ఎన్నికల నాటికి మేమే హీరోలం

we are heros in 2019 - Sakshi

బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు స్పష్టీకరణ 

సాక్షి, అమరావతి/హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌ (గన్నవరం): గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల ప్రభావం రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలపై కూడా ఉంటుందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు చెప్పారు. ఆయన సోమవారం విజయవాడలో, హనుమాన్‌ జంక్షన్‌లో మీడియాతో మాట్లాడారు. ‘‘బీజేపీ గుజరాత్‌లో వరుసగా ఐదోసారి అధికారంలోకి వచ్చింది. మన రాష్ట్రంలో గత ఎన్నికల్లో మేం(బీజేపీ), పవన్‌కల్యాణ్, చంద్రబాబు కలిస్తే రెండు శాతం మెజార్టీ మాత్రమే దక్కింది. ప్రస్తుతం రాష్ట్రంలో కమలం రేకులు విచ్చుకుంటోంది. వచ్చే ఎన్నికల నాటికి మేం(బీజేపీ) హీరోలుగా మారతాం. ఏపీలో బీజేపీ బలపడుతుంది’’ అని చెప్పారు. 

ఇతర పార్టీలను డిక్టేట్‌ చేస్తాం...
‘‘రాష్ట్రంలో పరిపాలన చేయకుండా ట్రేడింగ్‌ చేస్తున్నది ఎవరో అందరికీ తెలుసు. వాళ్లు(టీడీపీ) వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వాళ్లను జాయిన్‌ చేసుకుంటున్నారు. అవినీతి పరులన్న ముద్రపడిన వాళ్లకు మంత్రి పదవులు ఇచ్చేశారు. మమ్మల్ని మాత్రం మీరు అలాగే ఉండండి, ఎన్నికలప్పుడు మూడు సీట్లిస్తే తీసుకోండి, నాశనమైపోండి అని అంటున్నారు. ఇకపై అలా జరిగే ప్రసక్తే లేదు. ఇప్పటివరకు టీడీపీకి మిత్రపక్షంగానే ఉన్నాం, రేపు ఏం జరుగుతుందో చెప్పలేం. 2019 ఎన్నికల నాటికి రాష్ట్రంలో సీట్లు యాచించే స్థితిలో ఉండబోం. ఇతర పార్టీలను డిక్టేట్‌ చేసేలా ఎదుగుతాం’’ వీర్రాజు స్పష్టం చేశారు.   

మిత్ర ధర్మాన్ని ఉల్లంఘిస్తే ఉపేక్షించం 
తెలుగుదేశం పార్టీ మిత్ర ధర్మాన్ని ఉల్లంఘిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, బహిరంగంగా విమర్శించడం ఖాయమని సోము వీర్రాజు తేల్చిచెప్పారు. 2019 ఎన్నికల నాటికి దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బీజేపీ బలపడాలనే లక్ష్యంతో ఉందని, ఏపీలోనూ ఆ దిశగా కృషి చేస్తున్నామని చెప్పారు. 1999, 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కారణంగానే రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిందన్న విషయాన్ని ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌ గుర్తించాలని హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించినప్పుడు, మిత్ర ధర్మం విస్మరించి బీజేపీపై విమర్శలు చేసినప్పుడు కచ్చితంగా ఎదుర్కొంటామన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top