బీసీలకు మేమే ఎక్కువ సీట్లిస్తాం: బొత్స

బీసీలకు మేమే ఎక్కువ సీట్లిస్తాం: బొత్స - Sakshi


బాబు జీవితకాలంలో సీఎం కాలేరు: బొత్స

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు వేర్వేరు మేనిఫెస్టోలు

13 లోగా మునిసిపల్ అభ్యర్థులను ఎంపిక


 

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీల కంటే కాంగ్రెస్ పార్టీయే ఈ ఎన్నికల్లో బలహీనవర్గాల వారికి ఎక్కువ సీట్లు ఇస్తుందని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చెప్పారు. మిగితా పార్టీలు బీసీలకు ఎన్ని సీట్లిచ్చినా వారికంటే ఒక్క సీటైనా ఎక్కువ ఇచ్చి తీరుతామని ఆయన పేర్కొన్నారు. ఆయన ఆదివారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో బీసీలకు 100 సీట్లిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను విలేకరులు ప్రస్తావించగా.. చంద్రబాబు మాటలకు, చేతలకు పొంతనే ఉండదని కొట్టివేశారు. ‘‘కాంగ్రెస్ తరఫున నేనైతే ఒక్కమాట ఖచ్చితంగా చెప్పగలను.

 

  గతంలో మాదిరిగానే ఈసారి కూడా మిగిలిన పార్టీలతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఒక్క సీటైనా ఎక్కువ ఇస్తుంది’’ అని పేర్కొన్నారు. బీసీ నేతను తెలంగాణ సీఎంను చేస్తానన్న బాబు మాటలనూ ఎద్దేవా చేశారు. ‘‘ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలుగా విడిపోయింది కాబట్టి ఆ రెండింట్లో ఏ ఒక్కచోట టీడీపీ అధికారంలోకి వచ్చినా బీసీని సీఎం చేస్తానని చంద్రబాబు చెప్తే నిజంగా ఆయనకు చిత్తశుద్ధి ఉందేమో అనుకునే వాళ్లం. తెలంగాణలో టీడీపీ అధికారంలోకి రాదని తెలిసి.. బీసీ సీఎం పల్లవి ఎత్తుకున్నారు. ఏదేమైనా చంద్రబాబు జీవితకాలంలో ఇక ఎన్నటికీ సీఎం మాత్రం కాలేరు. ఇది సత్యం’’ అని జోస్యం చెప్పారు.

 

 2 రాష్ట్రాలకు 2 మేనిఫెస్టోలు

 తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వేర్వేరుగా ఎన్నికల మేనిఫెస్టోలు రూపొందిస్తున్నామని బొత్స చెప్పారు. సీమాంధ్ర అభివృద్ధికి కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ సక్రమంగా అమలయ్యేలా చేయడమే ప్రధాన హామీగా ఆంధ్రప్రదేశ్ మేనిఫెస్టోను రూపొందిస్తున్నామని తెలిపారు. ఇచ్చిన మాట మేరకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినందున ఆ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామనే ప్రధానహామీని ఆ రాష్ట్ర ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చుతామని చెప్పారు.

 

 తెలంగాణ, సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితాను 16వ తేదీలోపు హైకమాండ్ ప్రకటించే అవకాశముందని బొత్స తెలిపారు. కిరణ్‌కుమార్‌రెడ్డి కొత్త పార్టీ వెనుక ఎవరున్నారో ఆయననే అడగండని వ్యాఖ్యానించారు. సినీనటుడు పవన్‌కళ్యాణ్ కొత్త పార్టీ పెడతారంటూ జరుగుతున్న ప్రచారంపై స్పందించేందుకు నిరాకరించారు. కాంగ్రెస్ తరఫున ఎన్నికల్లో పోటీ చేసే కౌన్సిలర్, కార్పొరేటర్ అభ్యర్థులను ఈ నెల 13వ తేదీ నాటికి ఎంపిక చేయాలని పీసీసీ మునిసిపల్ సమన్వయకర్తలను బొత్స ఆదేశించారు. ఆదివారం సాయంత్రం గాంధీభవన్‌లో తెలంగాణ ప్రాంత మునిసిపల్, కార్పొరేషన్‌కు సంబంధించిన పీసీసీ సమన్వయకర్తలతో బొత్స సమావేశమయ్యారు.  స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు సహా మొత్తం ఆరుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసి కౌన్సిలర్, కార్పొరేటర్ అభ్యర్థులను ఎంపిక చేయాలని బొత్స  సూచించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top