గోదావరి ఇసుకపై బెజవాడ గ్యాంగ్‌

Vijayawada Gang Stolen Sand From Godavari - Sakshi

గ్యాంగ్‌ ఆధ్వర్యంలోని ర్యాంపులోనే ఇసుక తవ్వకాలు

సమీపంలో ఇసుక ర్యాంపుల మూసివేత

‘పశ్చిమ’లో ఖండవిల్లి ర్యాంపు కోసం

జిల్లాలో కీలక ర్యాంపుల మూసివేత

చినబాబు డైరెక్షన్‌లో ఇసుక దందా

గోదావరి ఇసుకపై విజయవాడ గ్యాంగ్‌ పెత్తనం చేస్తోంది. ‘తూర్పు’, ‘పశ్చిమ’ అనే తేడా లేకుండా ఇసుక ర్యాంపుల మూసివేత...తెరవడం అన్నీ వారు చెప్పినట్టే సాగుతోంది. చినబాబు కనుసన్నల్లో నడుస్తున్న ఈ గ్యాంగ్‌ తమకు అనుకూలమైన ర్యాంపులు తెరిపించడం, మిగిలిన వాటిని మూయించేస్తున్నారు. తద్వారా ఇసుకకు కృత్రిమ కొరత సృష్టించి..ధర పెంచి దోచుకోవడం ఈ గ్యాంగ్‌కు సర్వసాధారణంగా మారింది.

తూర్పుగోదావరి, అమలాపురం: ‘తూర్పు’న కీలకమైన ఇసుక ర్యాంపులు మూతపడ్డాయి. సీతానగరం మండలం ముగ్గుళ్ల, రాజమహేంద్రవరం, జొన్నాడ, కోరుమిల్లి, కపిలేశ్వరపురం, కోటిపల్లి, వీరవల్లిపాలెం, పి.గన్నవరం, మందపల్లి, రావులపాలెం, గోపాలపురం ర్యాంపులో ఇసుక తవ్వకాలు నిలిచిపోయాయి. చిన్నచిన్న ర్యాంపులు, జిరాయితీ భూముల్లో మాత్రమే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. మైనింగ్‌ ఇచ్చిన పరిధిలో ఇసుక తవ్వకాలు పూర్తి కావడం వల్ల ఈ ర్యాంపులకు అనుమతి నిలిపివేసినట్టు అధికారులు చెబుతున్నారు. కానీ వాస్తవంగా విజయవాడ గ్యాంగ్‌ సూచన మేరకు వారికి కోట్లాది రూపాయిల మేర లబ్ధి చేకూర్చేందుకు ఇక్కడి ర్యాంపులను మూసివేశారనే ఆరోపణలు న్నాయి. ఈ గ్యాంగ్‌ కనుసన్నల్లో ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా ఖండవిల్లి ముక్కామల ర్యాంపులో ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి.

అంతకుముందు జిల్లాలో పి.గన్నవరం, సీతానగరం మండలం ముగ్గళ్ల, పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం సమీపంలో, కోడేరు, సిద్ధాంతం ర్యాంపులు గ్యాంగ్‌ ఆధ్వర్యంలో నడిచాయి. వీరు ర్యాంపులు నిర్వహిస్తున్న సమయంలో జిల్లాలో మిగిలిన ర్యాంపులను ఏదో ఓ వంకతో మూసివేయడం పరిపాటిగా మారింది. గతంలో జిల్లాలో పి.గన్నవరం, ముగ్గుళ్లలో వీరు ర్యాంపులు నిర్వహిస్తున్న సమయంలో మిగిలిన ర్యాంపులు మూసివేయడం, నిబంధనల పేరుతో ఇసుక తవ్వకాలు తగ్గించడం జరిగేది. తద్వారా వీరి ర్యాంపుల్లో ఇసుకకు డిమాండ్‌ సృష్టించి కోట్ల రూపాయలు దండుకునే అవకాశాన్ని అధికారులు దగ్గరుండి కల్పించారు. తాజాగా ఇదే పంథాను అవలంబించినట్టు తెలు స్తోంది. ప్రస్తుతం ఈ గ్యాంగ్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న ఖండవిల్లి ముక్కామల ర్యాంపునకు మేలు చేసేందుకు జిల్లాలో అన్ని ప్రధాన ర్యాంపులు మూసివేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతిలోని ఉన్నత వర్గాల నుంచి వస్తున్న ఒత్తిడి మేరకు అధికారులు ర్యాంపులకు అనుమతి ఇవ్వడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో పి.గన్నవరం ర్యాంపులో తవ్వకాలు చేస్తున్న సమయంలో కూడా ఇలానే మూసివేశారు. రావులపాలెం ర్యాంపునకు సమయం ఉన్నా మూసివేయడం వెనుక ఉన్నత వర్గాల నుంచి వచ్చిన ఒత్తిడే కారణమనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

