నాలుగేళ్లుగా మాయమాటలతో దగా

YS Jagan Mohan Reddy Fires on CM Chandrababu Naidu - Sakshi

రేషంపై సబ్సిడీ రూ.1000 ఇస్తామన్న చంద్రబాబు  

మూడేళ్లుగా ఇచ్చిన సబ్సిడీ అరకొరే

మీరు అధికారంలోకి వస్తేనే మాకు భరోసా  

ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ఎదుట చేనేతలు

ప్రొద్దుటూరు/ప్రొద్దుటూరు టౌన్‌:  చేనేతపై ఆధారపడిన తాము జీవితంలో ఎదురీదుతున్నామని... చేయూత ఇస్తామన్న చంద్రబాబు ప్రభుత్వం మాటలు తప్ప చేతల్లో చేసిందేమీ లేదని ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎదుట చేనేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఆదివారం వైఎస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరు మండల పరిధిలోని అమృతానగర్‌కు ప్రతిపక్ష నేత వచ్చారు. ఈ సందర్భంగా మార్గమధ్యలో చెన్నమరాజుపల్లె రోడ్డులో చేనేతలు తమ సమస్యలను తెలిపేందుకు రాట్నం తీసుకొచ్చి కూర్చున్నారు.

 రేషంపై ఇస్తున్న సబ్సిడీని 2016–17 ఆర్థిక సంవత్సరం నుంచి రూ.600 నుంచి రూ.1000కు పెంచుతున్నట్లు గత ఏడాది ఆగస్టు 6వ తేదీని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. అయితే ఆయన మాటలు అరకొరగానే అమలయ్యాయన్నారు. 2015–16లో ఇవ్వాల్సిన రూ.25 కోట్లకుగాను (రూ.600 చొప్పున) కేవలం రూ.3.5 కోట్లే ఇచ్చారన్నారు.   ఈ ఏడాది 8 నెలలు పూర్తయినా ఒక్క రూపాయీ ఇవ్వలేదన్నారు. దీంతో చేనేతపై ఆధారపడిన తామంతా అప్పుల్లో కూరుకుపోతున్నామని గద్గద స్వరంతో వివరించారు. వృత్తిని వదులుకోలేక, పిల్లలను చదివించుకోవడానికి కూలి పనులు చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మీరే సీఎం అయితే మా సమస్యలన్నీ పరిష్కారం అవుతాయన్న నమ్మకం కలిగిందని కె.కేశవులు, బి.లలిత, భాగ్యలక్ష్మి, మేరువ కిషోర్, వద్ది రంగ, విజయ్, పాల ప్రసాద్‌ తదితరులు జగన్‌తో అన్నారు. 

45 ఏళ్లకే చేనేతలకు పింఛన్‌ ఇస్తాం.. 
ఒక్క సంవత్సరం ఆగితే సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుందని వైఎస్‌ జగన్‌ వారికి ధైర్యం చెప్పారు. చేనేతలకు 45 ఏళ్లకే పింఛన్‌ ఇస్తామని, దాన్ని రూ.1000 నుంచి రూ.2000 పెంచుతామని ప్రకటించారు. ఒకే ఇంట్లో ఇద్దరు అర్హులు ఉంటే ఒకరికే ఇస్తున్నారని కొందరు జగన్‌ దృష్టికి తీసుకురాగా మన ప్రభుత్వం వస్తే ఇద్దరికీ పింఛన్‌ ఇచ్చే విధంగా చూస్తానన్నారు. ఈ సందర్భంగా జగన్‌ రాట్నంతో కొంతసేపు నూలు వడికారు. 

మాజీ ఎమ్మెల్యే హుకుం.. పట్టించుకోని జనం
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పయాత్రకు స్వాగతం పలికితే తీవ్ర పరిణామాలుంటాయని,  జరిమానా వేస్తామని టీడీపీ నాయకుడు, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులురెడ్డి జారీ చేసిన  హుకుంను ప్రొద్దుటూరు జనం పట్టించుకోలేదు. తన స్వగ్రామం కామనూరులో జగన్‌ను చూడటానికి ఎవరూ రాకుండా చేయాలని ఆయన ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా జగన్‌ యాత్రకు జనం పోటెత్తారు.  శనివారం రాత్రి వరదరాజులురెడ్డి అనుచరులు ప్రతి ఇంటికీ వెళ్లి హెచ్చరికలు జారీ చేశారు. జగన్‌ను ఆహ్వానిస్తూ ఎవరైనా ఫ్లెక్సీలు పెట్టినా, తోరణాలు కట్టినా వారి ఇళ్లకు కరెంటు, నీటి సరఫరా కట్‌ చేయిస్తామని బెదిరించారు. అయినా గ్రామస్తులు రాత్రే ఫ్లెక్సీలను ఏర్పాటు చేయగా వరద మద్దతుదారులు కాల్చివేశారు. ఎమ్మెల్యే రాచమల్లు ఆదివారం ఉదయమే కామనూరుకు వెళ్లారు. తన మద్దతుదారులతో మళ్లీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారు. జగన్‌ గ్రామం చేరుకోగానే ప్రజలంతా వీధుల్లోకి వచ్చి ఘనస్వాగతం పలికారు. ఆయనకు రక్షాబంధన్‌ కట్టి, తిలకం దిద్ది ముందుకు సాగనంపారు. వరదరాజులురెడ్డి నివాసం ఉన్న రాధానగర్‌లో కూడా జనం భారీసంఖ్యలో జగన్‌కు స్వాగతం పలికారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top