బాబు జమానాలో సర్వం గోవిందా

ys jagan fires on cm chandrababu naidu in praja sankalpa yatra - Sakshi - Sakshi - Sakshi - Sakshi - Sakshi

నాడు తొమ్మిదేళ్లు, ఇపుడు నాలుగేళ్ల పాలనే సాక్ష్యం

వెల్దుర్తి బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శ 

సంక్షేమ పథకాలతో సహా అన్నింటికీ మంగళం 

బాబును కుర్చీ నుంచి దించితేనే మళ్లీ మంచి రోజులు

‘చంద్రబాబు 1995 నుంచి 2004 వరకు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు. మళ్లీ ఇపుడు నాలుగేళ్లుగా ఆయనే సీఎం కుర్చీలో కూర్చున్నారు. దీంతో మద్య నిషేధం గోవిందా.. అందాక ఉన్న 2 రూపాయలకు కిలో బియ్యం సబ్సిడీ గోవిందా.. అందాక ధైర్యంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు భరోసా గోవిందా.. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ గోవిందా.. వ్యవసాయం గోవిందా.. వర్షాలు గోవిందా.. ఇళ్ల నిర్మాణం గోవిందా.. పెన్షన్లన్నీ గోవిందా..  అన్నీ గోవిందానే..’ – ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : ‘‘చంద్రబాబు హయాంలో సంక్షేమ పథకాలతో సహా సర్వం గోవిందా.. నాటి తొమ్మిదేళ్ల జమానాలో గానీ, ఇపుడు నాలుగేళ్ల పాలనలో గానీ అది మనం స్పష్టంగా చూడవచ్చు. అలాంటి చంద్రబాబు ముఖ్యమంత్రి కుర్చీ నుంచి దిగిపోతేనే రాష్ట్రానికి మళ్లీ మంచి రోజులు వస్తాయి’’ అని ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు పాలనలో అవస్థలు పడుతున్న ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు, వారికి అండగా ఉంటానని భరోసా కల్పించేందుకు వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో దిగ్విజయంగా కొనసాగుతోంది. 16వ రోజైన గురువారం వెల్దుర్తిలో నిర్వహించిన బహిరంగ సభలో నాలుగేళ్ల చంద్రబాబు పాలనపై వైఎస్‌ జగన్‌ నిప్పులు చెరిగారు. ఆయన అధికారంలో ఉన్నన్నాళ్లూ ప్రజా సంక్షేమం సర్వం గోవిందా.. అవుతోందన్నారు. ఒక్క ఫోన్‌కాల్‌తో కుయ్‌ కుయ్‌ మంటూ అంబులెన్స్‌ రావాలన్నా... ప్రతీ పేద విద్యార్థికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ దక్కాలన్నా.. డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు బ్యాంకు రుణాలు అందాలన్నా.. అవ్వాతాతలకు పింఛన్లు ఇవ్వాలన్నా..  రైతన్న బతుకు చిత్రం మారాలన్నా.. చంద్రబాబు సీఎం కుర్చీ నుంచీ దిగిపోతేనే సాధ్యమన్నారు. జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

బాబు పాలనపై విసుగెత్తిన జనం
‘‘ముఖ్యమంత్రి సీటు కోసం చంద్రబాబు చెప్పని అబద్ధాలు లేవు. ఇవ్వని హామీలు లేవు. ప్రతీ సామాజిక వర్గాన్నీ మోసం చేశారు. ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. నాలుగేళ్ల పాలనపై ప్రజలు విసుగెత్తిపోయారు. మరో ఏడాదిలో ఎన్నికలు వస్తున్నాయని ఆయనే చెప్పారు. ఈ సంవత్సరం తరువాత మనకు ఎలాంటి నాయకుడు కావాలని మన మనస్సాక్షిని అడగాలి. మోసం చేసే, అబద్ధాలు చెప్పే నాయకత్వం కావాలా? ప్రజలను ఆదుకునే నాయకత్వం కావాలా? చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి నిజమైన నాయకుడు వస్తేనే, విశ్వసనీయత అనే పదానికి అర్థం తెలుస్తుంది. చంద్రబాబు పాలన చూస్తుంటే ఏం గుర్తుకొస్తుందంటే... బడుల్లో చిన్న పిల్లలు ఆడుకునేందుకు పెద్ద బల్ల ఉంటుంది. ఒక వైపు ఒకరు, మరోవైపు ఇంకొకరు కూర్చుంటారు. బరువు ఎక్కువ ఉన్న వారు కిందకి వెళ్తారు. బరువు తక్కువ ఉన్న వారు పైకి లేస్తారు. మార్కెట్‌లో కాటా కూడా అంతే.. బరువు తక్కువ ఉన్న వైపు పైకి వెళ్లిపోతుంది. చంద్రబాబు కూడా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోగానే పేదలకు అందే సబ్సిడీ, సంక్షేమ పథకాలు అన్ని కూడా బరువు తగ్గిపోయి గాలిలో వేలాడుతున్నాయి.

