జెండా పండుగ..జనాభిమానం నిండుగా

YS Jagan Independence day celebrations on a grand scale - Sakshi

     విశాఖ జిల్లా ఎర్రవరంలో పాదయాత్ర శిబిరం వద్ద ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు

     అభిమానుల మధ్య జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌

     పోటెత్తిన జనం.. పులకించిన ఎర్రవరం

ప్రజా సంకల్పయాత్ర నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ప్రజా సంకల్పయాత్ర కొనసాగిస్తున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం ఎర్రవరం జంక్షన్‌ వద్ద 72వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. తన బస వద్ద ఏర్పాటు చేసిన జాతీయ జెండాను ఆయన ఆవిష్కరించి, వందనం చేశారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధుల చిత్ర పటాలకు పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఉదయం నుంచే జోరుగా వర్షం పడింది. వర్షంలో తడిసిపోతూనే జగన్‌ జెండా వందనం కార్యక్రమంలో పాల్గొన్నారు. జగన్‌ను కలిసి, సెల్ఫీలు తీసుకునేందుకు యువత, మహిళలు పోటీపడ్డారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పాదయాత్రకు జగన్‌ బుధవారం విరామం ఇచ్చారు. 

అంతా కలగా ఉంది..
ఎర్రవరం జంక్షన్‌ వద్ద స్వాతంత్య్ర దినోత్సవాన్ని తిలకించేందుకు పరిసర ప్రాంతాల నుంచి జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. పాఠశాల విద్యార్థులు భరతమాత వేషధారణతో ఆకట్టుకున్నారు. స్కూల్‌ బస్సుల్లో వచ్చిన విద్యార్థులు అభిమాన నేతతో కలిసి మువ్వన్నెల జెండాకు వందనం చేశారు. ఆ ప్రాంతం మీదుగా వెళ్తున్న బస్సులన్నీ శిబిరం వద్దే నిలిచిపోయాయి. అభిమాన సంద్రాన్ని భద్రతా సిబ్బంది కూడా కట్టడి చేయలేకపోయింది. వచ్చిన ప్రతి ఒక్కరూ ఇదో మరపురాని అరుదైన కార్యక్రమంగా చెప్పుకున్నారు. ‘‘ఎర్రవరం ఎంతో అదృష్టం చేసుకుంది. ఇంత పెద్ద పండుగను ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి మా మధ్య జరుపుకోవడం కలగా ఉంది’’ అని స్థానికులు ముత్యాల నాయుడు, ఎర్రవారి వెంకన్న, సులక్షణ, మమత ఆనందం వ్యక్తం చేశారు. జగన్‌ జాతీయ జెండాను ఎగుర వేస్తున్నప్పుడు 70 ఏళ్ల వృద్ధుడు వీరరాఘవయ్య సంతోషం అంతా ఇంతా కాదు. చేతిలోని కర్రను కింద పడేసి చప్పట్లు కొట్టాడు. ‘‘ఎన్నో జెండా పండుగలు చూశాం బాబూ... కానీ మా ఊళ్లో జగన్‌ ఈ పండుగ చేయడం ఆనందంగా ఉంది’’ అని సంబరపడ్డాడు. 

రోజంతా సందడే సందడి
జెండా వందనం పూర్తయిన తర్వాత జగన్‌ బస చేసిన శిబిరం జనంతో కళకళలాడింది. అక్కడ జరిగిన కార్యక్రమాన్ని సెల్‌ఫోన్లలో బంధించారు. ఉదయం వీలుపడని వాళ్లు సైతం ఆ తర్వాత శిబిరం వద్దకు చేరుకున్నారు. సాయంత్రం మూడు గంటల వరకూ జనసందోహం ఏమాత్రం తగ్గలేదు. ‘‘మా పాప హైదరాబాద్‌లో ఉంది. మన ఊళ్లో జగనన్న ఎగురవేసే జెండా కార్యక్రమాన్ని వీడియో తీసి పంపమంది. ఇంకా పంపలేదేం? అంటూ ఇప్పటికీ ఆరుసార్లు ఫోన్‌ చేసింది’’ అని శృంగవరం నుంచి వచ్చిన లలిత చెప్పారు. ‘‘మా ఫ్రెండ్స్‌ జగనన్న కార్యక్రమాన్ని లైవ్‌ పెట్టమన్నారు. వాళ్లంతా ఫోన్లలో ప్రత్యక్షంగా చూస్తున్నారు’’ అని పల్లవి అనే యువతి పేర్కొంది. గుండెలోతుల్లోంచి పొంగుకొచ్చిన అభిమానం ఎర్రవరం శిబిరం వద్ద వెల్లువెత్తింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top