హవ్వా.. పెట్రోల్లో నీరు!

Water Mixing In Petrol sales In Prakasam - Sakshi

ప్రకాశం, గిద్దలూరు: స్థానిక పెట్రోల్‌ పంపుల్లో పెట్రోల్‌కు బదులుగా నీరు వస్తోందని వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. నాలుగు రోజులుగా బైకులు మార్గమధ్యంలో ఆగిపోతున్నాయి. ఎంతకు బైకులు స్టార్ట్‌ కాకపోవడంతో మెకానిక్‌ల వద్దకు తీసుకెళ్తే అసలు విషయం బయటకు వస్తోంది. పట్టణానికి చెందిన కొత్తకోట చిన్న పెద్దిరాజు మోటు రోడ్డులో ఉన్న ఓ పెట్రోల్‌ బంకులో రెండు పర్యాయాలు పెట్రోల్‌ కొట్టించుకున్నాడు. ఆ తర్వాత పట్టణంలోకి రాగా వాహనం నిలిచిపోయింది. మెకానిక్‌ వద్దకు వెళ్లగా పరిశీలించిన మెకానిక్‌ పెట్రోల్లో కల్తీ ఉందని చెప్పాడు.

ట్యాంకు నుంచి పెట్రోల్‌ బయటకు తీసి ప్లాస్టిక్‌ డబ్బాలో పట్టారు. పెట్రోల్లో మొత్తం నీరే ఉంది. కొద్దిసేపటికి పట్టణానికి చెందిన రాజేష్‌ అనే యువకుడు తన బైకు స్టార్ట్‌ కావడం లేదని మెకానిక్‌ వద్దకు వచ్చాడు. అందులోనూ నీరే ఉంది. ఇద్దరూ వేర్వేరు పంపుల్లో పెట్రోల్‌ కొట్టించుకున్నారు. రెండింటిలోనూ నీరు రావడంతో వాహనదారులు బెంబేలెత్తుతున్నారు. వినియోగదారులు పెట్రోల్‌ పంపుల నిర్వాహకులపై గొడవ పడటంతో ఒక్కొక్కరికి నాలుగు లీటర్లు చొప్పున పెట్రోల్‌ కొట్టించి పంపించారు. అధికారులు చొరవ తీసుకుని పంపుల్లో పెట్రోల్‌కు బదులు నీరు, ఇతర కల్తీలు జరుగుతున్నాయన్న ఆరోపణలపై విచారించి తగు చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top