మూడు రాజధానులు వస్తాయేమో: సీఎం జగన్‌

Will Andhra Pradesh Have Three Capitals, Says YS Jagan Mohan Reddy - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు బహుశా మూడు రాజధానులు రావొచ్చని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. శాసనసభలో రాజధానిపై చర్చ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ... అధికార వికేంద్రీకరణ జరగాలని అభిప్రాయపడ్డారు. రాజధాని ఒకే చోట ఉండాలన్న ఆలోచన ధోరణి మారాలని, దక్షిణాఫ్రికా లాంటి దేశాలకు మూడు రాజధానులు ఉన్నాయని వెల్లడించారు.

‘ఏపీలోనూ బహూశా మూడు రాజధానులు వస్తాయోమో. విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌, కర్నూలులో జ్యుడీషియల్‌ క్యాపిటల్‌, అమరావతిలో లేజిస్లేటివ్‌ క్యాపిటల్‌ పెట్టొచ్చు. జ్యుడీషియల్‌ క్యాపిటల్‌ ఒకవైపున, ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ ఒకవైపున, లేజిస్లేటివ్‌ క్యాపిటల్‌ ఇక్కడ పెట్టొచ్చు. మూడు క్యాపిటల్స్‌ రావాల్సిన పరిస్థితి కనిపిస్తావుంది. దీనిపై సీరియస్‌గా చర్చించాల్సిన అవసరముంది. డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా ఖర్చు చేస్తున్నాం అనే దానిపై జాగ్రత్తగా వ్యవహరించాలి. విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ పెడితే పెద్దగా ఖర్చవదు. ఉద్యోగులు పనిచేయడానికి కావాల్సిన సదుపాయాలన్నీ అక్కడ ఉన్నాయి. ఒక మెట్రోరైలు వేస్తే సరిపోతుంది. ఇటువంటి ఆలోచనలు సీరియస్‌గా చేయాలి. ఇటువంటి ఆలోచనలు చేయడం కోసమే నిపుణులతో ఒక కమిటీని వేశాం. ఈ కమిటీ అధ్యయనం చేస్తోంది. వారం పదిరోజుల్లో నివేదిక ఇవ్వనుంది. ప్రస్తుత పరిస్థితుల్లో రాజధాని ఎలా నిర్మిస్తే బావుంటుందనే దానిపై సుదీర్ఘమైన నివేదికను కమిటీ తయారు చేస్తోంది. నివేదిక వచ్చిన తర్వాత లోతుగా చర్చించి మంచి నిర్ణయం తీసుకుని భవిష్యత్ తరాలకు మంచి జరిగేలా ముందుకు వెళ్లాలి. మనకున్న ఆర్థిక వనరులతో ఏవిధంగా చేయాలన్న దానిపై ఆలోచించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంద’ని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. ఇంతకంటే మంచి సలహాలు, సూచనలు ఇస్తే తీసుకుంటామన్నారు. అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ. అన్ని ప్రాంతాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. తర్వాత సభ నిరవధికంగావాయిదా పడింది.

సభలో హర్షాధ్వానాలు
రాష్ట్రానికి మూడు రాజధానులు వస్తాయోమోనని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అనగానే సభలో అధికార పార్టీ సభ్యులు బల్లలు చరిచి హర్షధ్వానాలు చేశారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌, కర్నూలులో హైకోర్టు, అమరావతిలో చట్టసభలు కొనసాగుతాయని సీఎం జగన్‌ ప్రకటించగానే సభ్యులు హర్షామోదం తెలిపారు.‘జై జగన్‌’ అంటూ నినాదాలు చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top