వారికి అనుమతి లేదు

Vijaya Sai Reddy Lettre To BCAS Visakhapatnam - Sakshi

ఏరోడ్రోమ్‌లో పనిచేయడానికి శ్రీనివాసరావు దరఖాస్తు చేసుకోలేదు

ఫ్యూజన్‌ ఫుడ్స్‌కు వీఐపీ లాంజ్‌లో సేవలు అందించడానికి వీల్లేదు

వైఎస్సార్‌సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి లేఖకు బీసీఏఎస్‌ సమాధానం

ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం వెనుక కుట్ర కోణం!

సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం వెనుక కుట్ర కోణం ఉన్నట్లు బట్టబయలైంది. విశాఖపట్నం విమానాశ్రయంలో వీఐపీ లాంజ్‌తోపాటు వివిధ ప్రదేశాల్లో తిరగడానికి ప్యూజన్‌ ఫుడ్స్‌ రెస్టారెంట్‌ యజమాని, టీడీపీ నేత హర్షవర్దన్‌ ప్రసాద్‌ చౌదరి, నిందితుడు జె.శ్రీనివాసరావుకు ఎలాంటి అనుమతులు లేవని బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ(బీసీఏఎస్‌) స్పష్టం చేసింది. అంటే వారు బీసీఏఎస్‌ నుంచి అనుమతులు లేకున్నా ఎయిర్‌పోర్టులోని అన్ని ప్రాంతాల్లో యథేచ్ఛగా సంచరించేవారని తేటతెల్లమైంది. అందుకే అసలు కుట్రదారులు జగన్‌పై హత్యాయత్నానికి వారిని ఉపయోగించుకున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం నేపథ్యంలో విశాఖపట్నం విమానాశ్రయంలో భద్రతా వివరాలను తెలియజేయాలని కోరుతూ అక్టోబర్‌ 30న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి బీసీఏఎస్‌కు లేఖ రాశారు. దీనికి బీసీఏఎస్‌ డైరెక్టర్‌ జనరల్‌ కుమార్‌ రాజేష్‌చంద్ర అంశాలవారీగా సమాధానాలు ఇచ్చారు. ఈ మేరకు విజయసాయిరెడ్డికి లేఖ రాశారు. ఆ లేఖలో ఏముందంటే..

విజయసాయిరెడ్డి: ఎయిర్‌పోర్టులో పనిచేయడానికి ఏరోడ్రోమ్‌ ఎంట్రీ పర్మిట్‌ను(ఏఈపీ) కోరుతూ బీసీఏఎస్‌కు నిందితుడు శ్రీనివాసరావు లేదా అతడు పనిచేసే సంస్థకి చెందిన హర్షవర్థన్‌ చౌదరి దరఖాస్తు చేశారా? దరఖాస్తు చేస్తే అందులో శ్రీనివాసరావు నేర చరిత్రను పేర్కొన్నారా? కనీసం అతడి పేరు మీద పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను ప్రస్తావించారా?
బీసీఏఎస్‌: లేదు. వారు ఎలాంటి దరఖాస్తులు దాఖలు చేయలేదు. శ్రీనివాసరావుకు ఎయిరోడ్రోమ్‌ ఎంట్రీ పర్మిట్‌ బీసీఏఎస్‌ ఇవ్వలేదు.

విజయసాయిరెడ్డి:ఎయిర్‌పోర్టులో పనిచేయడానికి అనుమతులిచ్చే ముందు శ్రీనివాసరావు నేర చరిత్రను పరిశీలించడానికి ఏపీ పోలీసుల నుంచి బీసీఏఎస్‌ ఏమైనా సమాచారం కోరిందా? ఒకవేళ కోరి ఉంటే వారి నుంచి ఎలాంటి సమాచారం వచ్చింది?
బీసీఏఎస్‌: లేదు. వారు బీసీఏఎస్‌కు ఎలాంటి ఏఈపీ అప్లికేషన్‌ ఫారం పంపలేదు. శ్రీనివాసరావు కేఫ్‌టేరియాలో పనిచేయడానికి బీసీఏఎస్‌ ఎలాంటి అనుమతి జారీ చేయలేదు.

విజయసాయిరెడ్డి:నిందితుడు శ్రీనివాసరావు విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో పనిచేయడానికి అవసరమైన అనుమతులున్నాయా? అతడు ఎయిర్‌పోర్టులో ఏయే ప్రాంతాల్లో తిరగడానికి అనుమతులున్నాయి?
బీసీఏఎస్‌: విశాఖపట్నం ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ అందచేసిన సమాచారం ప్రకారం శ్రీనివాసరావుకు 2018 అక్టోబర్‌ 1 నుంచి 2018 అక్టోబర్‌ 30 వరకు నెల రోజులకు తాత్కాలిక ఏఈపీ ఇచ్చారు. అది కూడా జోన్‌ ‘డి’ కేటగిరీ పాస్‌. ఈ పాస్‌ ఉన్న వారు డిపార్చర్‌ టెర్మినల్‌లో చెకిన్‌ ఏరియా వరకు వెళ్లొచ్చు.

