వైఎస్సార్‌సీపీలో చేరిన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

వైఎస్సార్‌సీపీలో చేరిన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు - Sakshi


దర్శకుడు కోదండరామిరెడ్డి కూడా..

 

హైదరాబాద్: చిత్తూరు ఎమ్మెల్యే సి.కె.బాబు (జయచంద్రారెడ్డి), తణుకు ఎమ్మెల్యే కారుమూరు వెంకట నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. వారిద్దరూ బుధవారం వైస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆయన నివాసంలో విడివిడిగా కలుసుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రముఖ సినీ దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి, కావలి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నెల్లూరు జిల్లా సీనియర్ నేత వంటేరు వేణుగోపాల్‌రెడ్డి, చింతలపూడి  కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావుకు సన్నిహిత  సహచరుడైన గంటా మురళి కూడా జగన్‌ను కలిసి పార్టీ లో చేరారు.



తన సతీమణి లావణ్యతో వచ్చిన సి.కె.బాబుకు జగన్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. లావణ్యకు గౌరవాధ్యక్షురాలు విజయమ్మ కండువా వేసి పార్టీలో చేర్చుకున్నారు. కారుమూరు పెద్ద సంఖ్యలో తన అనుచరులతో వచ్చి పార్టీలో చేరిన సందర్భంగా నర్సాపురం, ఏలూరు లోక్‌సభ పార్టీ సమన్వయకర్తలు ఎం.ప్రసాదరాజు, తోట చంద్రశేఖర్ కూడా ఉన్నారు. వేణుగోపాల్‌రెడ్డి చేరిక సందర్భంగా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్త మేకపాటి గౌతమ్‌రెడ్డి కూడా ఉన్నారు.

 

వైఎస్ పథకాలు ఆదర్శనీయం: కారుమూరు

పదేళ్ల కిందట భయానకమైన కరువు కాటకాలతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజానీకానికి వైఎస్ రాజశేఖరరెడ్డి  చేపట్టిన పథకాలు ఎంతో మేలు చేశాయని, ఇవన్నీ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలోనే అమలవుతాయనే విశ్వాసంతోనే పార్టీలో చేరానని నాగేశ్వరరావు చెప్పారు. వైఎస్ పథకాల వల్ల బడుగు, బలహీనవర్గాలకు ఎక్కువగా మేలు జరిగిందన్నారు. తన లేఖతోనే రాష్ట్రం విడిపోయిందని తెలంగాణలో మాట్లాడుతూ... సీమాంధ్రలో మరో విధంగా చెబుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు నిలకడలేని నాయకుడని విమర్శించారు. సీమాంధ్ర ప్రాంత అభివృద్ధి జగన్‌తోనే సాధ్యమన్నారు.

 

సీఎం అంటే వైఎస్సే: కోదండరామిరెడ్డి

వైఎస్ నిత్యం నవ్వుతూ ఒక ముఖ్యమంత్రి ఎలా ఉండాలో అలా ఉండేవారని సినీ దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి కొనియాడారు. ముఖ్యమంత్రిననే భావం లేకుండా అందరినీ పలకరిస్తూ పేద, బడుగు ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టారని చెప్పారు.  వైఎస్ అంటే తనకు అపారమైన గౌరవాభిమానాలున్నాయని, ఆయన కడుపున పుట్టిన బిడ్డగా జగన్ ఆంధ్రప్రదేశ్‌ను బ్రహ్మాండంగా అభివృద్ధి చేయగలరని తాను భావిస్తున్నట్లు చెప్పారు. అందుకే తాను పార్టీలో చేరానని కోదండరామిరెడ్డి వెల్లడించారు.

 

బాబును, బీజేపీని ప్రజలు నమ్మరు: వంటేరు

రాష్ట్ర విభజనకు లేఖ ఇచ్చిన చంద్రబాబును, దగ్గరుండి విభజన జరిపించిన బీజేపీని రాష్ట్ర ప్రజలు నమ్మరని వంటేరు వేణుగోపాలరెడ్డి చెప్పారు. కొత్త రాష్ట్రం జగన్ నేతృత్వంలో అన్ని విధాలా అభివృద్ధి చెందుతుంద న్నారు. వేణుగోపాలరెడ్డి 1999లో కావలి టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2012లో నెల్లూరు లోక్‌సభ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top