చేతికి అందివచ్చిన కొడుకులిద్దరూ...

two died in road accident at Guntur - Sakshi

అచ్చంపేట(క్రోసూరు): రోడ్డు ప్రమాదంలో ఇరువురు యువకులు మృతి చెందిన  సంఘటన  క్రోసూరు మండలంలోని ఎర్రబాలెం బ్రిడ్జి దిగువలో బుధవారం అర్థరాత్రి చోటుచేసుకుంది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి.  అచ్చంపేట మండలం, కస్తల గ్రామానికి చెందిన షేక్‌ ఖాజావలి(21), బత్తుల రామకృష్ణ (20)   బైక్‌పై స్వగ్రామమైన కస్తల నుంచి క్రోసూరు మీదుగా సత్తెనపల్లి వెళుతుండగా ఎర్రబాలెం బ్రిడ్జి డౌన్‌లో ఆగి ఉన్న ఇసుక లారీని ఢీకొట్టారు.  

ఖాజావలి అక్కడికక్కడే మృతి చెందగా, కొన ఊపిరితో ఉన్న రామకృష్ణను మెరుగైన వైద్యం కోసం సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో మృతిచెందాడు.  ఇసుక లోడ్‌ లారీ బ్రిడ్జి దిగువలో సిగ్నల్‌ లైట్లు కూడా లేకుండా రోడ్డుపై ఆపడంతో చీకట్లో కనిపించకపోవడం వల్లనే తమ పిల్లలు ఇద్దరూ మృతి చెందారని మృతుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. క్రోసూరు ఎస్‌ఐ టి.ఏడుకొండలు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఖాజావలి మృతదేహాన్ని సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.  

చేతికి అందివచ్చిన కొడుకులిద్దరూ...
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఖాజావలి,  రామకృష్ణ ఇద్దరూ ఆయా కుటుంబాల్లో ఇంటికి పెద్ద కుమారులు కావడం గమనార్హం. చేతికి అందివచ్చే తరుణంలో మృతి చెందడంతో వారి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ఖాజావలి తల్లిదండ్రులు నాగుల్‌మీరా, రంజాన్‌బీ. నాగుల్‌మీరా కూలి పని చేసుకుని జీవిస్తుంటాడు. ఖాజావలి సత్తెనపల్లిలో ఏసీ మెకానిక్‌గా పనిచేస్తుంటాడు. ఉదయాన్నే పనికి వెళ్లాలన్న తలంపుతో రాత్రి సమయంలో సత్తెనపల్లికి బయలు దేరాడు.  మృతి చెందిన మరో యువకుడు  రామకృష్ణ సత్తెనపల్లిలో డిగ్రీ చదువుతున్నాడు. ఇద్దరూ స్నేహంగా ఉండేవారు. రామకృష్ణ తండ్రి నరసింహారావు వ్యవసాయం చేస్తుంటాడు. తల్లి రమాదేవి గృహిణి. 

ఇసుక లారీలను అదుపు చేయకపోవడం వలనే...
ఇసుక లారీలను అధికారులు అదుపు చేయలేకపోవడంతో రాత్రినక, పగలనక ఇష్టారాజ్యంగా ఇసుక రవాణా చేస్తూ ఎక్కడ బడితే ఆక్కడ ఆపడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని, బాధ్యులపై చర్యలు చేపట్టాలని, ఇసుక ర్యాంపు నుంచి ఇసుక రవాణా నిలిపి వేయాలని మృతుల బంధువులు డిమాండ్‌ చేస్తున్నారు. 

వైఎస్సార్‌ సీపీ సంతాపం
సత్తెనపల్లిలో పోస్టుమార్టం పూర్తయిన అనంతరం ఖాజావలి మృత దేహాన్ని స్వగ్రామమైన కస్తల గ్రామానికి గురువారం మధ్యాహ్నం తరలించారు. కుమారుడి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. మండల వైఎస్సార్‌ సీపీ ఇన్‌చార్జి కన్వీనర్‌ సీహెచ్‌ ఎస్సార్కే సాయిరెడ్డి, జిల్లా పార్టీ సభ్యుడు సుంకర శ్రీనివాసరెడ్డి, ఎస్సీ సెల్‌ జిల్లా కార్యదర్శి గుడేటి శ్యాంసన్, మాజీ ఎంపీటీసీ చిల్కా వెంకట్రావు, పట్టణ యూత్‌ కన్వీనర్‌ చల్లా శ్రీకాంత్, నాగులు తదితరులు మృతదేహాలను సందర్శించి మృతుల కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియచేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top