వ్యూహాత్మకంగానే...
గోదావరి జిల్లాల్లో ప్రధాన ర్యాంపులు మూతపడడంతో ఖండవిల్లి ర్యాంపునకు డిమాండ్‌ పెరిగింది. దీంతో ఇక్కడ ఇసుక ధరలు పెంచేశారు. రాత్రి వేళల్లో ఇసుక డంపింగ్‌ చేయడం, ఉదయం ఐదు యూనిట్లు, మార్కెట్‌ రవాణాకు వినియోగించే లారీల ద్వారా ఎగుమతి చేస్తున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధమే అయినా పట్టించుకునేవారు లేకుండా పోయారు. ఖండవిల్లిలో దొరికే గరుకు ఇసుకతో పోలిస్తే రావులపాలేనిది మెత్తని ఇసుక. సాధారణంగా ఇళ్ల నిర్మాణాలకు రావులపాలెంలో లభ్యమయ్యే ఇసుకనే ఎక్కువగా వినియోగిస్తారు. దీనివల్ల తమ ర్యాంపులకు వచ్చేవారు తగ్గిపోతున్నారనే ఉద్దేశంతో కూడా రావులపాలెం ర్యాంపును మూసివేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కానీ అధికారులు చెప్పేది ఇక్కడ అనుమతించిన పరిమాణం మేరకు తవ్వకాలు పూర్తయ్యాయంటున్నారు. అనుమతిచ్చిన దాంతో సంబంధం లేకుండా వందరెట్లు అధికంగా ఇసుక తవ్వకాలు చేసేవారు జిల్లా వ్యాప్తంగా ఒకేసారి నిర్దేశించిన మేర తవ్వకాలు పూర్తయ్యాయని ర్యాంపులు మూసివేయడం విడ్డూరంగా ఉందనే వాదన వినిపిస్తోంది. ఖండవిల్లి ఇసుకకు తాజాగా గిరాకీ పెరడంతో ఐదు యూనిట్ల లారీకి రూ.8,500 వరకూ వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలను పరిగణనలోకి తీసుకుంటే ఐదు యూనిట్లకు కేవలం రూ.1,250 వసూలు చేయాల్సి ఉంది. పోనీ ర్యాంపు నుంచి ట్రాక్టర్ల మీద ఇతర ప్రాంతాలకు డంపింగ్‌ చేయడం, తిరిగి లోడు చేయడం వంటివాటిని పరిగణనలోకి తీసుకుంటే రూ.2,500ల నుంచి రూ.3 వేల వరకు సరిపోతుంది. అయితే అంతకు మూడు రెట్లు వసూలు చేస్తున్నారు. ఇదే సమయంలో అక్కడ లారీలకు అవకాశమిస్తున్న నిర్వాహకులు, మన జిల్లాకు చెందిన లారీలు వెళితే సీరియల్‌ విధానమంటూ రోజుకు కేవలం ఒక్కసారి మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు. దీనిపై ఆగ్రహంతో ఉన్న జిల్లాకు చెందిన లారీల యజమానులు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన లారీలు ఇసుక తీసుకొని వస్తే అడ్డుకోవాలని నిర్ణయించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top