మన ప్రభుత్వం రాగానే.. అందరికీ న్యాయం చేస్తాం

YS Jagan mohan reddy fight public problem - Sakshi

అడుగడుగునా జననేతకు సమస్యలు విన్నవించిన అక్కచెల్లెమ్మలు

సాగు నీరందించాలని రైతుల వేడుకోలు

 పంటలకు గిట్టుబాటు ధర కల్పించండి

 చంద్రబాబు అన్నీ ఇస్తామంటాడు..ఏవీ ఇవ్వడు

 ఏడాది ఓపిక పట్టండి

 అందరినీ ఆదుకుంటాం

 ప్రజా సంకల్పయాత్రలో వైఎస్‌ జగన్‌ 

ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి ఆదివారం ప్రజాసంకల్పయాత్రలో ప్రజలు సమస్యలు ఏకరువు పెట్టారు. సాగునీటి వనరులు లేకపోవడంతో పంటలు సాగు చేసుకోలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.  ప్రకృతి వైపరీత్యాలతో పండిన పంటలు కూడా నాశనమవుతున్నాయని వాపోయారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే హంద్రీనీవా నుంచి అన్ని చెరువులకు నీరందించి వ్యవసాయాన్ని గట్టెక్కించాలని కోరారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల సమస్యలు విన్న వైఎస్‌ జగన్‌ స్పందిస్తూ..‘ఏడాది ఓపిక పట్టండి. మన ప్రభుత్వం వస్తానే అన్ని సమస్యలు పరిష్కరిస్తాం. అన్నదాతలను, అక్కచెల్లెమ్మలను ఆదుకుంటాం’’ అని భరోసా ఇచ్చారు.

ఆత్మకూరు/కోవెలకుంట్ల: తెలుగుదేశం ప్రభుత్వంలో అన్ని అర్హతలున్నా పింఛన్లు, రేషన్‌కార్డులు, పక్కాగృహాలు, వ్యక్తిగత మరుగుదొడ్లు ఇవ్వడం లేదు. డ్వాక్రా రుణాలు మాఫీ కాలేదు. వడ్డీలేని రుణాలు వర్తించడం లేదు. బ్యాంకుల్లో తీసుకున్న రుణాలకు వడ్డీ మీద వడ్డీ కడుతున్నాం’ అని జొన్నగిరి గ్రామానికి చెందిన మహిళలు లక్ష్మిదేవి, సుబ్బమ్మ, వీరమ్మ, వెంకటమ్మ, సరస్వతి, లక్ష్మమ్మలు వైఎస్‌ జగన్‌ ఎదుట వాపోయారు. దీనికితోడు పంటలు పండక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. 

చంద్రబాబు అబద్ధాలే చెప్తాడమ్మా..
వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ ‘చంద్రబాబు అన్నీ మాయ మాటలు చెబుతాడమ్మా.. చంద్రబాబుతో యుద్ధం చేస్తున్నామని, అబద్ధాలు ఆడతాడు. అందరనీ మోసం చేస్తాడు. అన్నీ ఇస్తామంటాడు.. ఒక్కటి కూడా ఇవ్వడు. మన ప్రభుత్వం వచ్చాక ఎన్నికల నాటికి పొదుపు రుణాలు ఎంత ఉంటాయో అంత మొత్తాన్ని నాలుగు విడతలుగా మీ చేతికి అందిస్తాను. పక్కాగృహాలు, పింఛన్లు కూడా అందిస్తాం. 

రైతులను ఆదుకోండన్నా..
కోవెలకుంట్ల: పందికోన రిజర్వాయర్‌ నీటితో చెరువులను నింపి పత్తికొండ నియోజకవర్గ రైతులను ఆదుకోవాలని ఉప్పరపల్లె రైతులు వైఎస్‌ జగన్‌కు విన్నవించారు. ప్రజా సంకల్పయాత్ర ఆదివారం జొన్నగిరి నుంచి ఎర్రగుడి మీదుగా సాగుతుండగా రైతులు సూర్యచంద్రారెడ్డి, నారాయణరెడ్డి, శేఖర్, రామాంజనేయులు, కృష్ణారెడ్డి తదితరులు సమస్యలు ఏకరువు పెట్టారు. నియోజకవర్గంలో సాగునీటి వనరులు లేకపోవడంతో వర్షాధారం కింద పంటలు సాగు చేస్తున్నామన్నారు. అతివృష్టి, అనావృష్టి వల్ల  పంటలు సరిగా పండక అప్పులపాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పందికోన రిజర్వాయర్‌ ద్వారా పత్తికొండ నియోజకవర్గంలోని చెరువులను నీటితో నింపి పొలాలకు పంట కాల్వలు ఏర్పాటు చేయాలన్నారు. పత్తికొండలో టమాటజ్యూస్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కోరారు. రైతులకు బ్యాంకుల ద్వారా వడ్డీలేని రుణాలు ఇవ్వాలని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని వైఎస్‌ జగన్‌కు వినతిపత్రం అందజేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top