గీత దాటితే మోతే!

Traffic Offences And Their Penalties - Sakshi

సాక్షి, వేటపాలెం (ప్రకాశం): మీ పిల్లలకు వాహనాలిస్తున్నారా? మైనర్‌ అయి ఉండి పోలీసులకు పట్టుబడితే ఇకపై మీరు జైలుకెళ్లాల్సి ఉంటుంది. మద్యం తాగి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడితే నామమాత్రపు జరిమానా చెల్లించి బయటపడొచ్చని అనుకుంటున్నారా? ఇక మీదట డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడితే మాత్రం భారీ జరిమానాతో పాటు జైలుకెళ్లాల్సిందే. రోడ్డుపై ప్రయాణిస్తున్న సమయంలో అంబులెన్సుకు దారి ఇవ్వకపోతే ఇకపై భారీ జరిమానా చెల్లించుకోవాల్సిందే. ఇలా ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించే వారికి వచ్చే నెల 1 నుంచి భారీగా జరిమానాలు పోలీసులు విధించనున్నారు. మోటారు వాహనాల చట్టం ప్రకారం ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలతో పాటు జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఈ మేరకు మోటారు వాహనాల చట్ట సవరణ బిల్లును కేంద్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదించింది.

ఇప్పటి వరకు విధించే జరిమానాలు కొన్ని రెట్టింపు కాగా, మరికొన్ని మూడు, నాలుగు రెట్లు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చిన్న పిల్లలకు వాహనాలు ఇస్తే పిల్లల తల్లిదండ్రులకు లేదా సంరక్షకులకు రూ. 25 వేల జరిమానాతో పాటు మూడేళ్ల జైలుశిక్ష విధించే అవకాశం ఉంది. దీంతోపాటు డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు చేసే అవకాశమూ ఉంది. ఒకవేళ పిల్లలు ప్రమాదం చేస్తే తల్లిదండ్రులు, సంరక్షకులను దోషులుగా నిర్ధారిస్తారు. రోడ్డుపై వెళ్లే అంబులెన్సుకు దారి ఇవ్వకపోతే రూ. 10 దివేల జరిమానా చెల్లించాలి. వాహనం నడిపేటప్పుడు ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించే వారికి భారీగా జరిమానాలు విధించేలా నూతన బిల్లును కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. ఇటీవల జిల్లాలో డ్రంక్‌ అండ్‌ డ్రైవింగ్‌ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. మరోవైపు హైవేలపై జరుగుతున్న ప్రమాదాల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రధానంగా ట్రాఫిక్‌ నిబంధనలు పాటించకపోవడం, మద్యం మత్తులో జరిగే ప్రమాదాలు తరచూ చోటు చేసుకుంటున్నాయి.

అయితే ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనపై భారీ ఎత్తున జరిమానాలు విధించేందుకు అటు పోలీసులు, ట్రాఫిక్‌ అధికారులతో పాటు రవాణా శాఖ అధికారులు సిద్ధమయ్యారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా వాహనం నడిపితే రూ.10 వేలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అంతే కాకుండా డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉల్లంఘనకు పాల్పడే వాహనదారులకు రూ. 1లక్ష వరకు జరిమానా విధించే అధికారం ఆయా శాఖల అధికారులకు ఉంది. రోడ్డుపై పరిమితికి మించి వేగంగా దూసుకెళ్లే వాహనదారులకు రూ. 1000 నుంచి రూ. 2 వేల వకు జరిమానా విధించాలని నిబంధనల్లో పేర్కొన్నారు.

వాహన బీమా లేకుండా వాహనం నడిపితే రూ. 2వేలు , సీటుబెల్టు లేకుండా వాహనం నడిపితే వెయ్యి రూపాయల జరిమానాతో పాటు మూడు నెలలు డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు చేస్తారు. హెల్మెట్‌ లేకుండా ప్రయాణం చేసినా రూ. 1000 జరిమానాతో పాటు మూడు నెలలు డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు చేస్తారు. ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ ఉల్లంఘిస్తే రూ. 500 జరిమానా మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడితే రూ. 10 వేలు జరిమానాతో పాటు జైలుశిక్ష అనుభవించాలి. రవాణా చేసే వాహనాలు ఓవర్‌ లోడుతో పట్టుబడితే రూ. 20 వేలు చెల్లించేలా నిబంధనల్లో మార్పు చేశారు. అధికారులే ఉల్లంఘిస్తే జరిమానాలు రెట్టింపు అవుతాయని నిబంధనల్లో పేర్కొన్నారు. ఈ నిబంధనలు అమల్లోకి వస్తే ప్రమాదాలు తగ్గుతాయని భావిస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top