భద్రాద్రి రామాలయంలో రేపు విజయదశమి వేడుకలు


 భద్రాచలం టౌన్, న్యూస్‌లైన్:

 భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో విజయ దశమి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించనున్నట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి(ఈఓ) ఎం.రఘునాధ్, ప్రధాన అర్చకులు పొడిచేటి జగన్నాధాచార్యులు ఒక ప్రకటనలో తెలిపారు. పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారంగా.. శ్రీ దేవీ నవరాత్రి ఉత్సవాలు ముగిసిన పిదప రామాలయంలో విజయ దశమి వేడుకలను నిర్వహించటం ఆనవాయితీ అని పేర్కొన్నారు.

 

 ప్రత్యేక కార్యక్రమాలు: 14వ తేదీన భద్రాద్రి రామాలయంలో జరిగే వేడుకల వివరాలను ఈఓ, ప్రధాన అర్చకులు వివరించారు. గజ, అశ్వ, రాజాధిరాజ వాహనాలపై రామయ్య స్వామి దసరా మండపం వరకు పారువేటకు వెళతారు. తెల్లవారుజామున స్వామి వారి మూల విరాట్టులకు, ఉత్సవమూర్తులకు అంతరాలయంలో ఏకాంతంగా అభిషేకం ఉంటుంది. ఉదయం 8 నుంచి 8.15 గంటల వరకు క్షేత్ర మహత్యం, 9 నుంచి 10 గంటల వరకు నిత్య కళ్యాణం, 10 నుంచి 11 గంటల వరకు మహా పట్టాభిషేకం, 11 నుంచి 12 గంటల వరకు యాగశాలలో మహాపూర్ణాహుతి, 12 గంటలకు ఆరాధన, ఆరగింపు, నివేదన ఉంటాయి. మధ్యాహ్నం ఒంటిగంటకు ఆలయ తలుపులు మూస్తారు. 3 గంటలకు స్వామి వారికి రాజ దర్బార్, 3.30 నుంచి 4.30 గంటల వరకు పారువేట ఉంటాయి. సాయంత్రం 4.30 నుంచి 5.30 గంటల వరకు దసరా మండపంలో శమీ, ఆయుధ పూజ, ఆశీర్వచనం; 6.06 గంటలకు శ్రీరామలీల ఉత్సవం సందర్భంగా రావణాసురవధ కార్యక్రమాలు నిర్వహిస్తారు.

 

 వీరలక్ష్మి అలంకరణలో అమ్మవారు

 శ్రీ దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శ్రీ లక్ష్మీ తాయారమ్మ వారు శనివారం వీరలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. నవరాత్రి ఉత్సవాలు ముగియనున్న నేపథ్యంలో అమ్మవారిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. అమ్మవారికి పంచామృతాలతో, నారీకేల జలంతో,  పండ్ల రసాలతో, నదీజలాల తో ఆలయ అర్చకులు అభిషేకం.. సహస్ర జలాభిషేకం నిర్వహించారు. మధ్యాహ్నం అమ్మవారిని వీరలక్ష్మిగా అలంకరించి భక్తుల దర్శనార్దం లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయంలో కొలువుతీర్చారు. ఈ అలంకరణ ప్రాశస్థ్యాన్ని ఆలయ అర్చకులు వివరించారు. అనంతరం, అమ్మవారికి ఎదురుగా రామయ్య స్వామికి దర్బారు సేవ నిర్వహించారు. తాత గుడి సెంటర్ వరకు తిరువీధి సేవ వైభవంగా నిర్వహించారు. అమ్మవారు 14వ తేదీన నిజరూప లక్ష్మి అలంకరణ లో దర్శనమిస్తారని వేద పండితులు గుదిమెళ్ల మురళీకృష్ణమాచార్యులు తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top