తిరుమలలో ప్లాస్టిక్‌ నిషేధం

Use Of Plastic Ban In Tirumala - Sakshi

తిరుమల(చిత్తూరు జిల్లా):  తిరుమలలో గురువారం నుంచి ప్లాస్టిక్‌ కవర్ల వినియోగాన్ని టీటీడీ అధికారులు నిషేధించారు. అలాగే ప్లాస్టిక్‌ కవర్ల నిషేధంపై వ్యాపారులకు టీటీడీ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.25 వేల జరిమానా విధించాలని కూడా నిర్ణయం తీసుకుంది. రెండో సారి నిబంధన అతిక్రమిస్తే షాపు లైసెన్సు రద్దు చేస్తారు. స్వచ్ఛ తిరుమలలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు టీటీడీ అధికారులు చెబుతున్నారు. అలాగే తిరుమల వస్తోన్న భక్తులకు సైతం అవగాహన కల్పించాలని టీటీడీ భావిస్తోంది. 

ఆర్జిత సేవా టికెట్లు రేపు విడుదల

తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారి ఆర్జిత సేవా టిక్కెట్లను టీటీడీ రేపు విడుదల చేయనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నెల కోటా www.tirumala.org వెబ్‌సైట్‌ ద్వారా ఉదయం 10 గంటల నుంచి అందుబాటులోకి రానున్నాయి.  సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన, నిజపాద దర్శనం టిక్కెట్లను లక్కీడిప్‌ విధానంలో ఆన్‌లైన్‌లో టీటీడీ జారీ చేయనుంది. విశేష పూజ, కల్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవా టిక్కెట్లను కరెంటు బుకింగ్‌ కింద వెంటనే బుక్‌ చేసుకునే అవకాశం కల్పించింది.

భక్తుల నుంచి ఫిర్యాదులు, సలహాల స్వీకరణ కోసం తిరుమల అన్నమయ్య భవనంలో ప్రతినెలా మొదటి శుక్రవారం నిర్వహించే డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉదయం 8.30 నుంచి 9.30 గంటల మధ్య భక్తులు 0877-2263261 నెంబర్‌ ద్వారా టీటీడీ ఈవోతో మాట్లాడవచ్చు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top