గిన్నిస్‌ రికార్డ్‌కు తొలి అడుగు ‘నంద్యాల’ నుంచే

Vijayanirmala First Direction Movie Meena Producer Nandyal Resident - Sakshi

సాక్షి, నంద్యాల : ప్రముఖ సినీనటి, దర్శకురాలు విజయనిర్మలకు తొలిసారిగా తెలుగులో డైరెక్షన్‌ ఛాన్స్‌ ఇచ్చిన ఘనత నంద్యాలకు చెందిన ప్రముఖ వ్యాపారి దివంగత గాజుల పెద్ద మల్లయ్య. వెంకటకృష్ణ పతాకంపై హీరో కృష్ణ, హీరోయిన్‌ విజయనిర్మలను ఆయన మీన చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన ఆమె.. ఆ తర్వాత తన ప్రతిభతో 44 చిత్రాలకు దర్శకత్వం వహించారు.  గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డులో అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళా డైరెక్టర్‌గా స్థానం సంపాదించారు. గాజుల మల్లయ్య వ్యాపారం రీత్యా 1965లో మద్రాస్‌కు వెళ్తుండేవారు. ఈ క్రమంలో తెలుగు సినిమాల్లో అప్పుడప్పుడే హీరోగా పేరు తెచ్చుకుంటున్న కృష్ణతో స్నేహం ఏర్పడింది.

ఈ స్నేహంతో ఆయన 1970లో ప్రముఖ రచయిత్రి యుద్ధనపూడి సులోచనరాణి రాసిన మీనా నవల ఆధారంగా అదే పేరుతో మిత్రుడు టీవీ రమణ సహకారంతో వెంకటకృష్ణ బ్యానర్‌పై చిత్రనిర్మాణం చేపట్టారు. కృష్ణ, విజయనిర్మల హీరో, హీరోయిన్‌గా పెద్ద మల్లయ్య దర్శకత్వం బాధ్యతలను విజయనిర్మలకు అప్పగించారు. అలా ఆమె తొలిసారిగా తెలుగులో దర్శకత్వం వహించారు. సినిమా హిట్‌ కావడంతో విజయ నిర్మలకు మంచిపేరుతో పాటు అవకాశాలు కూడా దక్కాయి. తర్వాత 1974లో పెద్దమల్లయ్య ఇదే పతాకంపై దేవదాసు చిత్రాన్ని కృష్ణ, విజయనిర్మలతో ఆమె దర్శకత్వంలో నిర్మించారు. కాని ఈ చిత్రం ప్రేక్షకులకు ఆకట్టుకోక పోవడంతో నష్టాలు వచ్చాయి. దీంతో పెద్ద మల్లయ్య చిత్రపరిశ్రమను వదిలేసి నంద్యాలకు వచ్చి వ్యాపారాన్ని కొనసాగించారు. పదేళ్ల క్రితం పెద్ద మల్లయ్య ఎస్‌బీఐ కాలనీలోని తన కుమారుడి ఇంట్లో ఉంటూ మృతి చెందారు. దర్శకురాలిగా విజయనిర్మల సాధించిన ఘనత వెనుక పెద్దమల్లయ్య ఇచ్చిన అవకాశం, ప్రోత్సాహం మరువలేనిది అని నంద్యాల సినీ అభిమానులు చర్చించుకుంటున్నారు.

ఒందిపోటు భీమన్న చిత్రం షూటింగ్‌ నంద్యాలలో.. 
మల్లికార్జున రావు దర్శకత్వంలో కృష్ణ, విజయ నిర్మల, ఎస్వీ రంగారావు నటించిన చిత్రం బందిపోటు భీమన్న షూటింగ్‌ 1968లో నంద్యాల, ఆళ్లగడ్డ, అహోబిలంలో దాదాపు పది రోజుల పాటు జరిగింది. ఈ సందర్భంగా కృష్ణ, విజయనిర్మల నంద్యాలలో బస చేశారు. 1969 డిసెంబర్‌13న ఈ సినిమా విడుదలయ్యింది.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top