మళ్లీ మంచి రోజులు రావాలి
చంద్రబాబును కుర్చీలోంచి దించితేనే రాష్ట్రానికి మళ్లీ మంచి రోజులు వస్తాయి. చరిత్ర కూడా ఇదే చెబుతోంది. చంద్రబాబు ఉన్నపుడు ఎలా ఉంది? వైఎస్‌ఆర్‌ ఉన్నపుడు ఎలా ఉంది? మరలా ఇపుడు చంద్రబాబు వచ్చినపుడు ఎలా ఉంది అనేది చరిత్ర స్పష్టంగా చెబుతోంది. ఈ దుర్మార్గపు పాలన పోవా లి. మళ్లీ మంచి రోజులు రావాలి. ఇదే నియోజకవర్గంలో వైఎస్సార్‌ హయాంలో హంద్రీ–నీవా కింద కృష్ణగిరి, పందికోన ప్రాజెక్టులకు రూ.190 కోట్లు ఖర్చు చేసి యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టులు పరుగు లు పెట్టేలా చేశారు. పిల్లకాల్వలు తవ్వించినా రైతులకు మేలు జరుగుతుంది. అలాంటి పిల్ల కాల్వలను కూడా తవ్వించలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. కర్నూలు జిల్లాలోని రామళ్లకోట, మద్దికెర, తుగ్గలి, ఆర్‌ఎస్‌ పెండేకల్‌లో నాలుగు చోట్ల ఎస్సీ హాస్టళ్లు, గోవర్ధనగిరి, ఎరుకల చెరువు వద్ద రెండు బీసీ హాస్టళ్లను ప్రభుత్వం మూసివేసింది. ఈ పరిపాలనలో మంచి చేయకపోగా చెడుచేసే పరిస్థితి వచ్చింది.

న్యాయం లేదు.. ధర్మం లేదు..
అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయని, తమ గోడు చెప్పుకోవాలని కొంతమంది రైతులు ప్రయత్నించారు. నకిలీ నారుతో నష్టపోయి, మిర్చి పంటను కోల్పోయిన ఆ రైతులు తమ బాధ చెప్పుకోవాలని వెళితే చంద్రబాబు సర్కారు వాళ్లను నిర్దాక్షి ణ్యంగా జైలులో పెట్టింది. వేధించింది. అవమానిం చింది. ఇక ముందు ధర్నాలు చేయబోమని రాయించి వారితో సంతకాలు తీసుకున్నారట.  ఈ పాలనలో న్యాయం, ధర్మం లేదు. ప్రశ్నించేవారిని చంపించేవరకూ పోతోంది ఈ పరిపాలన. పత్తికొండ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ శ్రీదేవి భర్త నారాయణరెడ్డిని పట్టపగలే దారుణంగా చంపారు. శ్రీదేవికి ఈ నియోజకవర్గ ప్రజలంతా తోడుగా నిలవాలి. 

అండగా నిలబడేందుకే వచ్చా..
రాష్ట్రంలో మోసపోయిన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితిపై చలించి పాదయాత్ర చేపట్టాను. రైతులు, డ్వాక్రా మహిళలకు, విద్యార్థులకు, అవ్వతాతలకు, ఉద్యోగులకు తోడుగా ఉండేందుకు.. నేనున్నాను భయపడొద్దు.. అంటూ వారికి ధైర్యం చెప్పేందుకు ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్నాను. రాష్ట్రంలో దుర్మార్గమైన ప్రభుత్వాన్ని సాగనంపేందుకు, మన అందరి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరూ కలిసి నడవాలి. ఇప్పటికే ప్రకటించిన నవరత్నాల పథకాల్లో మార్పులు, చేర్పులు ఉంటే సలహాలు ఇవ్వండి. అన్నీ తీసుకుంటాం.’’ అని జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.

