'వైఎస్సార్‌ కుటుంబం'లో 38 లక్షల మంది

'వైఎస్సార్‌ కుటుంబం'లో 38 లక్షల మంది - Sakshi


సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన 'వైఎస్సార్‌ కుటుంబం' కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. 11 రోజుల్లో 38 లక్షల మంది వైఎస్సార్ కుటుంబంలో చేరారు. సెప్టెంబర్ 11న ప్రారంభమైన ఈ కార్యక్రమం అక్టోబర్‌ 2వ తేదీ వరకు కొనసాగుతుంది. దీనిపై ఈనెల 24న మధ్యంతర సమీక్ష నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. లండన్‌ నుంచి తిరిగొచ్చిన ఆయన శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో సీనియర్‌ నాయకులు, ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. 'వైఎస్సార్‌ కుటుంబం'పై రెండు దశల్లో సమీక్ష నిర్వహించాలని నిర్ణయించారు.మొదటి దశలో రాష్ట్రస్థాయిలో ముఖ్యనేతలతో వైఎస్‌ జగన్‌ సమీక్ష జరుపుతారు. భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేస్తారు. రెండో దశలో నియోజకవర్గ స్థాయిలో బూత్‌ కార్యకర్తలతో పార్టీ ఎమ్మెల్యేలు, ఇంచార్జ్‌లు, సమన్వయకర్తలు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారు. ఇప్పటి వరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన ఫిర్యాదులపై సమీక్షిస్తారు.ప్రతి ఇంటికీ వైఎస్సార్‌ సీపీ బూత్ కమిటీ సభ్యులు

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉజ్వల భవిష్యత్తు కల్పించాలనే భావనతో సెప్టెంబర్ 11న వైఎస్సార్‌ కుటుంబం కార్యక్రమాన్ని వైఎస్సార్‌ సీపీ ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు శిక్షణ పొందిన 4.3 లక్షల వైఎస్సార్‌ సీపీ బూత్ కమిటీ సభ్యులు రాష్ట్రంలోని ప్రతీ గడపకు వెళ్తున్నారు. ఒక్కొక్కరు రోజుకు రెండు కుటుంబాలను విధిగా కలుస్తున్నారు. ప్రతి ఇంట్లో ఆ సభ్యుడు కనీసం 20 నిమిషాల పాటు కూర్చొని సీఎం చంద్రబాబు పాలనపై రూపొందించిన 100 ప్రశ్నలకు వారితోనే మార్కులు వేయిస్తున్నారు. అదే సమయంలో దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ఆయన స్వర్ణయుగం గురించి కూడా వివరిస్తున్నారు. ఆ తర్వాత వైఎస్సార్‌ కుటుంబంలో చేరడానికి 9121091210 మొబైల్‌ నంబర్‌కు మిస్డ్‌ కాల్‌ ఇప్పిస్తున్నారు. వెంటనే అదే నంబర్‌ నుంచి పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నుంచి వాయిస్‌ కాల్‌ వస్తుంది. ఈ కార్యక్రమం అక్టోబర్‌ 2 వరకు కొనసాగుతుంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top