విజయసాయిరెడ్డి: శ్రీనివాసరావు లేదా హర్షవర్థన్‌ చౌదరి విశాఖపట్నం ఎయిర్‌పోర్టులోని అతి ముఖ్యమైన ప్రదేశాల్లో తిరగడానికి ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఏఏఐ)కి లాంజ్‌ ఆఫీసర్‌ లేదా మేనేజర్, రాష్ట్ర ప్రభుత్వప్రోటోకాల్‌ ఆఫీసర్ల నుంచి అనుమతులు పొందారా?
బీసీఏఎస్‌:అందుబాటులో ఉన్న రికార్డులను బట్టి ఇద్దరికీ బీసీఏఎస్‌ అలాంటి అనుమతులు మంజూరు చేయలేదు.

విజయసాయిరెడ్డి:విశాఖపట్నం ఎయిర్‌పోర్టులని విమానాల్లో కూడా ఆహారం సర్వ్‌ చేయడానికి శ్రీనివాసరావుకు అనుమతులున్నాయా? ఫ్యూజన్‌ ఫుడ్స్‌ రెస్టారెంట్‌కు విశాఖపట్నం నుంచి బయలుదేరే వివిధ విమాన ప్రయాణికులకు ఆహార పదార్థాలు ఇచ్చే అనుమతి ఉందా?
బీసీఏఎస్‌:: లేదు. విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో క్యాటరింగ్‌ నిర్వహించడానికి ఫ్యూజన్‌ ఫుడ్స్‌ సంస్థ అనుమతులు పొందింది. డిపార్చర్‌ ఏరియాలో రెస్టారెంట్‌ ఏర్పాటు చేసుకోవడానికి ప్రత్యేకంగా మరో అనుమతి పొందింది. కేవలం రెస్టారెంట్‌లో మాత్రమే ప్రయాణికులకు ఆహార సేవలను అందించడానికి 2010 ఏప్రిల్‌ 5న ఏఏఐ అనుమతించింది.

విజయసాయిరెడ్డి:ఫ్యూజన్‌ ఫుడ్స్‌ రెస్టారెంట్‌ యజమాని హర్షవర్థన్‌ చౌదరి విశాఖ ఎయిర్‌పోర్టులోని సున్నితమైన ప్రాంతాల్లో కూడా తిరుగుతున్న విషయం నిజమైతే అందుకు ఎవరు అనుమతులిచ్చారు?
బీసీఏఎస్‌:
లేదు. అలాంటి అనుమతులు బీసీఏఎస్‌ ఇవ్వలేదు.

విజయసాయిరెడ్డి:ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ ఎయిర్‌పోర్టుకు వచ్చినప్పుడల్లా హర్షవర్థన్‌ చౌదరి నేరుగా విమానం వరకూ వెళ్లి స్వాగతం పలుకుతున్నవిషయం వాస్తవం కాదా? హర్షవర్థన్‌ చౌదరి నేరుగా విమానం దగ్గరకు వెళ్లి సీఎంను స్వాగతించడానికి అనుమతులు ఎవరు ఇచ్చారు?
బీసీఏఎస్‌: ముఖ్యమంత్రితో సహా వీవీఐపీ, వీఐపీలను స్వాగతించడం, వీడ్కోలు పలికే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానిదే. పూర్తి వివరాలు రావాల్సి ఉంది.

విజయసాయిరెడ్డి: విశాఖ ఎయిర్‌పోర్టులో హర్షవర్థన్‌ చౌదరి రెస్టారెంట్‌ నిర్వహించడానికి ఏ నిబంధనల కింద అనుమతులు ఇచ్చారు? రెస్టారెంట్‌ నిర్వహణలో ఏమైనా నిబంధనలను అతిక్రమించారా?  
బీసీఏఎస్‌:ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం ఫ్యూజన్‌ ఫుడ్స్‌ అండ్‌ హోటల్స్‌ క్యాటరింగ్‌ న్విహించడానికి 2017 సెప్టెంబర్‌ 22న బీసీఏఎస్‌ సెక్యూరిటీ అనుమతులు మంజూరు చేసింది. రెస్టారెంట్‌కు మాత్రం 2010లో ఏఏఐ అనుమతి ఇచ్చింది. సెక్యూరిటీ పరిధిలోకి రాని డిపార్చర్‌ టెర్మినల్‌ ఏరియాలో రెస్టారెంట్‌ నిర్వహించడానికి బీసీఏఎస్‌ నుంచి ప్రత్యేక అనుమతులు పొందాల్సిన అవసరం లేదు.

విజయసాయిరెడ్డి: ఫ్యూజన్‌ ఫుడ్స్‌లో పనిచేయడానికి ఎవరు ఎవరికి అనుమతులు ఇచ్చారు?
బీసీఏఎస్‌:దీనికి సంబంధించిన రికార్డులను ఏఏఐ సేకరిస్తోంది. వివరాలు రాగానే తెలియచేస్తాం.

విజయసాయిరెడ్డి: ఫ్యూజన్‌ ఫుడ్స్‌ రెస్టారెంట్‌ పని చేసే వేళలు ఏంటి? రెస్టారెంట్‌ నిర్వాహకుడు, సిబ్బంది పనివేళలు తెలియజేయండి. అలాగే రెస్టారెంట్‌లో పనిచేసే సిబ్బంది సంబంధించిన షిప్టు టైమింగ్‌ రికార్డు నిర్వహిస్తున్నారా? నిందితుడు శ్రీనివాసరావు, ఇతర ఉద్యోగుల పనివేళల వివరాలను తెలపగలరు?
బీసీఏఎస్‌: ఈ సమాచారం మా వద్ద లేదు. రాగానే తెలియచేస్తాం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top