టీటీడీలో ఎవరికి వారే.. యమునా తీరే

TTD Employes Not Follow Protocol - Sakshi

వివాదాల కొండ

ఈఓ, జేఈఓ, అధికారుల మధ్య సమన్వయ లోపం

ప్రొటోకాల్‌తో సంబంధం లేకుండా టీడీపీ వారికే పెద్దపీట

సాక్షాత్తు దేవాదాయశాఖామంత్రికే దిక్కులేదు

మాజీ ప్రధాని, కర్ణాటక సీఎంలకు గౌరవం ఇవ్వని టీటీడీ

రోజుకో వివాదం.. పూటకో ఫిర్యాదు.. ఈఓ, జేఈఓ, అధికారుల మధ్య సమన్వయ లోపం.. పాలకమండలి సభ్యుల ఇష్టారాజ్యం వెరసి తిరుమల తిరుపతి దేవస్థానం వివాదాల్లో కూరుకుపోయింది. ఆలయాల భద్రత గాల్లో దీపంలా కొట్టుమిట్టాడుతోంది. ఇటీవల చోటు చేసుకుంటున్న వరుస సంఘటనలే దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. గతంలో శ్రీకోదండరామస్వామి, తిరుచానూరు పద్మావతి ఆలయాల్లో నగలు మాయమయ్యాయి. అది సద్దు్దమణగకముందే నాలుగు రోజుల క్రితం తిరుపతి శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో ఉత్సవమూర్తులకు అలకరించే మూడు బంగారు కిరీటాలు మాయమయ్యాయి. వాటిని ఎవరు దొంగిలించుకెళ్లారో ఇంతవరకు కనిపెట్టలేకపోవడం తీశ్ర విమర్శలకు తావిస్తోంది.

సాక్షి, తిరుపతి: తిరుమల క్షేత్రం వివాదాలకు కేంద్రబిందువైంది. అధికారుల మధ్య సమన్వయలోపం కొట్టొచ్చినట్టు కన్పిస్తోంది. పాలకమండలి తీరు రోజురోజుకూ తీసికట్టుగా మారుతోంది. తరచూ ప్రొటోకాల్‌ వివాదం తెరమీదికొస్తోంది. టీడీపీ నేతలకే పెద్దపీట వేయడం రివాజుగా ఉంటోంది. ఆలయాల భద్రత గాలికొదిలేశారన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. శ్రీవారి ఆలయంలో ఫింక్‌డైమండ్‌తో పాటు విలువైన ఆభరణాలు మాయమయ్యాయని ఆరోపించారు. అందులో నిజానిజాలపై టీటీడీ ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు.

తారాస్థాయికి చేరిన ప్రొటోకాల్‌ వివాదం
దేవాదాయశాఖామంత్రి కేఈ కృష్ణమూర్తి ఇటీవల టీడీపీపై చేసిన ఆరోపణలు సంచలనమయ్యాయి. ఏపీ రాజధాని అమరావతిలో గురువారం రూ.150 కోట్లు టీటీడీ నిధులతో నిర్మించనున్న శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూకర్షణ కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి దేవాదాయశాఖా మంత్రి, ఉపముఖ్యమంత్రి బీసీ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ సీనియర్‌ నాయకుడు కేఈ కృష్ణమూర్తికి టీటీడీ ప్రాధాన్యత ఇవ్వలేదు. కార్యక్రమం గురించి పూర్తి సమాచారం లేకపోవడంతో కేఈ అమరావతిలో జరిగిన శ్రీవారి భూకర్షణ కార్యక్రమానికి వెళ్లలేకపోయారు. ఈ విషయంపై దేవాదాయశాఖా మంత్రి కేఈ కృష్ణమూర్తి టీటీడీ తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ఇలాంటి అవమనాలే ఎదురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వైకుంఠ ఏకాదశి నాడు తిరుమలకు చేరుకున్న మంత్రి కేఈ కృష్ణమూర్తి విషయంలో టీటీడీ ప్రొటోకాల్‌ పాటించలేదు. రోడ్డుపైనే చాలాసేపు కారులోనే గడిపారని తెలిసింది. కేఈ వ్యక్తిగత కార్యదర్శి టీటీడీ అధికారులకు ఫోన్‌చేసి ఆగ్రహం వ్యక్తం చేసిన కొంత సమయానికి చైర్మన్‌ అనుచరులు వచ్చి గది కేటాయించినట్లు సమాచారం. ఆ తరువాత ఈఓ, జేఈఓ, చైర్మన్‌ పలువురు అతిథిగృహానికి చేరుకుని మంత్రి కేఈకి క్షమాపణ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక సీఎం కుమారస్వామి విషయంలోనూ వైకుంఠ ఏకాదశి నాడు టీటీడీ ప్రొటోకాల్‌ పాటించలేదు. మాజీ బోర్డు సభ్యులు ఓవీ రమణ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి టీటీడీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ కూడా పలుమార్లు టీటీడీ అధికారులపై నేరుగా సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. స్థానిక శాసనసభ్యురాలైన తనకు టీటీడీ ప్రొటోకాల్‌ విషయంలో పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి.

