ఉభయులం కలిస్తే ఉత్తమ ఉత్పత్తులు

We want cooperation with Singapore says Chandrababu - Sakshi

     మౌలిక సదుపాయాల్లో సింగపూర్‌ ఆదర్శం

     ప్రజల్లో వాణిజ్య నాయకత్వం పెంచడమే లక్ష్యం

     సింగపూర్‌ సహకారం కోరుతున్నాం

     సింగపూర్‌ ఆర్థిక మంత్రితో సీఎం భేటీ

సాక్షి, అమరావతి: మౌలిక సదుపాయాల కల్పనలో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన సింగపూర్‌ ఆంధ్రప్రదేశ్‌కు ఎంతో స్ఫూర్తినిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సింగపూర్‌కు బలమైన ఆర్థిక వ్యవస్థ ఉందని, ఆంధ్రప్రదేశ్‌లో నైపుణ్య మానవ వనరులున్నాయని,ఉభయులం కలిసి పనిచేస్తే ప్రపంచానికే ఉత్తమ ఉత్పత్తులు అందించవచ్చునని సీఎం సూచించారు. రాష్ట్ర ప్రజల్లో వాణిజ్య నాయకత్వ లక్షణాలు పెంపొందించాలన్నదే తమ లక్ష్యమని, ఇలా చేసేందుకు సింగపూర్‌ సహకారం కోరుతున్నామని, నైపుణ్యాభివృద్ధిలో సింగపూర్‌ చొరవను, చోదకతను వారికి అందించాలని సీఎం విజ్ఞప్తి చేశారు.

సింగపూర్‌ పర్యటనలో భాగంగా సీఎం మూడో రోజు సింగపూర్‌ ఆర్థిక మంత్రి హుంగ్‌ స్వీ కేట్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ సింగపూర్‌ సంస్థల నుంచి తక్కువ వడ్డీతో ఆర్థిక సహాయం అందించేలా మార్గదర్శనం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆర్థిక సహాయం అందించడంతో పాటు ఆంధ్రప్రదేశ్‌ వ్యాపారాల్లో భాగస్వామిగా ఉండాలని కోరారు. ఏపీలో కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు, ప్రోత్సాహకాల వల్ల కియా మాత్రమే కాకుండా ఇసుజి, హీరో మోటార్స్‌ లాంటి దిగ్గజ సంస్థలు భారీ పెట్టుబడులతో వచ్చాయని చంద్రబాబు వివరించారు.

సింగపూర్‌ ఆర్థిక మంత్రి మాట్లాడుతూ ఏపీతో కలిసి పనిచేస్తుండటం, ప్రాజెక్టులకు ఫైనాన్స్‌ చేయడం ఎంతో శ్రేయోదాయకంగా ఉందన్నారు. మా ఆర్థిక సంస్థలు, బ్యాంకుల నుంచి ఆకర్షణీయమైన సహాయం అందించడానికి తప్పకుండా ప్రయత్నిస్తానని సింగపూర్‌ ఆర్థిక మంత్రి భరోసా ఇచ్చారని..సీఎం కార్యాలయం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top