగానే గిట్టుబాటు ధర..నకిలీల నియంత్రణకు కఠిన చట్టాలు 

 ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ‘వైఎస్సార్‌ బీమా’ 

 జిల్లాలో ముగిసిన ప్రజాసంకల్ప యాత్ర 

 7 నియోజకవర్గాల్లో 263 కి.మీ నడిచిన జననేత 

 66 గ్రామాల్లో ప్రజలతో మమేకం 

 పల్లెపల్లెనా బ్రహ్మరథం పట్టిన జనం

సాక్షి ప్రతినిధి, కర్నూలు:  ప్రకృతి వైపరీత్యాలు ..నకిలీ పురుగు మందులు..గిట్టుబాటు ధర లేక నష్టపోతున్న అన్నదాతకు అండగా ఉంటామని ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి భరోసానిచ్చారు. తాము అధికారంలోకి వస్తే రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర ఆదివారం కర్నూలు జిల్లాలో ముగిసింది. జిల్లాలో 18 రోజులు.. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర సాగింది. 14 మండలాల్లోని 66 గ్రామాల మీదుగా 263 కిలోమీటర్ల మేర వైఎస్‌ జగన్‌ నడిచారు. ఈ సందర్భంగా చంద్రబాబు పాలనలో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివిధ వర్గాల ప్రజలు.. జననేత దృష్టికి తీసుకొచ్చారు. వారి సమస్యలను వింటూ.. వాటిని పరిష్కరించేందుకు తాను ఏమి చేయదల్చుకున్నాననే అంశాన్ని వివరిస్తూ జగన్‌ ముందుకు సాగారు. 

రైతులతో ముఖాముఖి.. 
జిల్లాలో ఆదివారం 18వ రోజు పాదయాత్ర పత్తికొండ నియోజకవర్గం తుగ్గలి మండలంలోని మదనంతపురం క్రాస్‌ నుంచి ప్రారంభమై.. చెరువు తండా వరకు 10.6 కిలోమీటర్ల మేర సాగింది. ఎర్రగుడి సమీపంలో రైతు సంఘాలు ఏర్పాటు చేసిన ముఖాముఖి సదస్సులో జగన్‌ ప్రసంగించారు. తాము అధికారంలోకి వస్తే ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను వైఎస్సార్‌ బీమా పథకం ద్వారా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా అప్పుల భారం ఆ కుటుంబంపై పడకుండా చూస్తామన్నారు. పంటకు ముందుగానే గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు. నకిలీ మందుల నియంత్రణకు కఠిన చట్టాలు తీసుకొస్తామని తెలిపారు. 

అన్ని వర్గాలతో మమేకమవుతూ..  
ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని చాగలమర్రి వద్ద నవంబరు 14న ప్రారంభమైన ప్రజాసంకల్ప యాత్ర డిసెంబరు 3వ తేదీ పత్తికొండ నియోజకవర్గం తుగ్గలి మండలంలోని చెరువు తండా వద్ద ముగిసింది. మొత్తం 263 కిలోమీటర్ల మేర సాగిన ఈ పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజలతో జననేత మమేకమయ్యారు. ఉద్యోగులు, రైతులు, మహిళలు, వృద్ధులు, కార్మికులు, కాంట్రాక్టు సిబ్బంది.. ఇలా అన్ని వర్గాల ప్రజలు తమ కష్టాలను, సమస్యలను విన్నవించారు.  తాము అధికారంలోకి వస్తే వాటిని పరిష్కరిస్తామని జననేత హామీ ఇచ్చారు. సీపీఎస్‌(కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌)ను రద్దు చేసి ఉద్యోగులకు అండగా ఉంటామని హామీనిచ్చారు. రైతులందరికీ ప్రతి ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్ల పాటు ఇస్తామన్నారు. దివ్యాంగులకు రూ.3 వేల పింఛన్‌ ఇస్తామని ప్రకటించారు. వైఎస్సార్‌ హయాంలో ప్రాణం పోసుకొని..ప్రస్తుతం నిలిచిపోయిన రాజోలి, జొళదరాశి రిజర్వాయర్లను నిర్మించడంతో పాటు గుండ్రేవుల ప్రాజెక్టును చేపడతామన్నారు. పిల్లలను చదివించాలని, అమ్మఒడి ద్వారా సహాయం చేస్తామని పేదల్లో ధైర్యం నింపారు.   

పల్లెపల్లెలో నీరా జనం
ప్రజాసంకల్ప యాత్రకు జిల్లాలో విశేష స్పందన లభించింది. పల్లెపల్లెనా ప్రజలు నీరాజనాలు పలికారు. జిల్లాలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి బలం తగ్గలేదని నిరూపించారు. ప్రధానంగా ఎమ్మెల్యేలు పార్టీ మారిన నియోజకవర్గాల్లో రెట్టించిన ఉత్సాహంతో ప్రజలు కదిలిరావడం కనిపించింది. జిల్లాలో ఆదివారం.. పాదయాత్ర ముగిసి అనంతపురం జిల్లాలోకి ప్రవేశించిన సందర్భంగా పార్టీ నేతలందరూ హాజరై జగన్‌కు వీడ్కోలు పలికారు.  