ఎన్నడూ లేని విధంగా అవినీతి మరక..
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ నాలుగేళ్ల కాలంలో టీటీడీ వరుస వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. అవినీతి అక్రమాలపై ఏకంగా అత్యున్నత న్యాయస్థానం సైతం టీటీడీని మొట్టికాయలు వేసే పరిస్థితి వచ్చింది. అధికారపార్టీ నేతల అత్యుత్సాహం, అవినీతి, అక్రమాలకు ద్వారం తెరవడంతో వివాదాలు చుట్టుముడుతున్నాయి. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన దర్శకుడు రాఘవేంద్రరావు ఎస్వీబీసీలో అక్రమాలకు పాల్పడ్డారనే విషయం వెలుగులోకి రావడం, దీనిపై విచారణ జరగడం తెలిసిందే. టీటీడీ నిధులను దారిమళ్లించే విషయంలోనూ ఎదురుదెబ్బలు తప్పలేదు. శ్రీవారి భక్తుడైన నవీన్‌కుమార్‌రెడ్డి టీటీడీలో జరుగుతున్న అవకతవకలపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పలు అంశాల్లో న్యాయస్థానం టీటీడీకి చురకలంటించిన విషయం తెలిసిందే. అందులో అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం టీటీడీ 25 ఎకరాలను కొనుగోలు చేసింది.  అక్కడ ఎకరం రూ.25 లక్షలు ఉంటే రూ.50 లక్షల చొప్పున సీఆర్‌డీఏకి చెల్లించింది.

ఇదంతా ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే జరిగినట్లు సమాచారం. దీనిపై శ్రీవారి భక్తుడు నవీన్‌కుమార్‌రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. టీటీడీ అధికారులకు లేఖ రాశారు. భూమి కొనుగోలులో టీటీడీ, ప్రభుత్వ పెద్దలు విమర్శలు వెల్లువెత్తడంతో అదనంగా చెల్లించిన రూ.12.5 కోట్లు తిరిగి టీటీడీ ఖాతాలో జమచేశారు. టీటీడీ బోర్డు ఏర్పాటులోనూ ప్రభుత్వం అభాసుపాలవ్వగా.. ఈ ప్రభావం దేవస్థానంపైనా పడింది. కాల్‌మనీ, అక్రమాల కేసులు కలిగిన వ్యక్తులకు బోర్డులో చోటు ఇవ్వడంపైనా గతంలో వివాదాలు చెలరేగాయి. తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న కే రాఘవేంద్రరావుకు ఏకంగా ఎస్వీబీసీ చైర్మన్‌ను చేయడంపైనా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. వైకుంఠ ఏకాదశి, జనవరి 1న ఇష్టారాజ్యంగా అధికార పార్టీ నేతలకు పాసులు జారీ చేయడం పెద్ద దుమారం రేపింది.

ఎవరి దారి వారిదే
టీటీడీలో ఉన్నతాధికారుల నుంచి కిందిస్థాయి ఉద్యోగుల మధ్య సమన్వయ లోపం ఉంది. ఒక్క ప్రొటోకాల్‌ విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు టీటీడీ అధికారులకు సమాచారం ఇస్తారు. సమాచారం తీసుకున్న అధికారి ప్రొటోకాల్‌ వ్యవహారాలను కింది స్థాయి అధికారికి చెప్పి వదిలేస్తున్నారు. ఆ కిందిస్థాయి అధికారికి సరైన సమాచారం లేకపోవడంతో ప్రొటోకాల్‌ వివాదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. టీటీడీలో పాలనాపరమైన వ్యవహారాల్లో ఈఓ అనిల్‌కుమార్‌ సింఘాల్, జేఈఓ శ్రీనివాసరాజు మధ్య విభేదాలు ఉన్నాయన్నది తిరుమలలో తెలియని వారులేరు. సుదీర్ఘ కాలం తరువాత ఏర్పడిన పాలకమండలి సభ్యుల మధ్య విభేదాలు ఉన్నాయి.  టీటీడీలో పనిచేస్తున్న అధికారుల బదిలీల్లో బోర్డు సభ్యులు జోక్యం పెరగడంతో అధికారులు తీవ్ర ఒత్తిళ్లకు గురవుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా బదిలీ చేసేందుకు ఉన్నతాధికారులు ససేమిరా అనడంతో అమరావతి నుంచి వేధింపులు అధికమైనట్లు సమాచారం. తిరుమల స్థానికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ, పాలకమండలి జోక్యం చేసుకోవాల్సి ఉంది. వారి సమస్యలను పరిష్కరించకపోగా ఈ నెపాన్ని అధికారుల మీద నెట్టి రాజకీయ లబ్ధిపొందేందుకు స్థానిక టీడీపీ నేతల ప్రయత్నాన్ని తప్పుబడుతున్నారు. విధిలేని పరిస్థితుల్లో తిరుమల స్థానికులు రోడ్డెక్కాల్సి వచ్చింది.
    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top