మళ్లీ అదే ఖర్మ  
మన ఖర్మ కొద్దీ చంద్రబాబు మళ్లీ సీఎం అయ్యాడు. మళ్లీ ఆ త్రాసు మీద బరువు పెరిగింది. చంద్రబాబు బరువు పెరిగే సరికి రైతుల అప్పులూ పెరిగాయి. డ్వాక్రా సంఘాలకు రుణాలు వడ్డీలతో సహా పెరిగిపోయాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పూర్తిగా తగ్గింది. ఫీజులు విపరీతంగా పెరిగాయి. కరెంటు చార్జీలు, ఆర్టీసీ చార్జీలు మూడుసార్లు పెరిగాయి. 108కు ఫోన్‌ కొడితే ఎప్పుడు వస్తుందో తెలియదు. 104 గ్రామాల్లో ఎక్కడా కనిపించడం లేదు. ఆరోగ్యశ్రీ పథకం హైదరాబాద్‌లో చెల్లదట. వైద్యం చేయరట. పేదవాడు ఎక్కడున్నా చనిపోవాల్సిందేనట. మళ్లీ పాతరోజులు వచ్చాయి. పరిశ్రమలు రావడం లేదు. ఉన్నవీ మూతపడుతున్నాయి. డోన్‌ నియోజకవర్గంలో నాపరాయి పాలిషింగ్‌ యూనిట్లు మూతపడ్డాయి. అంతకుముందు యూనిట్‌ రూ.3.70 ఉన్న కరెంటు చార్జీలు రూ.8.70కి పెరిగాయి. అందుకే పరిశ్రమలన్నీ మూతపడుతున్నాయి. ఉద్యోగాలన్నీ హుష్‌కాకి. అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులంతా భయం భయంగా బతుకుతున్నారు. ఇళ్ల నిర్మాణం లేదు. భూ పంపిణీ ఆగిపోయింది. పైగా పేదల భూములు లాక్కుంటున్నారు. ప్రత్యేక హోదాను గాలికొదిలేశారు. రేషన్‌ షాపుల్లో బియ్యం తప్ప మరేమీ ఇవ్వడం లేదు.  ఆ బియ్యం కూడా అవ్వాతాతల వేలిముద్రలు పడటం లేదని ఎగరగొడుతున్నారు. 

వైఎస్‌వచ్చారు.. వెలుగులు తెచ్చారు..
బాబు దిగిపోయి దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి అధికారంలోకి రాగానే ఉచిత విద్యుత్‌ వచ్చింది. కరెంటు బకాయిలు రద్దయిపోయాయి.. బాబు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోగానే ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ వచ్చింది. పిల్లల చదువులు బ్రహ్మాండంగా నడిచాయి. చంద్రబాబు కుర్చీ నుంచి దిగిపోగానే వచ్చిన నాన్నగారు ఏకంగా 24 లక్షల ఇళ్లు కట్టి రికార్డు సృష్టించారు. బాబు దిగిన తర్వాతే రాష్ట్రంలో 32 లక్షల ఎకరాల భూ పంపిణీ జరిగింది. జలయజ్ఞం ప్రారంభమయ్యింది. ఈ ప్రాంతంలోని కృష్ణగిరి రిజర్వాయర్‌ సహా అన్నీ ముందడుగు వేశాయి. గ్యాస్‌ ధర పెరిగినా వైఎస్సార్‌ భరించారు. కరెంటు, ఆర్టీసీ చార్జీలు పెంచని పరిపాలనను జనం చూశారు. 108, 104 పథకాలు వచ్చాయి. పేదవాళ్లకు ఉచితంగా మందులు ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఆరోగ్య శ్రీతో ప్రతి పేదవాడికి ఉచిత వైద్యం అందించారు. రూ.2కు కిలో బియ్యం పరుగెత్తుకుంటూ వచ్చాయి.

వైఎస్సార్‌సీపీలోకి తాళ్లరేవు మాజీ ఎమ్మెల్యే
తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మాజీ ఎమ్మెల్యే దొమ్మేటి వెంకటేశ్వర్లు వైఎస్సార్‌సీపీలో చేరారు. గురువారం ఆయన ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్‌తో పాటు వెల్దుర్తి మండలం రామళ్లకోట సమీపంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. జగన్‌ కండువా కప్పి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. వెంకటేశ్వర్లు వైఎస్సార్‌ హయాంలో 2004–2009 మధ్య తాళ్లరేవు ఎమ్మెల్యేగా పనిచేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top