పాల్గొన్న నేతలు.. 
ఆదివారం పాదయాత్రలో కర్నూలు జిల్లా పార్టీ కో–ఆర్డినేటర్‌ మేకపాటి గౌతం రెడ్డి, నంద్యాల, కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు  శిల్పా చక్రపాణిరెడ్డి, బీవై రామయ్య, మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సాయిప్రసాద్‌ రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, గౌరు చరిత, ఐజయ్య, గుమ్మనూరు జయరాం, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు కాటసాని రామిరెడ్డి, కంగాటి శ్రీదేవి, హఫీజ్‌ఖాన్, ఎర్రకోట జగన్‌మోహన్‌రెడ్డి, మురళీకృష్ణ, ఎమ్మెల్సీ వెన్నెపూస గోపాల్‌రెడ్డి, పార్టీ నేతలు గౌరు వెంకటరెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, గంగుల నాని, శిల్పా రవిచంద్ర కిషోర్‌ రెడ్డి, ప్రదీప్‌రెడ్డి, తెర్నేకల్‌ సురేందర్‌రెడ్డి, మధుసూదన్, నాగరాజు యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.     

చంద్రబాబువన్నీ అబద్ధాలే
వైఎస్సార్‌సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి 
పత్తికొండ: గత ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేరలేదని, ఆయన చెప్పినవన్నీ అబద్ధాలేనని వైఎస్సార్‌సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణి రెడ్డి ధ్వజమెత్తారు. హామీల అమలు మరచిన బాబుకు ప్రజలే తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. తుగ్గలి మండల జి.ఎర్రగుడి గ్రామంలో ఆదివారం రైతు సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. జిల్లాలో రూ.800 కోట్లతో 106 చెరువులకు నీరిస్తానన్న చంద్రబాబు కనీసం తాగునీటి సమస్య కూడా పరిష్కరించలేక పోయారని విమర్శించారు. వ్యవసాయ రుణాలు రూ.లక్ష లోపు వడ్డీ లేకుండా, రూ.3 లక్షలలోపు పావలా వడ్డీకే ఇస్తామని చెప్పి చివరికి అన్నదాతలను నిట్టనిలువునా ముంచేశారన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారు మీ ఇంటికి తిరిగొస్తుందని చెప్పిన ఆయన మాటలు నమ్మి రైతులు మోసపోయారన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో టీడీపీ చెప్పినట్లు ప్రతి జిల్లాలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ఫుడ్‌ పార్కులు ఎక్కడ ఏర్పాటు చేశారని ప్రశ్నించారు. చంద్రబాబు నిర్వాకం వల్ల రాష్ట్రం అధోగతి పాలవుతోందన్నారు.  

ప్రజలు నరకం చూస్తున్నారు : గౌరు చరిత 
చంద్రబాబు పాలనలో అన్ని వర్గాల ప్రజలు కష్టాలు, ఇబ్బందుల మధ్య నరకం చూస్తున్నారని పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్‌ పాలనలో రైతులు, పొదుపు మహిళలు, విద్యార్థుల జీవితాల్లో సంతోషాలు ఉండేవన్నారు. చంద్రబాబు పాలనలో మూడేళ్ల నుంచి కరువు ఏర్పడినా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. పంట నష్ట పరిహారం ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెడుతోందన్నారు. ప్రభుత్వ నిర్వాకం వల్ల వ్యవసాయం చేయడానికి అన్నదాతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రాష్ట్రానికి అన్నం పెడుతున్న రైతులే అన్నమో రామచంద్రా అనే పరిస్థితికి తీసుకొచ్చిన చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి అన్నదాతలంతా సిద్ధంగా ఉన్నారని ఆమె అన్నారు. 

రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం 
వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్‌ నాగిరెడ్డి 
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు):  కర్నూలు పశ్చిమ ప్రాంత రైతులు కరువుతో అల్లాడిపోతున్నా.. రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోకుండా చోద్యం చూస్తోందని వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్‌ నాగిరెడ్డి విమర్శించారు. ఆదివారం రైతు సంఘాల ఆధ్వర్యంలో తుగ్గలి మండలం ఎర్రగుడి సమీపంలో నిర్వహించిన రైతు సదస్సులో ఆయన మాట్లాడారు. పంటలకు గిట్టుబాటు ధర లేక అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. చనిపోయిన రైతుల కుటుంబాలను ప్రభుత్వం తరఫున కనీసం పరామర్శించకపోవడం  దారుణమన్నారు. రాష్ట్రంలో అత్యధిక సాగు భూమి ఉన్న జిల్లా కర్నూలు అని, అత్యధిక పంటలు పండించే జిల్లా కూడా ఇదేనని అన్నారు. అయితే.. ప్రభుత్వ చర్యలతో అన్నదాతలు అప్పుల్లో కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయంలో వృద్ధిరేటు పెరగాలంటే కర్నూలు నుంచే అన్నదాతలకు ప్రభుత్వ సాయం పెరగాలన్నారు. ఎంఎస్‌ స్వామినాథన్‌ కమిటీ సిఫారసుల మేరకు  ఉత్పత్తి కంటే 50శాతం అధికంగా గిట్టుబాటు ధర ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కేంద్రం ధాన్యం కంటే గోధుమకు మద్దతు ధర అధికంగా ప్రకటించినా.. సీఎం చంద్రబాబు కనీసం లేఖ రాయలేదని విమర్శించారు. పోతిరెడ్డిపాడు నుంచి 44 వేల క్యూసెక్కుల నీరు వచ్చినప్పుడు మాత్రమే రాయలసీమలోని అన్ని ప్రాజెక్టులకు అందుతోందన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే అన్ని పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేస్తారన్నారు. వ్యవసాయంపై ఆయనకున్న అవగాహన అపరిమితమైందన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top