విశాఖకు విజయసాయిం

VijayaSai Reddy Donate Water Tanks To GVMC - Sakshi

రూ.1.03 కోట్ల ఎంపీ ల్యాడ్స్‌ నిధులతో జీవీఎంసీకి చేయూత

5 నీళ్ల ట్యాంకర్లు, 2 ఫాగింగ్‌ యంత్రాలు, 100 తోపుడు బళ్లు అందజేత

ప్రజా సంక్షేమమే వైఎస్సార్‌సీపీ ధ్యేయమని వెల్లడి

విశాఖను నోడల్‌ జిల్లాగా ఎంపిక చేసుకున్న ఎంపీ, వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి విశాఖ ప్రజల క్షేమాన్ని కాంక్షిస్తూ భూరి సాయం అందజేశారు. తన ఎంపీ ల్యాడ్స్‌ నిధుల నుంచి రూ.1.03 కోట్లతో కొనుగోలు చేసిన 5 వాటర్‌ ట్యాంకర్లు, రెండు ఫాగింగ్‌ యంత్రాలు, చెత్త తరలించే 100 తోపుడు బళ్లను బుధవారం ఆయన ప్రారంభించి జీవీఎంసీకి అందజేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమయే ధ్యేయంగా వైఎస్సార్‌సీపీ పని చేస్తుందని ఆయన చెప్పారు.విశాఖ పర్యటనలో ఉన్న ఆయన అనంతరం ఏయూ టైమ్‌స్కేల్, 28 రోజులు ఉద్యోగల దీక్షా శిబిరాన్ని, గెస్ట్‌ ఫ్యాకల్టీల శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు.

ఆరిలోవ(విశాఖ తూర్పు): విశాఖ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఎంపీ ల్యాడ్స్‌ నుంచి భారీగా నిధులు వెచ్చిస్తున్నట్టు రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా ఎంపీ నిధుల నుంచి విశాఖ జిల్లాకు 4.71 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. వాటిలో నగరంలో రూ 3.18 కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. ముందస్తుగా నగర ప్రజల ఆరోగ్యం, అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆయన రూ.1.03 కోట్ల వ్యయంతో 5 నీటి ట్యాంకర్లు, 2 ఫాగింగ్‌ యంత్రాలు, 100 తోపుడు బళ్లను కొనుగోలు చేశారు. ఈ మేరకు వాటిని ఆరిలోవ ప్రాంతం జీవీఎంసీ మురుగునీటి శుద్ధ కేంద్రం ఆవరణంలో బుధవారం జీవీఎంసీ అధికారులకు విజయసాయిరెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు విశాఖను మోడల్‌ జిల్లాగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామన్నారు. ప్రజలకు సదుపాయాల కల్పన, వారి జీవన ప్రమాణాల పెంపునకు వైఎస్సార్‌ సీపీ సహకారం అందిస్తుందన్నారు. బస్‌ షెల్టర్లు, అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణం, కేజీహెచ్‌లో ఆర్వో ప్లాంట్ల ఏర్పాటు, జీవీఎంసీకి వాహనాలు సమకూర్చడం, తదితర వాటికి ఈ నిధులు ఖర్చు చేయనున్నామన్నారు. ప్రస్తుతం నగరంలో మంచినీటి ఎద్దడి తీవ్రంగా ఉందని, దాన్ని నివారించడానికి ప్రజలకు నీటి సరఫరా చేయడానికి జీవీఎంసీ అధికారులు కోరితే మరిన్ని వాటర్‌ ట్యాంకర్లు అందిస్తామన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజలకు సేవలందించడంలో ముందుంటున్నామని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు.

