ఓటు వేయాలంటే నడకయాతనే!

Visakhapatnam Agency People Suffering With Transport Problems - Sakshi

మాడుగుల రూరల్‌: ఐదేళ్లకొకసారి వచ్చే ఎన్నికల్లో ఓటేసేందుకు ఆ గిరిపుత్రులకు ఆసక్తి ఉంది. అయితే పోలింగ్‌ కేంద్రానికి వెళ్లాలంటే సుమారు ఐదారు కిలోమీటర్లు కాలినడకన వెళ్లాలి. మాడుగుల మండలంలో జాలంపల్లి, ఎల్‌. పోన్నవోలు, తాటిపర్తి, శంకరం, ఎ. వీరనారాయణం, జె.డి పేట గ్రామాలకు సంబంధించి  కృష్ణంపాలెంలో పోలింగ్‌ బూత్‌ ఏర్పాటు చేశారు. శంకరం, బోడ్డరేవు, రామచంద్రపురం, కృష్టంపాలెం, గదబవీధి, తదితర గ్రామాలకు చెందిన సుమారు 1800 మంది ఓటర్లు కాలినడకన ఐదారు కిలోమీర్లు వెళ్లి ఓటు వినియోగించుకునే పరిస్థితి. ఎటువంటి రవాణా సదుపాయాలు లేకపోవడంతో గిరిజనులంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

లోవపొన్నవోలు పంచాయతీ పరిధిలో 14 గ్రామాల ప్రజలకు సైతం మూడు నుంచి నాలుగు కిలోమీటర్లు నడిస్తేకానీ పోలింగ్‌ కేంద్రానికి చేరుకోలేరు. తిరువాడ, అవురువాడ, సీతలబంద, తదితర శివారు గిరిజన గ్రామాలు ప్రజలు, ఎ. వీరనారాయణం పాఠశాలలో గల పోలింగ్‌ బూత్‌లో ఓటు వేయాలి.

అదనంగా పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేయాలి
జాలంపల్లి, ఎ. వీరనారాయణం, ఎల్‌.పోన్నవోలు, తాటిపర్తి, శంకరం పంచాయతీ పరిధిలో అదనంగా పోలింగ్‌ బూత్‌లు పెంచాలి. శివారు గిరిజన గ్రామాల్లో అదనంగా పోలింగ్‌ బూత్‌ ఏర్పాటు చెయ్యకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. అధికారులు స్పందించాలి.–కిముడు రమణమ్మా,ఎంపీటీసీ సభ్యురాలు, జాలంపల్లి

రవాణ సౌకర్యం కల్పించాలి
 శివారు గ్రామాల ప్రజలు ఓటు వినియోగించుకోవాలంటే ఐదారు కిలోమీటర్లు నడిచి వెళ్లాలి. రవాణా సౌకర్యం లేదు. కొండలు, గుట్టలు దాటి వెళ్లాలి. అలా కాకుండా శివారు గ్రామాలు, రవాణా సౌకర్యాలు దృష్టిలో పెట్టుకుని అదనంగా, అనుకూలంగా పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేయాలి.    –జెట్టి శేషు, కింతలి, మాడుగుల మండలం

 బోడ్డరేవు నుంచి కాలినడకన వస్తున్న మహిళలు
ఓటు వృథా చేసుకోవద్దు
ప్రజాస్వామ్యంలో ఓటు చాలా విలువైంది. అసమర్థులకు, అవినీతిపరులకు ఓటు వేసి వృథా చేసుకోవద్దు. ఎన్నికల్లో హామీలు ఇవ్వడం..వాటిని అమలు చేయకపోవడం చూస్తూనే ఉన్నాం. యువతీయువకుల భవిష్యత్తును పట్టించుకోకుండా వ్యవహరించే నాయకులకు, పార్టీలకు గట్టి బుద్ధి చెప్పే సమయం వచ్చింది. సరైన నాయకుడు, నీతి నిజాయితీ ఉన్న వ్యక్తికే నా ఓటు.– కోమలి, బీఏ విద్యార్థి, సీతంపేట

సమర్థులను ఎన్నుకుందాం
సమర్థులైన వ్యక్తులను ప్రజా ప్రతినిధులుగా ఎన్నుకుందాం. ఓటు కోసం నేతల ఇచ్చే హామీలు, గతంలో ఇచ్చిన హామీలు పరిగణలోకి తీసుకుని ఓటు వేస్తా. స్థానిక సమస్యలు, రాష్ట్ర సమస్యలు, దేశ సమస్యలు పరిష్కరించగల దమ్మున్న నాయకులనే చట్టసభలకు పంపిద్దాం. యువతీయువకులు, మహిళలకు ఎటువంటి ప్రలోభాలకు లోనుకాకుండా ఓటు వినియోగించుకోవాలి.–  బోర పల్లవి, బీకామ్, అక్కయ్యపాలెం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top