మన స్పందనే ఫస్ట్‌ 

Visakhapatnam Is The First State In The State To Address Peoples Issues And Concerns - Sakshi

అర్జీల పరిష్కారంలో జిల్లాకు ప్రథమ స్థానం

కలెక్టర్‌ వినయ్‌చంద్‌కు సీఎం వైఎస్‌ జగన్‌ ప్రశంస

సాక్షి, మహారాణిపేట(విశాఖ దక్షిణ): ప్రజల సమస్యలు, వినతులను సత్వరమే పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో తలపెట్టిన ‘స్పందన’ జిల్లాలో విజయవంతమైంది. అర్జీల పరిష్కారంలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. దీంతో కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌కు ముఖ్యమంత్రి నుంచి ప్రశంసలు లభించాయి. ఈ విషయమై కలెక్టర్‌ స్పందిస్తూ సీఎం ఆశయమే స్ఫూర్తిగా తీసుకొని అర్జీలను పరిశీలిస్తున్నామని, అర్జీదారులకు తగు న్యాయం చేయడానికి కృషి చేస్తున్నామని ‘సాక్షి’కి చెప్పారు.


వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరైన కలెక్టర్‌ వినయ్‌చంద్, డీఆర్వో శ్రీదేవి, ఇతర అధికారులు

అర్జీల పరిష్కారంలో జిల్లా ప్రథమ స్థానంలో నిలవడంపై సీఎం ప్రశంసలు తమకు మరింత ఉత్సాహం ఇస్తాయని అన్నారు. మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాజధాని నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ వినయ్‌చంద్, డీఆర్‌వో శ్రీదేవి తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి 29వ తేదీ వరకూ నిర్వహించిన ‘స్పందన’ కార్యక్రమంలో దాఖలైన 13,135 అర్జీల్లో 76.88 శాతం పరిష్కారమయ్యాయి. ఈ విషయమై సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కలెక్టర్‌ను అభినందించారు. అర్జీలను పరిష్కరించడంలో తీసుకున్న చర్యలను ఈ సందర్భంగా కలెక్టర్‌ ముఖ్యమంత్రికి వివరించారు.   

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top