గుడ్‌మార్నింగ్‌ ‘పోలీసు’!

Vijayawada Police Whatsapp Number For Complaints - Sakshi

సాక్షి, అమరావతిబ్యూరో : ప్రజల సౌలభ్యం కోసం విజయవాడ పోలీసులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాట్సాప్‌ నెంబరుకు ‘గుడ్‌మార్నింగ్‌’, ‘గుడ్‌నైట్‌’, ‘కంగ్రాట్స్‌’ మెసేజ్‌లు పోటెత్తుతున్నాయి. విజయవాడ నగరవాసులు, నగరం వెలుపల నివసిస్తున్న వారే అత్యధికంగా ఇలాంటి మెసేజ్‌లు పంపడం గమనార్హం. ఇలా అనవసర సంక్షిప్త సందేశాల (మెసేజ్‌) వల్ల దీనిని ఏర్పాటు చేసిన ఉద్దేశం నెరవేరకుండా పోతుందని, ఎవరికైనా సమస్యలుంటేనే ఈ నెంబరుకు మేసేజ్‌లు పెట్టాలని పోలీసు అధికారులు కోరుతున్నారు. ఇప్పటి వరకు నగరంలో ట్రాఫిక్‌ సమస్యల పట్ల అత్యధికంగా ప్రజలు ఫిర్యాదులు చేయగా వాటన్నింటినీ పోలీసుశాఖ పరిష్కరించింది.  

అభినందనలే అత్యధికం...
విజయవాడ పోలీసులు ప్రత్యేకంగా రూపొందించిన వాట్సాప్‌ నెంబరుకు నాలుగు రోజులుగా మొత్తం 532 మెసేజ్‌ల రూపంలో ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో 363 మెసేజ్‌లు కేవలం పోలీసులను అభినందిస్తూ ‘కంగ్రాట్స్‌.. గుడ్‌మార్నింగ్‌.. గుడ్‌నైట్‌’ అంటూ వచ్చాయి.  తొలిరోజు గురువారం అత్యధికంగా 140, శుక్రవారం 128, శనివారం 69, ఆదివారం 26 వచ్చాయి. ఇవే కాకుండా మరో 140 మెసేజ్‌లు నగరం వెలుపల నుంచి వచ్చాయి.  

అనవసర సందేశాలు వద్దు....  
పోలీసుల వద్దకు నేరు వెళ్లేందుకు జంకే వారి కోసం ప్రత్యేకంగా నగర పోలీసులు వాట్సాప్‌ నెంబరును ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఏదైనా కీలక సమాచారం అందించాలన్నా ఈ నెంబరుకు పంపించవచ్చు. దీనికి కాల్స్‌ చేయడానికి వీలు ఉండదు. కేవలం టెక్ట్స్, వీడియోలు, ఫొటోలు, డాక్యుమెంట్లను పంపించే వెసులుబాటు ఉంది. దీని కోసం 73289 09090 నెంబరును కేటాయించారు. పోలీసుల నుంచి తమకు ఇబ్బంది ఉందని భావించినా ఈ నెంబరు వాట్సాప్‌కు పంపించవచ్చు. కానీ గురువారం నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ వ్యవస్థకు చాలా మంది ఇది పనిచేస్తోందా? లేదా? అని పరీక్షించడం కోసం మెసేజ్‌లు పంపుతున్నారని, ఇలాంటివి పంపొద్దని పోలీసుశాఖ ఉన్నతాధికారులు కోరుతున్నారు.  

ట్రాఫిక్‌ సమస్యలన్నీ పరిష్కారం..
అనవసరం సందేశాలు మినహాయిస్తే వాట్సాప్‌ నెంబరుకు మొత్తం 29 ఫిర్యాదులు వచ్చాయి. అందులో అత్యధికంగా నగరంలో ట్రాఫిక్‌ సమస్యలను తెలుపుతూ సందేశాలు వచ్చాయి. విజయవాడ నగరంలోని ట్రాఫిక్‌ సమస్యలకు సంబంధించి 14 మేసేజ్‌లు రాగా..  వాటన్నింటినీ నగర పోలీసులు యుద్ధప్రాతిపదికన పరిష్కరించారు. అలాగే శాంతిభద్రతలకు సంబంధించి 12 రాగా.. అందులో ఎనిమిదింటిపై విచారణ కొనసాగుతోంది. మిగిలినవి సాధారణమైనవి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top