జనం మండిపడుతున్నారు

జనం మండిపడుతున్నారు - Sakshi


నెల తిరక్కుండానే బాబుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి

 

శ్రీకాకుళం: ‘‘ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో దారుణమైన పరిపాలన సాగిస్తున్నారు. సాధారణంగా ఏ సీఎంకైనా ప్రజావ్యతిరేకత ఏర్పడటానికి రెండేళ్లు పడుతుంది. కానీ బాబు ప్రభుత్వం ఏర్పడి నెల గడవకముందే ప్రజలంతా ఆయన ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అని ఎదురుచూస్తున్నారు. ఆయన గ్రాఫ్ అంత దారుణంగా పడిపోయింది’’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. ఈ రోజు తిరిగి ఎన్నికలు పెట్టండి.. వైఎస్సార్‌సీపీ 167 అసెంబ్లీ సీట్లు గెలుచుకుంటుందని చంద్రబాబుకు సవాల్ విసిరారు. రుణమాఫీపై మాయమాటలు చెబుతున్న చంద్రబాబు చివరికి నిరుద్యోగులకు ఇవ్వాల్సిన ఉద్యోగాలు, నిరుద్యోగ భృతిపైనా యూ టర్న్ తీసుకున్నారని ధ్వజమెత్తారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పిన పెద్దమనిషి, ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తానని తానెప్పుడూ చెప్పలేదంటున్నారని విమర్శించారు. ‘‘జాబు కావాలంటే బాబు రావాలన్నారు. కానీ బాబు వచ్చాక ఉన్న ఉద్యోగాలు ఊడిపోతున్నాయని జనం మండిపడుతున్నారు’’ అని విమర్శించారు.ఆంధ్రా విద్యార్థుల ఫీజులు కట్టమని తెలంగాణ ప్రభుత్వం మొండికేస్తుంటే కనీసం అక్కడ విద్యార్థుల గురించి పట్టించుకోవడం లేదన్నారు. ఏపీలోనూ రూ.1500 కోట్ల ఫీజు బకాయిలున్నాయని గుర్తుచేశారు. డ్వాక్రా రుణాల్ని మాఫీచేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు ఆ ఊసే ఎత్తకపోవడంపై మహిళలు నిరసన వ్యక్తం చేస్తున్నారన్నారు. చెన్నై దుర్ఘటనలో మృతి చెందిన బాధితుల కుటుంబాలను శ్రీకాకుళం జిల్లాలో పరామర్శిస్తున్న జగన్ శుక్రవారం ఉదయం శ్రీకాకుళంలో విలేకరులతో మాట్లాడారు. విజయనగరం, శ్రీకాకుళంలో పర్యటన ముగించుకున్న జగన్.. శుక్రవారం రాత్రి విశాఖకు వెళ్లారు. విలేకరుల సమావేశంలో జగన్ ఏమన్నారంటే..దారుణంగా అబద్ధాలు చెప్తున్న బాబుచంద్రబాబు దారుణంగా అబద్ధాలు చెబుతున్నారు. మొన్న ఏలూరులో ఆయన ప్రసంగంలో 15 వేల టన్నుల ఎర్రచందనం అమ్మి రుణమాఫీ చేస్తానని అంటే నాకు ఆశ్చర్యం వేసింది. మొన్నటికి మొన్న ఓ మంత్రి 8 వేల టన్నుల ఎర్ర చందనం ఉంది. వేలం వేస్తే టన్నుకు రూ.10 లక్షలు చొప్పున రూ.800 కోట్లు వస్తుందన్నారు. కానీ చంద్రబాబు 15వేల టన్నులు అంటున్నారు. పోనీ 15వేల టన్నులే అనుకుందాం. వేలం వేస్తే టన్నుకు రూ.10 లక్షలు చొప్పున 15వేల టన్నులకు రూ.1500 కోట్లు వస్తుంది. ఈ రూ.1500 కోట్లు చూపించి 87వేల కోట్ల వ్యవసాయ రుణాలు, 14వేల కోట్ల డ్వాక్రా రుణాలు మొత్తం రూ.1.02లక్షల కోట్లు ఎలా మాఫీ చేస్తారు?  అసలు ఆయన మనిషేనా?

తెలంగాణ, సీమాంధ్రకు వేర్వేరు మేనిఫెస్టోలని మార్చి 1న చంద్రబాబు చెప్పారు. రెండు మేనిఫెస్టోల్లోనూ రైతులు, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తామన్నారు. ‘రాష్ట్రంలో నాకు అన్ని వనరులపైనా అవగాహన ఉంది. కచ్చితంగా అన్ని హామీలను నెరవేర్చుతా. అవగాహనతోనే  హామీ ఇచ్చా’ అని ఏప్రిల్ 11న ఈసీకి లేఖ రాశారు. ఇప్పుడేమో కష్టంగా ఉందంటున్నారు.