ఆయా కార్యక్రమాల్లో పార్టీ నగర అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్, పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు తైనాల విజయకుమార్, విశాఖ పార్లమెంట్‌ నియోజకవర్గ సమన్వయకర్త ఎంవీవీ సత్యనారాయణ, సమన్వయకర్తలు సీహెచ్‌.శ్రీనివాస్‌ వంశీకృష్ణ(తూర్పు), డాక్టర్‌ రమణమూర్తి(దక్షిణం), కె.కె.రాజు(ఉత్తర), తిప్పల నాగిరెడ్డి(గాజువాక), శెట్టి పాల్గుణ(అరకులోయ), రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సెల్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కుంభా రవిబాబు, రాష్ట్ర అదనపు కార్యదర్శులు రవిరెడ్డి, పక్కి దివాకర్, రాష్ట్ర సేవాదల్‌ ప్రధాన కార్యదర్శి మందారెడ్డి, రాష్ట్ర ఎస్సీ సెల్‌ ప్రధాన కార్యదర్శి ఎ.రాజబాబు, పార్టీ యూత్‌ విభాగం రాష్ట్ర కార్యదర్శి నల్ల రవి, జీవీఎంసీ సీఎంహెచ్‌వో డాక్టర్‌ హేమంతకుమార్, ఎస్‌ఈ గోపాలరావు, ఈఈ రామన్‌బాబు, పార్టీ నగర యువజన విభాగం అధ్యక్షుడు కొండా రాజీవ్‌గాంధీ, వివిధ విభాగాల అధ్యక్షులు కె.ఆర్‌ పాత్రుడు, వంకాయల మారుతీప్రసాద్, విశాఖ పార్లమెంట్‌ విద్యార్థి విభాగం అధ్యక్షుడు బి.కాంతారావు, అరకు పార్లమెంట్‌ అధ్యక్షుడు టి.సురేష్, రాష్ట్ర యువజన విభాగ అధికార ప్రతినిధి తుల్లి చంద్రశేఖర్‌యాదవ్, ప్రొ. పి.ప్రేమానందం, టి.బైరాగిరెడ్డి, ఏయూ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కోటిరెడ్డి, నగర మహిళా అధ్యక్షురాలు గరికిన గౌరి, విశాఖ పార్లమెంట్‌ సేవాదళ్‌ ప్రెసిడెంట్‌ యువశ్రీ, విశాఖ పార్లమెంట్‌ ఎస్సీ సెల్‌ అధక్షుడు రెయ్యి వెంకటరమణ, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శులు బి.మోహన్‌బాబు, కోటి రవికుమార్, ఎం.కల్యాణ్, మొల్లి అప్పారావు, 1, 2 వార్డుల అధ్యక్షులు కెళ్ల సత్యనారాయణ, గొలగాని శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్‌ ఎన్‌.కృష్ణంరాజు పాల్గొన్నారు.    

ఉద్యోగులకు అండగా ఉంటాం
సీతమ్మధార(విశాఖ ఉత్తర): ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉద్యోగుల ఉద్యమానికి వైఎస్సార్‌ సీపీ మద్దతు ఉంటుందని జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు. ఏయూలో ఉద్యోగ భద్రత కల్పించాలని గత వారం రోజులుగా బోధనేతర సిబ్బంది ఆందోళన చేస్తుండడం తెలిసిందే. బుధవారం ఆయన ఏయూకు వెళ్లి వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ వర్సిటీలో ఉద్యోగులకు, నాన్‌టీచింగ్‌ స్టాఫ్‌కు, విద్యార్థులకు తమ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి తరఫున పూర్తి మద్దతు తెలుపుతున్నామన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏయూ వివక్షతకు గురవుతోందని విమర్శించారు. టీడీపీ కనుసన్నల్లో ఉన్న నారాయణ, చైతన్య, గీతం విద్యా సంస్థలు విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. 28 రోజులు ఉద్యోగులను టైం స్కేల్‌తో పాటు పర్మినెంట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కొంత మంది మంత్రులు టీచింగ్‌ స్టాఫ్‌ వద్ద లంచాలు తీసుకొని టైంస్కేల్, పర్మినెంట్‌ చేస్తున్నారని, అలా కాకుండా అందర్నీ రెగ్యులర్‌ చేసి టైస్కేల్‌ వర్తింపజేయాలని ఎంపీ కోరారు. అది ఒక్క వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే చేయగలరని స్పష్టం చేశారు. ఏయూ జేఏసీ అధ్యక్షుడు, వైస్‌ప్రెసిడెంట్‌ డాక్టర్‌ జి.రవికుమార్, ప్రొ. రామకోటిరెడ్డి మాట్లాడుతూ తమ సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 7వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించారు.

కేజీహెచ్‌లో వైఎస్సార్‌ టీయూసీ జెండా ఆవిష్కరణ
పాత పోస్టాఫీసు(విశాఖ దక్షిణ): వైఎస్సార్‌ సీపీతోనే ప్రభుత్వ ఆస్పత్రులకు పూర్వవైభవం సాధ్యమని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. కేజీహెచ్‌లో వైఎస్సార్‌ టీయూసీ జెండాను బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే ఉద్యోగులందరికి సమన్యాయం చేస్తామని, కాంట్రాక్టు ప్రాతిపదికన కాకుండా శాశ్వత ఉద్యోగులను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.  ఈ కార్యక్రమంలో కేజీహెచ్‌ ఇన్‌చార్జ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ధర్మారావు, సీఎస్‌ఆర్‌ఎంవో డాక్టర్‌ కె.ఎస్‌.ఎల్‌.జి.శాస్త్రి, ఆర్‌ఎంవో డాక్టర్‌ సిహెచ్‌.సాధన, వైఎస్సార్‌ ట్రేడ్‌ యూనియన్‌ అధ్యక్షుడు నీలాపు శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి సొండి రాజారావు,  వైఎస్సార్‌టీయూసీ ముఖ్య సలహాదారు సిహెచ్‌.యల్లయ్య, ప్రచార కమిటీ ప్రతినిధి టి.వెంకట్, ఉపాధ్యక్షులు జయాంద్ర, జగదీష్, రవి, కనకమహాలక్ష్మి, ఉరుము శేఖర్, ఆర్గనైజింగ్‌ కార్యదర్శి అప్పలస్వామి, అధిక సంఖ్యలో ఆస్పత్రి ఉద్యోగులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top