32 ఏళ్ల లోకేశ్ 44 ఏళ్ల రాహుల్ బాట పడతారా?

32 ఏళ్ల లోకేశ్ 44 ఏళ్ల రాహుల్ బాట పడతారా? - Sakshi


మొత్తం మీద నారా లోకేశ్ ను 2019 కి రెడీ చేసే పనిని చంద్రబాబు నాయుడు మొదలుపెట్టారు. చంద్రబాబు చాణక్యమంతా ఉపయోగించి పద్మవ్యూహంలో దుర్యోధనుడిని భద్రపరిచినంత జాగ్రత్తగా లోకేశ్ కు మట్టి అంటకుండా దున్నుకునే సౌలభ్యాన్ని కల్పించారు.




ఆయన అధికారానికి దూరంగా ఉంటూ అధికారం చలాయించేలా, పరాజయాల భారం అంటకుండా ప్రభువుగా ఉండేలా చంద్రబాబు ఏర్పాటు చేశారు. లోకేశ్ ను పార్టీ సమన్వయకర్తగా నియమించారు. కాబట్టి ఆయన పార్టీకే పరిమితం. అయితే ఆయన అధీనంలో కార్యకర్తల సంక్షేమ నిధి ఒకటి ఉండేలా చేశారు. దీని పేరిట కార్యకర్తలతో సంబంధాలు పెంచుకుని, సంస్థాగత వ్యవస్థపై పట్టు సంపాదించవచ్చు. మరో వైపు పార్టీ ధనదాతలతో దోస్తీ పెంచుకోవచ్చు. ఇలా పార్టీ పై పట్టు పెంచుకుని 2019 ఎన్నికల యుద్ధానికి కవచం వేయవచ్చు. కత్తులు దూయవచ్చు. ఇదీ వ్యూహం.




పార్టీలో పదవులు పొందిన వారు అధికార హడావిడిలో ఉంటారు. పదవులు పొందని వారు పదవులు పొందే హడావిడిలో ఉంటారు. ఈ సందట్లో సడేమియాలా లోకేశ్ అధికార పీఠానికి ఎగబాకవచ్చునన్నదే చంద్రబాబు వ్యూహం. ఒక ఎంఎల్ ఏ గానో, మంత్రిగానో ఉండి, పెర్ఫార్మెన్సు తేలిపోయే కన్నా ఇదే నయమన్నది చంద్రబాబు భావనలా కనిపిస్తోంది. ఇరుకు గొరుకు ఊళ్ల సందుల్లాంటి రాజకీయాన్ని వదలి బైపాస్ రహదారిలో లోకేశ్ ప్రయాణించాలన్నదే చంద్రబాబు ఆలోచన.




అయితే ఇంత గొప్ప పథకమూ ఫెయిల్ కావచ్చు. ఇన్నిన్ని వ్యూహాలూ వేస్టు కావచ్చు. ఇలాంటి వ్యూహాన్నే అయిదేళ్ల క్రింద ఇంకొక పార్టీ, ఇంకొక నాయకురాలు అనుసరించారు. వారసుడిని అధికారమే తప్ప బాధ్యతలే లేని రాజ్యాంగేతర శక్తి గా ఉంచి, అధికార పీఠం పైకి నేరుగా ఎక్కించేయాలని ఆమె ప్రయత్నించారు. ఇప్పుడు ఆ 44 నాలుగేళ్ల యువనాయకుడి పరిస్థితి ఏమిటన్నది మనందరికీ తెలుసు మరి!

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top