
చనిపోయినట్లు రుజువుందా?
పేదలకు పింఛన్ల పంపిణీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మానవత్వం లేకుండా వ్యవహరిస్తోంది. పింఛన్లకు ఎలా అర్హులో రుజువులు చూపించాలనే షరతులు విధిస్తోంది.
వితంతు పింఛన్లపై మెలిక
భర్తను పోగొట్టుకున్నట్లు డెత్ సర్టిఫికెట్లు సమర్పించాలి
వికలాంగ పింఛన్లు ఒకటికి రెండు సార్లు తనిఖీలు
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సీఈవోకు ఆదేశాలు
హైదరాబాద్: పేదలకు పింఛన్ల పంపిణీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మానవత్వం లేకుండా వ్యవహరిస్తోంది. పింఛన్లకు ఎలా అర్హులో రుజువులు చూపించాలనే షరతులు విధిస్తోంది. zకు ఇప్పటి వరకున్న ఆంక్షలు చాలవన్నట్లు కొత్తగా మరో షరతు విధించింది. వితంతు పింఛన్లు పొందాలంటే వారి భర్తలు మృతి చెందినట్లు రుజువులు చూపించాలని షరతు విధిస్తున్నారు. ఇందుకు 2 లేదా 3 నెలల గడు వివ్వనున్నారు. డెత్ సర్టిఫికెట్లను ఆలోగా సమర్పించాల్సి ఉంటుంది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సీఈవోకు ఆదేశాలు జారీ అయ్యాయి.
23,60,013 మంది సర్టిఫికెట్లు సమర్పించాలి
వికలాంగుల కోటాలో చెవిటి, మూగవారికి పింఛన్ మంజూరులో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాల్లో సూచించారు. చెవిటి, మూగ నిర్ధారణ శాతం సరిగా ఉందా లేదా అనేదానిపై ఒకటికి రెండు సార్లు పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేశారు. చంద్రబాబు సర్కారు విధిస్తున్న ఈ షరతులపై ఆధికార యంత్రాంగమే విస్తుపోతోంది. గతంలోనూ చంద్రబాబు సీఎంగా ఉండగా ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.లక్ష పరిహారం చెల్లిస్తే ఆ డబ్బు కోసమే బలవన్మరణాలకు పాల్పడతారనే కారణంతో పరిహారం ఇవ్వరాదని నిర్ణయించటాన్ని గుర్తుచేస్తోంది. ఇప్పుడూ నెలకిచ్చే రూ.వెయ్యి పింఛన్‌కోసం ఎవరైనా తమ భర్త మృతి చెందకుండా చనిపోయినట్లు చెబుతారా అని వ్యాఖ్యానిస్తున్నారు. గ్రామాల్లో ఎవరు ఎలా మృతి చెందారనే విషయం సాధారణంగా ఊరిలో వారందరికీ తెలుస్తుంది. అలాంటిది ఇప్పుడు కొత్తగా డెత్ సర్టిఫికెట్లు తేవాలంటే ఎవరిస్తారనే సందేహాన్ని అధికారులే వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో వితంతు పింఛన్లు పొం దుతున్నవారి సంఖ్య 23,60,013. వీరంతా తమ భర్తలు మృతి చెందినట్లు డెత్ సర్టిఫికెట్ల కోసం వచ్చే రెండు మూడు నెలల్లో అధికార యంత్రాంగం చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంటుందని ఓ అధికారి అన్నారు.