‘లోటు’ తీరుతుంది!

Widespread Rains from the third week of this month - Sakshi

ఈనెల మూడో వారం నుంచి విస్తారంగా వానలు

అక్టోబర్‌ 15 వరకు కొనసాగే అవకాశం

సాక్షి, విశాఖపట్నం: ఈశాన్య, ఆగ్నేయ గాలులు కలిసే జోన్లు ఎక్కువ ప్రభావాన్ని చూపుతూ.. ఉత్తర భారతం నుంచి దక్షిణం వైపు పయనిస్తున్నాయి. ఈ ప్రభావంతో బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు ఏర్పడనున్నాయి. దీనివల్ల రాష్ట్రంలో అక్టోబర్‌ 15 వరకూ విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. గతేడాదికంటే ఈ ఏడాది అనుకూల వాతావరణం ఉండటంతో ఇప్పటికే తూర్పు గోదావరి జిల్లాలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు కాగా.. 8 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. రాయలసీమ జిల్లాల్లో మాత్రం ఇప్పటికీ లోటు వర్షపాతమే ఉంది. అక్టోబర్‌ నాటికల్లా ఆ లోటు తీరేలా పుష్కలంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. 

అనుకూల వాతావరణమే
ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 7 శాతం లోటు వర్షపాతం ఉంది.  ఇందులో సింహభాగం లోటు దక్షిణ భారత దేశంలోనే ఉంది. ఇది సెప్టెంబర్‌ నుంచి అక్టోబర్‌ రెండో వారం నాటికి భర్తీ కానుంది. రుతు పవనాల కాలంలో నెలకు కనీసం అల్పపీడనం, వాయుగుండం, తుపాను వంటి ఏవైనా నాలుగు మార్పులు రావాల్సి ఉంటుంది. గతేడాది రుతుపవనాల కాలమైన జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు చూసుకుంటే ఒక తుపాను, ఒక తీవ్ర వాయుగుండం, 4 వాయుగుండాలు, 4 అల్పపీడనాలు ఏర్పడ్డాయి. అందుకే గతేడాది 91 శాతం సరాసరి వర్షపాతం నమోదైంది. ఈసారి అవి ఆశించిన విధంగా లేకపోవడం వల్ల ఇబ్బంది తలెత్తింది. రుతు పవనాలు 13 రోజులు ఆలస్యం కావడంతో వర్షాలు కూడా ఆలస్యమవుతున్నాయి. సెప్టెంబర్‌ నుంచి అక్టోబర్‌ వరకూ విస్తారంగా వర్షాలు నమోదయ్యే అవకాశాలు పుష్కలంగా ఉండటంతో రాష్ట్రంలో లోటు వర్షపాతం ఉండబోదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

24 గంటల్లో అల్పపీడనం
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 నుంచి 4.5 కి.మీ ఎత్తులో ఉత్తర తమిళనాడు పరిసర ప్రాంతాల్లో ఆవరించి ఉంది. అదే విధంగా పశ్చిమ బెంగాల్‌ దాని పరిసర ప్రాంతాల్లో 7.6 కి.మీ ఎత్తు వరకు ఆవర్తనం ఏర్పడింది. ఇది ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి వైపు వంగి ఉంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో పశ్చిమ బెంగాల్‌ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) శనివారం రాత్రి విడుదల చేసిన నివేదికలో తెలిపింది. దీని ప్రభావంతో రానున్న రెండు మూడు రోజుల పాటు కోస్తా, రాయలసీమలో పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే సూచనలున్నాయని ఐఎండీ తెలిపింది. మరోవైపు నైరుతి రుతుపవనాలు రాయలసీమపై చురుగ్గా ప్రభావం చూపుతున్నాయి. గడచిన 24 గంటల్లో రుద్రవరంలో 16 సెం.మీ వర్షపాతం నమోదుకాగా, ఎస్‌.కోటలో 9, అవనిగడ్డ, వెంకటగిరి కోట, ఆళ్లగడ్డలో 6 సెం.మీ వర్షం కురిసింది. శనివారం సాయంత్రం విశాఖపట్నం జిల్లా చీడికాడ మండలం దిబ్బపాలెం గ్రామానికి చెందిన తుంపాల కన్నయ్య(53) అనే రైతు పొలంలో పనిచేస్తుండగా పిడుగు పడి మృతి చెందాడు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top