ఎన్నికలకు ముందు జరిగిన 49 మీటింగ్‌ల్లో బాబు చెప్పిన మాటలు నాకు గుర్తున్నాయి. ‘నాకు పాలన అనుభవం ఉంది. జగన్‌కు లేదు. నేను ప్రపంచానికే ట్యూషన్లు చెప్పాను. నేనే గొప్ప వ్యక్తిని. అధికారంలోకి వచ్చాక అన్నీ మాఫీ చేస్తాను’ అన్నారు. బాబు వస్తున్నాడు, రుణాలు మాఫీ అవుతాయి, మీరిప్పుడు కట్టవద్దు. బాబు వస్తున్నాడు... ఇంటింటికి జాబ్ వస్తుందని టీడీపీ నేతలు పాంప్లెట్లు వేసి ఇంటింటికీ పంచారు. ఇప్పుడేమో చంద్రబాబు ఆ హామీలన్నింటినుంచి తప్పించుకోవాలని చూస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా, ఇంత దారుణంగా మోసం చేసి సీఎం అయితే సెక్షన్ 420 కింద మోసం కేసు ఎందుకు పెట్టకూడదు? ఈయనపై 420.. 840.. ఏ కేసు పెట్టాలో బాబు మనస్సాక్షినే అడగాలి.

సాధారణంగా ఏ సీఎంకైనా ప్రజావ్యతిరేకత ఏర్పడటానికి రెండేళ్లు పడుతుంది. కానీ నెలరోజుల్లోనే ఇంత ప్రజా వ్యతిరేకత తెచ్చుకున్న ఘనత చంద్రబాబుదే. ఆయన గ్రాఫ్ అంత దారుణంగా పడిపోయింది. నేను చంద్రబాబును సవాల్ చేస్తున్నా.. తిరిగి 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు పెడితే 167 సీట్లలో ప్రజలు వైఎస్సార్‌సీపీకి పట్టం కడతారు.ఇంటికో ఉద్యోగం, రీయింబర్స్‌మెంట్ సంగతేంటీ?ఇంటికో ఉద్యోగం ఇస్తానని, నిరుద్యోగులకు రూ.2వేల నిరుద్యోగ భృతి ఇస్తానని చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో చెప్పారు. కానీ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే ప్రసంగంలో యూటర్న్ తీసుకున్నారు. తానెప్పుడూ ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానని చెప్పలేదని మాటమార్చుతున్నారు. ప్రైవేటు ఉద్యోగాలైతే ఎవరైనా ఇస్తారు. దానికి బాబు ఎందుకు? నిరుద్యోగ భృతి గురించి బాబు అసలు మాట్లాడడం లేదు. రాష్ట్రంలో ఇవాళ కోటిన్నర ఇళ్లున్నాయి. ఆ కోటిన్నర ఇళ్ల నుంచి ఇవాళ ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. మాకు రూ.2వేల భృతి ఇవ్వండి లేకపోతే జాబ్ ఇవ్వండి అని. వారికి చంద్రబాబు సమాధానం చెప్పాలి.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై గందరగోళంతో రాష్ట్రంలో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్‌లో దాదాపు రెండు లక్షల మంది సీమాంధ్ర ప్రాంతాలకు చెందిన విద్యార్థులు చదువుతున్నారు. రాష్ట్ర విభజనతో ఈ సంవత్సరం నుంచి వాళ్లంతా వేరే రాష్ట్రంలోకి మారారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తమకు తెలంగాణ విద్యార్థులే ముఖ్యమని, ఆంధ్ర విద్యార్థుల ఫీజులు చెల్లించబోమని చెప్తున్నారు. అయినా అక్కడున్న ఆంధ్రా విద్యార్థులకు అండగా ఉంటామని చంద్రబాబు చెప్పడం లేదు. ఇక్కడ ఏపీలోనూ రూ.1500 కోట్లు ఫీజు బకాయిలున్నాయి. వాటిగురించి ఇప్పటివరకు పట్టించుకోలేదు. ఇంత దారుణ పాలన సాగిస్తున్న బాబును ఏమనాలో అర్థంకావడం లేదు. ఏ సీఎంకైనా రెండేళ్లు దాటితే ప్రజావ్యతిరేక ఏర్పడుతుంది. కానీ ఒక నెలకే బాబు ఎప్పుడు అధికారంలోంచి పోతారా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. అటువంటి పరిస్థితి ఎవరికీ రాదేమో.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top