తిరుపతిలో మద్యపాన నిషేదం..!

TTD Executive Council Wants To Tirupati Liquor Free Zone - Sakshi

సాక్షి, తిరుమల : టీటీడీ పాలకమండలి బుధవారం పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. తిరుపతిలో కూడా పూర్తిస్థాయిలో మద్యపాన నిషేదం విధించాలని ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్టు పాలకమండలి వెల్లడించింది. టీటీడీ అంటే తిరుమల మాత్రమే కాదని, తిరుమల-తిరుపతి కలిసి ఉంటాయని స్పష్టం చేసింది. దాంతోపాటు కల్యాణకట్ట కార్మికులు, ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేసేందుకు బోర్డు సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. బాలాజీ రిజర్వాయర్‌ నిర్మాణానికి బోర్డు ఆమోదం తెలిపింది. శ్రీవారి బ్రహ్మోహ్సవాలను విజయవంతంగా నిర్వహించినందుకు టీటీడీ అధికారులు, ఉద్యోగులకు పాలకమండలి ధన్యవాదాలు తెలిపింది.

గత ప్రభుత్వ హయాంలో తిరుపతిలో గరుడ వారధి నిర్మించాలని భావించారు. అయితే, గరుడ వారధి ఎక్కువ భక్తులకు ఉపయోగపడేలా ఉండాలనే ఉద్దేశంతో.. దాని నిర్మాణ ప్లాన్‌ను రీ డిజైన్ చేయాలని బోర్డు తీర్మానించింది. రీ టెండర్లు పిలవడానికి బోర్డు ఆమోదం తెలిపింది. ఇక శ్రీ వెంకటేశ్వర ఇన్సిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (స్విమ్స్‌) ఆసుపత్రిని అధీనంలోకి తీసుకుని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయ్యాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. టీటీడీ అటవీశాఖలో 162 మంది సిబ్బంది ని రెగ్యులర్ చేసి, మిగిలిన వారికి టైమ్ స్కేల్ ఇవ్వాలని పాలకమండలి నిర్ణయం తీసుకుంది. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, బోర్డు సభ్యులు మేడ మల్లిఖార్జున రెడ్డి, తుడా చైర్మన్‌ చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు భూమన కరుణాకరరెడ్డి, టీటీడీ ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌, ఇతర బోర్డు సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top