రైల్వే ప్లాట్‌ ఫాంపై ప్రసవం..

Woman Delivers Baby At Bitragunta Railway Station - Sakshi

బిట్రగుంట : శ్రీ పొట్టి శ్రీరాములునెల్లూరు జిల్లా బిట్రగుంట రైల్వేస్టేషన్‌లో శనివారం ఓ ప్రయాణికురాలికి ప్రసవమైంది. రైల్వే అధికారులు, సిబ్బంది సకాలంలో స్పందించి మానవత్వంతో సపర్యలు చేయడంతో తల్లీబిడ్డ క్షేమంగా ఆస్పత్రికి చేరారు. అస్సాం రాష్ట్రం డౌలాపూర్‌కు చెందిన నిండు చూలాలు తారామతిభార్‌ బెంగళూరు నుంచి గౌహతి ఎక్స్‌ప్రెస్‌లో వెళుతోంది. రైలు నెల్లూరు దాటాక ఆమెకు ఒక్కసారిగా ప్రసవం నొప్పులు అధికమయ్యాయి. అంతలోనే రైలు బిట్రగుంట స్టేషన్‌కు చేరుకుంది. లైన్‌ క్లియర్‌ లేని కారణంగా రైలును స్టేషన్‌లో కొద్దినిమిషాలపాటు నిలిపారు. అప్పటికే నొప్పులు తీవ్రమవడంతో తట్టుకోలేక రైలు దిగేసిన తారామతి ఒకటో నంబర్‌ ఫ్లాట్‌ఫాంపై మగబిడ్డను ప్రసవించింది. అనంతరం రక్తస్రావం కారణంగా అపస్మారక స్థితికి చేరుకుంది.

గమనించిన టీఎక్స్‌ఆర్‌ అధికారి జయానంద్, సిబ్బంది అరుణ్‌కుమార్, సురేష్‌ తదితరులు వెంటనే 108కు, రైల్వే డాక్టర్‌కు సమాచారం ఇవ్వడంతో పాటు సీఎన్‌డబ్ల్యూ సిబ్బంది లావణ్య, శారదమ్మను పిలిపించారు. వెంటనే అక్కడకు చేరుకున్న మహిళా సిబ్బంది బిడ్డ శరీరాన్ని శుభ్రం చేశారు. అపస్మారక స్థితిలో ఉన్న తల్లికి సపర్యలు చేయడంతో ఆమె కోలుకుంది. రైల్వే వైద్యురాలు హసీనాబేగం వచ్చి తల్లీబిడ్డలను పరీక్షించి ప్రమాదం లేదని చెప్పారు. తల్లికి రక్తస్రావం అధికంగా ఉండటంతో 108లో కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. తారమతి వద్ద లభించిన ఆధార్‌కార్డ్, ఫోన్‌ నంబర్ల ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top