బీపీ‘ఎస్‌ అనరే’..!

VMC Officers Negligence Of Building Penalization Scheme In Vijayawada - Sakshi

బీపీఎస్‌(బిల్డింగ్‌ పీనలైజేషన్‌ స్కీం).. అనుమతి లేకుండా నిర్మించిన భవనాలను క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం కల్పించిన ఓ అవకాశం. దీనికి విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో స్పందన భారీగానే వచ్చింది. గడువులోగా 2,179 దరఖాస్తులు వచ్చాయి. అయితే ఆ దరఖాస్తులను పరిశీలించి క్రమబద్ధీకరించడంలో వీఎంసీ అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. సిబ్బంది కొరత అంటూ సాకులు చూపుతూ 
కార్పొరేషన్‌ ఆదాయ మార్గాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. మరోవైపు కిందిస్థాయి సిబ్బంది నుంచి ఉన్నతాధికారుల వరకు ‘చెల్లింపులు’ చేస్తేనే ఫైలు కదులుతోందన్న విమర్శలు లేకపోలేదు. 

సాక్షి, పటమట(విజయవాడ) : నగరంలో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలకు ప్రభుత్వం అమలు చేస్తున్న బీపీఎస్‌ పథకంలో క్రమబద్ధీకరించుకునేందుకు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నవారు అధికారుల వెరిఫికేషన్, చలానా చెల్లింపులు చేయటానికి నెలలుగా ఎదురుచూడాల్సి వస్తుంది. వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చినప్పటికీ వాటిని పరిశీలించేందుకు అధికారులకు సమయం లేకుండా పోతుండటం గమనార్హం.

జూన్‌ 30తో ముగిసిన గడువు..
నగరపాలక సంస్థ పరిధిలో జరిగిన అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరణకు ప్రభుత్వం గత ఏడాది చివరి అవకాశంగా పేర్కొంటూ మూడు నెలల కాలానికి పరిమితి విధించి బిల్డింగ్‌ పీనలైజేషన్‌ స్కీమ్‌(బీపీఎస్‌) ఈ ఏడాది జనవరి నుంచి జూన్‌ 30వ తేదీ వరకు వీఎంసీ దరఖాస్తులను బీపీఎస్‌ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తులను స్వీకరించింది. కార్పొరేషన్‌లో 2015 నుంచి ఇప్పటి వరకు సుమారు 5,000 బీపీఎస్‌ దరఖాస్తులు అందాయి. అప్పటి నుంచి విడతల వారీగా ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకంలో అధికారులు నానాటికీ తాత్సారం చేస్తున్నారనే విమర్శలు వచ్చాయి. గతంలో బీపీఎస్‌లో దరఖాస్తులను పరిశీలించి భవనాలను క్రమబద్ధీకరించేందుకు కార్పొరేషన్‌కు రూ. 78 కోట్ల ఆదాయం సమకూరింది. వీటితో కార్పొరేషన్‌లోని మూడు సర్కిళ్ల పరిధిలోని పలు నూతన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగా పెండింగ్‌లో ఉన్న కాంట్రాక్టర్ల బిల్లులు కూడా చెల్లించారు. ఒక్కో దరఖాస్తు పరిశీలనకు క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి ఉన్నతాధికారి వరకు వంతుల వారీగా ‘చెల్లింపులు’ జరిగితే దరఖాస్తు చేసుకున్న భవనాల పరిశీలనకు వస్తారని ఆరోపణలు వస్తున్నాయి. 

2,179 దరఖాస్తులు..
జనవరి నుంచి ఇప్పటి వరకు నగరంలోని 59 డివిజన్లలో మూడు సర్కిళ్ల పరిధిలో 2,179 దరఖాస్తులు రాగా దరఖాస్తుల సమర్పణలో వీఎంసీకి రూ. 3.74 కోట్ల ఆదాయం వచ్చింది. గత ఏడాది నుంచి ఇప్పటి వరకు వీఎంసీ పట్టణ ప్రణాళిక విభాగం బీపీఎస్‌లో 700 దరఖాస్తులు కూడా పరిశీలన చేయలేదని సమాచారం. 

చేయి తడిపితేనేనా..!
రెండువేలకు పైగా ఉన్న నూతన దరఖాస్తులను పూర్తిస్థాయిలో వెరిఫికేషన్‌ చేయటానికి అధికారులు తత్సారం చేస్తున్నారని, కాసులు ఇస్తేనే వారి భవనాలను క్రమబద్ధీకరిస్తున్నారని, దీనికితోడు డీవియేషన్‌ కొలతల సమయంలో ‘చేతి చమురు’ను బట్టి చలానాల్లో జరిమానాలను నిర్ధారిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

వీఎంసీ వాదన ఇదీ..
అయితే వీఎంసీ పట్టణ ప్రణాళిక విభాగంలో భారీగా సిబ్బంది కొరత ఉందని అందువల్లే పరిశీలన కష్టమవుతోందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం వీఎంసీ ఒక సిటీప్లానర్, ఇద్దరు అసిస్టెంట్‌ సిటీప్లానర్‌లతోపాటు ముగ్గురు టౌన్‌ సూపర్‌వైజర్లు, ఒక ట్రేనర్, ఒక టౌన్‌ సర్వేయర్, 12 మంది టీపీబీవోలు ఉన్నారు. సిబ్బంది సంఖ్య మరింత పెంచాలని, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సిబ్బది లేకపోవటంతో ఇబ్బందులు పడుతున్నామని వారు పేర్కొంటున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top