మున్సిపల్స్ పట్టేదెవరో!


 ధర్మవరం,

 ఆరు నెలల దాకా మునిసిపల్ ఎన్నికలు రావనుకున్న తరుణంలో వెంటనే మున్సిపోల్స్ నిర్వహించాలని బుధవారం సుప్రీంకోర్టు ఆదేశించడంతో జిల్లాలోని మున్సిపాలిటీలలో నేతల్లో జోరుగా చర్చ మొదలైంది.


 


ఈ తీర్పుతో ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నా... నాయకుల్లో మాత్రం టెన్షన్ మొదలైంది. ఎన్నికల వల్ల కొత్త పాలక మండళ్లు వస్తాయని, సమస్యలపై గట్టిగా నిలదీయవచ్చని ప్రజలు భావిస్తున్నారు. జిల్లాలో హిందూపురం మినహా మిగిలిన అన్ని మునిసిపాలిటీల పాలకవర్గాల పదవీకాలం 2010 సెప్టెంబర్ 29 నాటికి ముగిసింది. అప్పటి నుంచి వాటికి ఎన్నికలు నిర్వహించలేదు. ప్రత్యేకాధికారుల పాలన తో నెట్టుకొస్తున్నారు. తదనంతరం హిందూపురం మునిసిపాలిటీ పాలకవర్గం పదవీ కాలం కూడా ముగియడంతో అక్కడా ‘ప్రత్యేక’ పాలన విధించారు. వీటికితోడు కొత్తగా మునిసిపాలిటీలైన పుట్టపర్తి, కళ్యాణదుర్గం, పామిడి, గుత్తి, మడకశిరతో కలుపుకుని పాత మునిసిపాలిటీలన్నింటికీ పాలకవర్గాలను ఎన్నుకోవాల్సి ఉంది. రాష్ట్రంలో మారిన పరిస్థితులు, రాజకీయ అనిశ్చితి కారణంగా రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలను నిర్వహించకుండా వాయిదా వేస్తూ వచ్చింది.


 


ఇప్పటిదాకా ఏడు దఫాలుగా 41 నెలల పాటు ప్రత్యేక పాలనను పొడిగిస్తూ వచ్చింది. ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సంసిద్ధంగా లేకపోవడం, ప్రజా సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోవడంతో కొందరు మునిసిపల్ ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో 40 రోజుల్లోగా ఎన్నికలు నిర్వహించాలని ఫిబ్రవరి 2న హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. బుధవారం సుప్రీంకోర్టు కూడా మునిసిపల్ ఎన్నికలను తక్షణమే నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోర్టు తీర్పు నేపథ్యంలో రాజకీయ పార్టీలలో కలకలం మొదలైంది.


 


ఇన్నాళ్లు స్తబ్దతగా ఉన్న పార్టీలు కోర్టు తీర్పుతో ఒక్కసారిగా మునిసిపల్ ఎన్నికలపై దృష్టి సారించాయి. ఇదే క్రమంలో ఆశావహుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. వారు ఆయా పార్టీల అగ్రనేతల ఇళ్ల వద్దకు క్యూ కడుతున్నారు. తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. కాగా, వైఎస్‌ఆర్‌సీపీ గాలి వీస్తున్న సమయంలో మిగతా పార్టీల నేతలు మునిసిపల్ ఎన్నికలపై బెంబేలెత్తుతున్నారు. రాష్ట్ర విభజనకు లేఖ ఇచ్చి చెడ్డపేరు మూటగట్టుకుని టీడీపీ ప్రజలకు దూరమైంది. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. బీజేపీ, సీపీఐ, సీపీఎం ఈసారి అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలుపుతాయా.. లేదా అన్నది వేచిచూడాలి.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top