ఎన్నికలు ఉంటేనే ప్రజలు గుర్తొస్తారా

ఎన్నికలు ఉంటేనే ప్రజలు గుర్తొస్తారా

- రోడ్‌షోలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజం

మూడున్నరేళ్లలో ఏ ఒక్క హామీనీ బాబు నెరవేర్చలేదు

నంద్యాల ప్రజలు న్యాయం వైపే నిలబడాలి  

 

నంద్యాల నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో దారుణమైన పాలన సాగుతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీనీ బాబు నెరవేర్చలేదు. మూడున్నరేళ్లలో ఎక్కడా అభివృద్ధి జరగలేదు. రెండు కిలోమీటర్ల మేర రోడ్డుకు ఇరువైపులా ఉన్న భవనాలను కూల్చివేయడమే అభివృద్ధి్ద  అంటూ ఫోజులు కొట్టుకోవడం చంద్రబాబుకే చెల్లింది. ఎన్నికలుంటేనే చంద్రబాబుకు ప్రజలు గుర్తుకొస్తారు. ఎన్నికలున్నా లేకపోయినా రైతులు, ప్రజలు, అక్కచెల్లెమ్మల మొహాల్లో ఎప్పుడూ చిరునవ్వులు చూడటమే నిజమైన అభివృద్ధి. నాకు అవకాశం వస్తే అభివృద్ధి అంటే ఏంటో నేను చేసి చూపిస్తా..’ అని ప్రతిపక్షనేత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నాల్గవరోజైన శనివారం రోడ్‌ షో గోస్పాడు మండలంలోని ఒంటెలగల గ్రామం నుంచి ప్రారంభమై గోస్పాడు, శ్రీనివాసపురం, యాళ్లూరు మీదుగా ఎం. కృష్ణాపురం వరకూ సాగింది. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ వాగ్దానాన్నీ అమలు చేయలేదు కాబట్టే.. చంద్రబాబు, ఆయన కొడుకుతోపాటు కేబినెట్‌ మొత్తం నంద్యాల రోడ్ల్లపై తిరిగే పరిస్థితి వచ్చిందని జగన్‌ అన్నారు. చంద్రబాబు పాలనలో ప్రతి సామాజికవర్గాన్నీ మోసం చేశారని విమర్శించారు. ‘ఎన్నికల హమీలలో ఒక్కటీ అమలు కాలేదని ప్రశ్నించే వారిపై కన్నెర్రజేస్తాడు. జైలుకు పంపిస్తానంటాడు. ఇలాంటి వ్యక్తికి ఉరిశిక్ష విధించినా తప్పేమీ కాదు’ అని అన్నారు.నంద్యాల ఉప ఎన్నిక న్యాయానికీ అన్యాయానికీ మధ్య జరుగుతున్న యుద్ధమని.. చివరకు న్యాయమే గెలుస్తుందని జగన్‌ పేర్కొన్నారు. భగవద్గీత, ఖురాన్, బైబిల్‌ సారాంశం ఇదేనని వ్యాఖ్యానించారు. నంద్యాల ప్రజలు ధర్మం, న్యాయం వైపు నిలబడాలని.. నంద్యాల బరిలో ఉన్న శిల్పామోహన్‌రెడ్డిని గెలిపించుకుని రానున్న కురుక్షేత్ర ఎన్నికలకు నాంది పలకాలని ప్రజలకు జగన్‌ పిలుపునిచ్చారు. రోడ్‌షోలో భాగంగా గోస్పాడు, యాళ్లూరు, ఎం. కృష్ణాపురం గ్రామాల్లో వైఎస్‌ జగన్‌ ప్రసంగం ఆయన మాటల్లోనే.. 

 

మోసం చేసేవాడు కావాలా..? మాట మీద నిలబడే వాడు కావాలా? 

‘‘ఇవాళ రాష్ట్రంలో దారుణమైన పాలన సాగుతోంది. ఇరిగేషన్‌ నుంచి మద్యం దాకా.. మట్టి నుంచి ఇసుక దాకా.. గుడి భూముల నుంచి రాజధాని భూముల దాకా దోచిన సొమ్ముతో ఎవరినైనా కొనొచ్చనే అహంకారం చంద్రబాబులో పెరిగిపోయింది. ఆయనకు కళ్లు నెత్తిన ఉన్నాయి.  ఎన్నికల ముందు ఒక మాట చెబుతారు. ఎన్నికలైన తర్వాత ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. చంద్రబాబులా అధికారం కోసం ఏ గడ్డి అయినా తినడానికి నా మనస్తత్వం ఒప్పుకోదు.. ఎన్నికల్లో గెలవడానికి ప్రజల్ని మోసం చేసినా పర్వాలేదనే గుణం నా దగ్గర లేదు. చంద్రబాబు పాలనపై, చేసిన మోసాలపై, అన్యాయాలపై ఓటు వేస్తా ఉన్నాం. మోసం చేసే వాడు కావాలా.. మాట మీద నిలబడే వాడు కావాలా ప్రజలే నిర్ణయించుకోవాలి. 

 

నంద్యాల ఎన్నికల్లో మళ్లీ అవే బొంకులు..!

సీఎంగా 2014 ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు కర్నూలు జిల్లాకు అనేక హామీలు గుప్పించారు. ఎయిర్‌పోర్టు, ఉర్దూ వర్శిటీ అన్నారు. కర్నూలును స్మార్ట్‌ సిటీగా చేస్తానన్నారు. త్రిపుల్‌ఐటీ, కర్నూలు ఆస్పత్రిని స్విమ్స్‌ తరహా సూపర్‌ స్పెషాలిటీగా, రైల్వే వ్యాగన్ల మరమ్మతు ఫ్యాక్టరీ, మైనింగ్‌ కళాశాల, ఫుడ్‌పార్క్, హైదరాబాద్‌–బెంగళూరు పారిశ్రామిక కారిడార్, టైక్స్‌టైల్‌ పార్కులు, గుండ్రేవుల ప్రాజెక్టు ఇలా అలవి కాని వాగ్దానాలు ఇచ్చాడు. ఒక్కటీ నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేశాడు. ఇప్పుడు మళ్లీ నంద్యాలలో అవే బొంకులు.. అవే వాగ్దానాలు. ఇప్పుడు దోచిన సొమ్ములో కొంత తీసుకొచ్చి నంద్యాల ఉప ఎన్నికల్లో ఓటర్లను, చిన్నాచితక నేతలను కొనుగోలు చేసేందుకు టీడీపీ నేతలు వస్తున్నారు.. రూ. 5వేలు చేతిలో పెట్టి ఓటు వేయమని అడుగుతున్నారు. ఏ దేవుడూ పాపానికి ఓటు వేయమని చెప్పడు.  పాపానికి ఓటు వేయమనేది దెయ్యాలు మాత్రమే. ధర్మం వైపే మేము ఉంటామని మనసులో తలచుకుని.. దెయ్యాల దగ్గర లౌక్యంగా వ్యవహరించి దుర్మార్గులను ఇంటికి పంపి ధర్మానికే ఓటు వేయండి’’ అని జగన్‌ అన్నారు.
Back to Top