అవినీతిపై బ్రహ్మాస్త్రం

YS Jagan Government Sets Up Lokayukta To Target Corruption In The State - Sakshi

అయిదేళ్ల విరామం తర్వాత అనుకూలంగా అడుగులు

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చొరవతో చకచకా ఏర్పాట్లు 

త్వరలో లోకాయుక్త నియామకం

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో అవినీతికి అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా వైఎస్‌ జగన్‌ సర్కారు లోకాయుక్త ఏర్పాటుకు చకచకా ఏర్పాట్లు చేస్తోంది.  ప్రభుత్వం ఏర్పాటైన రెండు నెలల్లోనే లోకాయుక్త నియామకానికి వీలుగా శాసనసభ, శాసన మండలిలో చట్ట సవరణ చేసి గురువారం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. స్వతంత్ర ప్రతిపత్తిగల రాజ్యాంగ బద్ధమైన లోకాయుక్త ఉంటే తాను, తన కిచెన్‌ కేబినెట్‌ సభ్యులు సాగించే అవినీతి బట్టబయలయ్యే ప్రమాదం ఉందనే భయంతోనే ఇదివరకటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయిదేళ్లపాటు ఆ నియామకాన్ని గాలికి వదిలేశారు. ఎక్కడ అక్రమాలు జరిగినా, ప్రజాధనం దుర్వినియోగమైనా తనంతట తానుగా (సుమోటో) దర్యాప్తు చేసే అధికారం లోకాయుక్తకు ఉంటుంది. అవినీతి, అక్రమాలకు సంబంధించి పత్రికల్లో, టీవీల్లో, సోషల్‌ మీడియాలో వచ్చే వార్తలను, ఆకాశ రామన్న ఉత్తరాలను కూడా పరిగణనలోకి తీసుకుని విచారణ జరిపించే విస్తృతాధికారం లోకాయుక్తకు ఉంటుంది. అందువల్లే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లోకాయుక్త ఉండరాదనే ఉద్దేశంతో వ్యవహరించారు. 

భయంతోనే నాడు బాబు వెనుకంజ
అవినీతి రహిత, పారదర్శక పాలన అందిస్తానని ఎన్నికల ముందు చెప్పినట్లుగానే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆచరించి చూపుతున్నారు. తన మాటను విశ్వసించి అఖండ విజయం అందించిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని, ప్రతి రూపాయి ప్రజా ధనాన్ని పారదర్శకంగా, జవాబుదారీగా ఖర్చు చేయాలని అంకిత భావంతో పని చేస్తున్నారు. అధికారంలోకి రాగానే లోకాయుక్త నియామకం కోసం చట్ట సవరణ చేయడం, రూ.వంద కోట్లు దాటిన ప్రతి పనికి సంబంధించిన టెండర్లను న్యాయ సమీక్ష తర్వాత సవరణలు చేసి నిర్వహించాలని అసెంబ్లీలో సాహసోపేత బిల్లును ఆమోదించడం ఇందుకు ప్రత్యక్ష నిదర్శనాలు.

హైకోర్టు సిట్టింగ్‌ జడ్డి, రిటైర్డు ప్రధాన న్యాయమూర్తి దొరకడం లేదనే సాకుతోనే చంద్రబాబు సర్కారు లోకాయుక్తను నియమించకుండా వదిలేసింది. గతంలో కర్ణాటక రాష్ట్రంలో ఇనుప ఖనిజ లైసెన్సుల జారీలో, తవ్వకాల్లో జరిగిన అక్రమాలను అక్కడి లోకాయుక్త ఎండగట్టింది. దీనిని సుమోటోగా తీసుకుని దర్యాప్తు జరిపి నిగ్గుతేల్చింది. ఈ దృష్ట్యా లోకాయుక్తను నియమిస్తే ఎప్పటికైనా తనకూ ఇదే గతి పడుతుందని భయంతోనే చంద్రబాబు ఆ పని చేయలేదని అప్పట్లో అధికార వర్గాలు బహిరంగంగానే వ్యాఖ్యానించాయి. 

రెండు నెలల్లోనే ఆచరణ
మే 30న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జూన్‌ 8న మంత్రివర్గం ఏర్పాటు చేశారు. తర్వాత నెల రోజులకే అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్‌ లోకాయుక్త సవరణ బిల్లును శాసనసభ, శాసనమండలిలో పెట్టారు. దీనిని ఆమోదించి ఆంధ్రప్రదేశ్‌ లోకాయుక్త సవరణ చట్టం – 2019 తెచ్చారు. హైకోర్టు సిట్టింగ్‌ జడ్జి లేదా హైకోర్టు రిటైర్డు చీఫ్‌ జస్టిస్‌లను లోకాయుక్తగా నియమించాలని గతంలో చట్టం ఉండేది. వీరు తగు సంఖ్యలో అందుబాటులో లేనందున హైకోర్టు రిటైర్డు జడ్జిలను లోకాయుక్తగా నియమించడానికి వీలు కల్పిస్తూ చట్ట సవరణ చేశారు. తక్షణమే ఈ చట్టం అమల్లోకి వచ్చినట్లు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్పీ సిసోడియా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారమే గెజిట్‌ నోటిఫికేషన్‌ కూడా జారీ చేసింది. దీంతో ప్రభుత్వం లోకాయుక్త నియామకానికి నోటిఫికేషన్‌ ఏ క్షణమైనా జారీ చేసే అవకాశం ఉంది.     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top