వలంటీర్లే.. ఆ నలుగురై!

Volunteers working as social responsibility despite corona fear - Sakshi

కరోనా భయం ఉన్నా సామాజిక బాధ్యతే లక్ష్యంగా ముందడుగేసిన వలంటీర్లు  

నరసరావుపేట: కరోనా.. నేపథ్యంలో ఎవరైనా మరణిస్తే పరీక్షల అనంతరమే దహన సంస్కారాలు చేయించాల్సిన దుస్థితి ఎదురవుతోంది. రక్త సంబంధీకులు సైతం ఆమడ దూరంలో ఉంటున్న తరుణంలో వలంటీర్లే ముందుకొచ్చారు. ఆ నలుగురూ తామై వృద్ధుడి అంత్యక్రియలు జరిపించారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో మంగళవారం ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. స్థానిక 30వ వార్డు ఏనుగల బజారుకు చెందిన షేక్‌ నన్నే బుజ్జి (75) మూడు నెలలుగా అనారోగ్యంతో మంచం పట్టి సోమవారం తుది శ్వాస విడిచారు.

అతడికి ఆరుగురు సంతానం కాగా.. వారిలో నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. అందరూ వేర్వేరు చోట్ల స్థిరపడ్డారు. తండ్రి మరణ వార్త వినగానే ఆరుగురూ ఇంటికి చేరుకున్నారు. ఏనుగుల బజారు కరోనా రెడ్‌జోన్‌ కావటంతో బుజ్జి అంత్యక్రియలు ఎలా జరిపించాలో తెలియక అతడి కుమారులు ఇబ్బంది పడ్డారు. సంప్రదాయం ప్రకారం ఆ ప్రాంతంలోని మసీదుకు చెందిన పేష్‌మామ్, మౌజమ్‌ వచ్చి మృతదేహానికి స్నానం చేయించి కబ్రిస్తాన్‌కు సిద్ధం చేయాలి. బుజ్జి సహజంగానే మరణించినా.. కరోనా భయంతో వారు వచ్చేందుకు నిరాకరించారు.

పీపీఈ కిట్లు ధరించి... 
ఈ పరిస్థితుల్లో వలంటీర్లు షేక్‌ సైదావలి, సయ్యద్‌ జానిబాషా, సయ్యద్‌ జాఫర్‌ఖాదర్‌ ఆ వృద్ధుని అంత్యక్రియలకు ముందుకొచ్చారు. పీపీఈ కిట్లు ధరించి మృతదేహానికి స్నానం చేయించి.. దానిని పకడ్బందీగా ప్యాక్‌ చేశారు. దీంతో మృతుడి కుమారులు భయాన్ని వీడి తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. జనాజపై బుజ్జి మృతదేహాన్ని ఉంచి చిలకలూరిపేట రోడ్డులోని కబ్రిస్తాన్‌కు చేర్చారు. ఈ కార్యక్రమాన్ని మాజీ కౌన్సిలర్‌ షేక్‌ రెహమాన్, సచివాలయ శానిటేషన్‌ సెక్రటరీ విష్ణురంగా, ఏఎన్‌ఎం జ్యోత్స్న పర్యవేక్షించారు. వలంటీర్లను స్థానికులు అభినందించారు. మున్సిపల్‌ డీఈ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. వలంటీర్లు సామాజిక బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. బుజ్జిది సహజ మరణమైనందున మృతదేహానికి కరోనా పరీక్షలు చేయించాల్సిన అవసరం లేదని డీఎండీహెచ్‌వో నిర్ణయించారన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top