సంతసించిన అన్నదాత

YS Jagan Announces Special Schemes for Farmers - Sakshi

పంట స్థిరీకరణ నిధి ఏర్పాటు

గిట్టుబాటు ధర కల్పిస్తానన్న జగన్‌

6.5 లక్షల రైతు కుటుంబాల్లో ఆనందం

భీమవరం : ఆరుగాలం కష్టించి పంటలు పండిస్తున్న అన్నదాతలు నిత్యం అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. పంటలకు గిట్టుబాటు ధర దక్కక, ప్రకృతి వైపరీత్యాలు కారణంగా తీవ్రంగా నష్టపోతున్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన రుణమాఫీ హామీని మూడున్నరేళ్లు గడిచినా పూర్తిస్థాయిలో అమలు చేయడంలేదు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్రలో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు, పంట నూర్పిడికి ముందుగానే రైతులకు గిట్టుబాటు ధర, రైతు భరోసా పథకంలో ప్రతి రైతుకు రూ. 50 వేలు సహాయం చేస్తామని ప్రకటించడంతో రైతుల్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తుతున్నాయి. జగన్‌మోహన్‌ రెడ్డి గతంలో ప్రకటించిన నవరత్నాలలో రైతన్నకు పంటసాగు ఖర్చుకుగాను నాలుగేళ్లపాటు ప్రతి ఏటా రూ. 12,500 చొప్పున రూ. 50వేలు సహాయం అందిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికితోడు ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని, తక్కువ ధరకు పంటలను విక్రయించాల్సి వస్తే గిట్టుబాటు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ప్రకటించడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు జగన్‌ ప్రకటనపై తమ స్పందనను ‘సాక్షి’తో పంచుకున్నారు.

నూర్పిడి ముందే గిట్టుబాటు ధర మేలు
– బి.రాంబాబు, రైతు, కొండేపూడి
నేను సుమారు 4 ఎకరాలు కౌలు చేస్తున్నాను. వేలల్లో పెట్టుబడి పెట్టడం జరుగుతుంది. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో అయినకాడికి అమ్ముకోవాల్సిన పరిస్థితి. దాంతో పంటసొమ్ము పెట్టుబడికి సరిపోతుంది. ప్రతిపక్షనేత జగన్‌మోహన్‌ రెడ్డి పంట మాసూళ్లకు ముందే గిట్టుబాటు ధర కల్పిస్తానని చెప్పడం ఎంతో సంతోషంగా ఉంది. ఇప్పటి వరకూ ప్రభుత్వాలు పంటంతా అమ్ముకున్న తరువాత గిట్టుబాటు ధర కాస్తోకూస్తో పెంచడం చూశాను. జగన్‌ హామీ కౌలు రైతులకు ఎంతో మేలు చేసే విధంగా ఉంది.

చంద్రబాబు రుణమాఫీ వడ్డీకి సరిపోలేదు
గాదం వెంకటరామారావు, రైతు, విస్సాకోడేరు
రైతు రుణమాఫీ చేస్తానన్న చంద్రబాబునాయుడు సక్రమంగా రుణమాఫీ చేయలేదు. ఆయన చేసిన కాస్తోకూస్తో రుణమాఫీ వడ్డీలకు కూడా సరిపోలేదు. దాంతో రైతులు బ్యాంక్‌కు అప్పుదారులుగా మిగిలిపోయారు. జగన్‌మోహన్‌ రెడ్డి రైతు రుణమాఫీ సొమ్మును నేరుగా వారి చేతికి ఇచ్చి అప్పుతీర్చుకునే విధానాన్ని ప్రకటించడం చాలా గొప్పగా ఉంది. రైతు భరోసా కింద సన్న, చిన్నకారు రైతులకు రూ.50 వేలు రుణాలు అందిస్తే పెట్టుబడికి రైతులు వ్యాపారుల వద్ద అప్పులు చేయనవసరం లేదు. జగన్‌మోహన్‌రెడ్డి రైతులకు ఇచ్చిన హామీలు చాలా బాగున్నాయి.

ధరల స్థిరీకరణతో రైతులకు భరోసా
– కొప్పర్తి సత్యనారాయణ, రైతు,  యనమదుర్రు
రైతులు పండించే పంటకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వస్తుంది. పంటలు చేతికి వచ్చే సమయంలో ధరలు తక్కువగా ఉండడం, రైతుల వద్ద ధాన్యం వ్యాపారుల వద్దకు చేరిన తరువాత ధరలు పెరగడం షరా మామూలైంది. ఇటువంటి తరుణంలో జగన్‌మోహనరెడ్డి ధరల స్థిరీకరణకు భరోసా ఇవ్వడం రైతులకు ఆనందదాయకమైన విషయం.

రైతులను ఆదుకుంటానని చెప్పడం మంచి పరిణామం
– వీరవల్లి శ్రీనివాసరావు, రైతు, వీరవల్లివారిపాలెం
అధికారంలోకి రాగానే రైతులను ఆదుకుంటానని వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి ప్రకటించడం మంచి పరిణామం. రైతులకు ఎంత చేసినా తక్కువే. రుణమాఫీ, బంగారు వస్తువులకు మాఫీ చంద్రబాబు పానలలో వర్తించలేదు. రైతుల కోసం ప్రస్తుత ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదు. జగన్‌ ఇచ్చిన హామీలు అమలు చేస్తారు.

పెట్టుబడి సహాయం అందిస్తే వడ్డీ భారం తగ్గుతుంది
– అడ్డాల పెద్దిరాజు, రైతు, తుందుర్రు
సన్న, చిన్నకారు రైతులు వ్యవసాయం చేయాలంటే పంటల సీజన్‌ సమయంలో పెట్టుబడుల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. బ్యాంకులు సకాలంలో రుణాలు ఇవ్వక పోవడంతో పెద్ద మొత్తం వడ్డీకయినా తెచ్చుకోక తప్పడం లేదు. వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు జగన్‌ మోహనరెడ్డి ప్రతి ఏటా రూ.12,500 పెట్టుబడి సహాయం అందిస్తే రైతులకు వడ్డీ వ్యాపారుల బాధ తప్పుతుంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top