ఉత్సాహంగా ప్రజా ఉద్యమం, 73వ రోజూ అదే జోరు


సాక్షి, రాజమండ్రి : సమైక్యాంధ్ర పరిరక్షణే ధ్యేయంగా జిల్లాలో 73 రోజులుగా సాగుతున్న ప్రజా ఉద్యమం జోరు తగ్గకుండా కొనసాగుతోంది. నిరాహార దీక్షలు, రాస్తారోకోలు, ర్యాలీలు నిర్వహిస్తూ వివిధ వర్గాల వారు ఉద్యమ స్ఫూర్తిని రగిలిస్తున్నారు. పలుచోట్ల దీక్షా శిబిరాలను సందర్శించి వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు సంఘీభావం ప్రకటించారు.

 

జిల్లాలో సమైక్య ప్రజా ఉద్యమం పట్టు సడలకుండా సాగుతోంది. వైఎస్సార్ సీపీ శ్రేణులు సమైక్య రాష్ట్రం కోసం సకల జనుల ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్నాయి. శుక్రవారం 73వ రో జు ఉద్యమం సడలని స్ఫూర్తితో సాగింది. రాజ మండ్రి కోటగుమ్మం సెంటర్ వద్ద కొనసాగుతున్న వైఎస్సార్ సీపీ దీక్షలకు ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, రాజమండ్రి అర్బన్ కోఆర్డినేటర్ బొమ్మన రాజ్‌కుమార్, రూరల్ కోఆర్డినేటర్ ఆకుల వీర్రాజు, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి టీకే విశ్వేశ్వరరెడ్డి తదితరులు మద్దతు తెలిపారు. పార్టీ నగర అధికార ప్రతినిధి కానుబోయిన సాగర్ చేపట్టిన 36 గంటల దీక్ష సాయంత్రంతో ముగిసింది.

 

కడియంలో వైఎస్సార్ సీపీ దీక్షలకు కోఆర్డినేటర్ ఆకుల వీర్రాజు, మాజీ ఎంపీ గిరజాల వెంకటస్వామి నాయుడు సంఘీభావం తెలిపారు. తుని తహశీల్దార్ కార్యాలయం వద్ద పార్టీ కార్యకర్తల దీక్షలకు పార్టీ కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి చలమశెట్టి సునీల్, మాజీ ఎమ్మె ల్యే పెండెం దొరబాబు మద్దతు తెలిపారు. ఏలేశ్వరంలో పార్టీ శ్రేణుల దీక్షలు కొనసాగుతున్నాయి. పార్టీ కోఆర్డినేటర్ వరుపుల సుబ్బారావు బుట్టలు అల్లుతూ పాత బస్టాండ్ సెంటర్ వద్ద నిరసన తెలిపారు. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో మెయిన్‌రోడ్డుపై రాస్తారోకో చేశారు. రంపచోడవరంలో పార్టీ ఆధ్వర్యాన దీక్షలు కొనసాగుతున్నాయి. 

 

తప్పెటగుళ్లు కళాకారుల ప్రదర్శన

రాజమండ్రిలో పశు సంవర్ధక శాఖ ఉద్యోగుల జేఏ సీ ఆధ్వర్యంలో పశువుల ఆస్పత్రి వద్ద తప్పెటగు ళ్లు కళాకారులు గీతాలు ఆలపిస్తూ ప్రదర్శన చేశా రు. ఆస్పత్రి నుంచి గోకవరం బస్టాండు వరకూ పాటలు పాడుతూ ర్యాలీ చేశారు. షీప్ ఫెడరేషన్ అధ్యక్షులు కొయ్య రామకేశవ్, యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు అంకం గోపి, డీసీసీబీ డెరైక్టర్ పలివెల వెంకటరావు ఉద్యోగుల దీక్షలకు మద్దతు తెలిపారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాజమండ్రి సాయి బ్రాహ్మణ సంఘం సభ్యులు కోటగుమ్మం వద్ద రిలే దీక్ష చేపట్టారు.

 

కాకినాడలో సమైక్య రాష్ట్ర పరిరిక్షణ వేదిక ఆధ్వర్యంలో ఉద్యోగులు ర్యాలీ చేశారు. కలెక్టరేట్ ఎదుట జేఏసీ శిబిరంలో ఏపీ రెవిన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఇరిగేషన్ శాఖ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సత్యనారాయణ, సహకార శాఖ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షులు ఫణి పేర్రాజు దీక్షల్లో పాల్గొన్నారు. కాకినాడలో జేఏసీ దీక్షలకు మద్దతు పలికిన పిఠాపురం ఎమ్మెల్యే వంగా గీత తాను అసెంబ్లీలో తెలంగాణ  తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేస్తానని రాసి ఇచ్చారు.

 

యువకుల ఆమరణ దీక్ష

సీమాంధ్ర సమస్యలు పరిష్కారానికి రాజకీయ పార్టీలన్నీ కలిసి జేఏసీగా ఏర్పడాలని డిమాండ్ చేస్తూ ఉప్పలగుప్తం బాలయోగి పార్కులో చేట్ల విద్యాసాగరరావు ఆధ్వర్యంలో నలుగురు ఆమరణ దీక్షలు చేపట్టారు. టీడీపీ ఆధ్వర్యంలో గొల్లవిల్లి గ్రామంలో రాస్తారోకో చేశారు. సమైక్యాంధ్రను కాంక్షిస్తూ నిర్వహించిన 72 గంటల దీక్షను సింహంభట్ల జ్యోతకుమారి విరమించారు. ఎన్.కొత్తపల్లిలో సమైక్యాంధ్రను కాంక్షిస్తూ గ్రామస్తులు గోపూజ చేశారు. 

 

ముమ్మిడివరంలో జేఏసీ ఆధ్వర్యంలో 216 జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. కొత్తపేటలో ఇసుక ర్యాంపు కార్మికులు ఖాళీ బేసిన్లతో నిరసన తెలిపి జేఏసీ శిబిరంలో దీక్షలు చేపట్టారు. రావులపాలెంలో జేఏసీ చేపట్టిన దీక్షలకు వైఎస్సార్‌సీపీ కో ఆర్డినేటర్ జగ్గిరెడ్డి మద్దతు పలికారు. రాజానగరంలో జేఏసీ ఆధ్వర్యంలో పీఎంపీలు దీక్షలు చేపట్టారు. రామచంద్రపురంలో వీఎస్‌ఎం కళాశాల విద్యార్థులు ర్యాలీ చేసి ఆర్టీసీ ఉద్యోగులు, మున్సిపల్ కార్మికులకు బియ్యం పంపిణీ చేశారు.

 

1200 మందికి ఆపన్న హస్తం

‘జగన్ ఆపన్నహస్తం’ పేరిట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీజీసీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో 1200 మంది ఉద్యోగులకు బియ్యం, ఇతర నిత్యావసర వస్తువుల కిట్లు పంపిణీ చేశారు. జగ్గంపేట నియోజకవర్గంలోని జగ్గంపేట, గండేపల్లి, కిర్లంపూడి, గోకవరం మండలాలతోపాటు ఏలేశ్వరం మండలానికి చెందిన ఉద్యోగులకు ఈ సరకులు పంపిణీ చేశారు.

 
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top