చిరునవ్వే ఇంధనంగా..

Today YS jagan Praja Sankalpa Yatra Schedule - Sakshi

దిగ్విజయంగా 5 నియోజకవర్గాల్లో ప్రజాసంకల్ప యాత్ర పూర్తి

ఇప్పటివరకు జిల్లాలో 126.1 కి.మీ. సాగిన జగన్‌ పాదయాత్ర

నేడు నరసన్నపేట నియోజకవర్గంలోకి ప్రవేశం

శ్రీకాకుళం, అరసవల్లి: ఆ అడుగులు ఆత్మవిశ్వాసానికి ప్రతీకలు..ఆ అభివాదాలు భవిష్యత్‌ తరాలకు ఆశలు.. కేవలం చిరునవ్వే ఇంధనంగా.. ఒకటి కాదు రెండు కాదు...ఏకంగా మూడు వేల కి.మీలకు పైగా నడుస్తూనే...  అడుగడుగునా బాధితుల్ని ఆదుకుంటూ ఓదార్చుతూ... భవిష్యత్‌పై భరోసా ఇస్తూ.. ముందుకు సాగుతున్న సంకల్ప యోధుడైన వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సిక్కోలు జిల్లాలో సగభాగం యాత్ర ను దిగ్విజయంగా పూర్తి చేశారు. రాష్ట్రంలో ‘నారా’కాసుర నిరంకుశ పాలన నుంచి రాష్ట్ర ప్రజలను రక్షించే దిశగా ప్రజాసంకల్ప యాత్ర చేపట్టిన రాష్ట్ర ప్రతిపక్ష నేత జగన్‌...ఇప్పటి వరకు ఐదు నియోజకవర్గాల్లో యాత్రను అత్యధికమైన ప్రజామద్దతుతో పూర్తి చేశారు. జిల్లాలోకి గత నెల 25వ తేదీన విజయనగరం జిల్లాలో యాత్ర పూర్తి చేసుకుని పాలకొండ నియోజకవర్గం వీరఘట్టం మండలం కెల్ల గ్రామంలో అడుగుపెట్టారు. తొలిరోజు 4.6 కిలోమీటర్లతో ప్రారంభమైన ఆ జగన్నాథ రథ చక్రాలు...ఇప్పటివరకు ఐదు నియోజకవర్గాలను చుట్టేసి, మొత్తం 126.1 కి.మీల మైలురాయి దాటింది. ప్రజాసంక్షేమం కోసం పాదయాత్ర చేస్తూ చరిత్రను తిరగరాస్తూ కొనసాగిస్తున్న ఈ సంకల్ప యోధుడి అడుగులు నేడు మరో నియోజకవర్గంలోకి పెట్టనున్నాయి.

జనహర్షంతో కొనసాగుతున్న యాత్ర...
వైఎస్సార్‌సీపీ అధినేత, రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపడుతున్న పాదయాత్ర యావత్తు జన హర్షంతో కొనసాగుతోంది. అడుగడుగునా ప్రజలు తమ సమస్యలను జగన్‌కు వివరిస్తూ, ప్రస్తుత టీడీపీ సర్కార్‌ చేస్తున్న అవినీతి, అక్రమాలను ప్రస్తావిస్తున్నారు. రైతులు తమ పంటలకు మద్దతు ధరలేదంటూ వాపోతుంటే..తమకు సమాన పనికి సమాన వేతనం రాలేదంటూ కార్మికులు గగ్గోలు పెడుతున్నారు. అలాగే మరికొందరైతే పింఛన్‌లకు అర్హతున్నా పట్టించుకోవడం లేదని, నిరుద్యోగులంతా ఉద్యోగాలు లేవంటుంటే..ఉన్న ఉద్యోగాలకు భద్రత లేదంటూ కొందరు జగన్‌ వద్ద ఆవేదన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ప్రజలందరి మద్దతుతో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని భరోసా ఇస్తూ జగన్‌ ముందుకు సాగుతున్నారు. అలాగే జగన్‌ పడుతున్న కష్టాన్ని చూసి చలించిపోయిన మహిళలు, వృద్ధులు ‘‘ నీ కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుందంటూ ’’ ఆశీర్వదిస్తున్నారు. కాగా ఇప్పటి వరకు  పాలకొండ, రాజాం, ఎచ్చెర్ల, ఆమదావలస నియోజకవర్గాల్లో పాదయాత్ర పూర్తయింది. శ్రీకాకుళం నియోజకవర్గంలో శనివారం మధ్యాహ్నంతో పూర్తికానుంది.

నేడు నరసన్నపేట నియోజకవర్గంలోకి ప్రవేశం..
ప్రజాసంకల్పయాత్ర శనివారం నరసన్నపేట నియోజకవర్గ సరిహద్దుల్లోకి రానుంది. శనివారం ఉదయం 7.30 గంటల నుంచి రాత్రి బస కేంద్రమైన శ్రీకాకుళం నియోజకవర్గం నక్కపేట క్రాస్‌ వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభమై, అలికాం క్రాస్‌ మీదుగా సాగనుంది. తర్వాత మధ్యాహ్నం మడపాం నుంచి యాత్ర ప్రారంభం కానుంది. ఇప్పటికే ఐదు నియోజకవర్గాల్లో పూర్తి చేసుకున్న  సంకల్ప యాత్ర, ఇక మిగిలిన ఐదు నియోజకవర్గాల్లో కూడా దిగ్విజయంగా పూర్తి చేసేందుకు పార్టీ శ్రేణులు సన్నాహాలు చేశారు. జగన్‌కు భారీగా స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక జిల్లాలో తిత్లీ తుపాన్‌ ప్రభావిత ప్రాంతాలు నరసన్నపేట నియోజకవర్గం నుంచే ప్రారంభం కానున్నాయి. ఓవైపు తీవ్ర గాలులతో..మరోవైపు నదుల వరద నీటితో జిల్లాలో నరసన్నపేటతో పాటు టెక్కలి డివిజన్‌లో పలు మండలాల్లో తీవ్ర ఆస్తి నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే.. ఈమేరకు తిత్లీ ప్రభావంతో కష్టాల్లో ఉన్న ప్రజలకు ధైర్యం చెప్పడానికి, నష్టాల్లో ఉన్న రైతన్నలకు మనోధైర్యం నింపడానికి..ఆసరా కరువైన అవ్వాతాతలకు అండగా నిలవడానికి..పాలకుల నిర్లక్ష్యానికి గురవుతున్న బడుగులకు భరోసా ఇవ్వడానికి...ప్రజాసమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధి లేని సర్కార్‌ తీరును ఎండగట్టడానికి అన్న వస్తున్నాడు. జగనన్న వస్తున్నాడు.   

నేటి పాదయాత్ర సాగేదిలా..
శ్రీకాకుళం నియోజకవర్గంలోని నక్కపేట క్రాస్‌ నుంచి శనివారం ఉదయం 7.30 గంటలకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రారంభం కానుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటనలో తెలియజేశారు. శ్రీకాకుళం నియోజకవర్గంలోని అలికాం క్రాస్, నైర, కరిమిల్లి పేట క్రాస్, రోణంకి క్రాస్, భైరి వరకు యాత్ర సాగనుంది. ఇక్కడ మధ్యాహ్న భోజనం విరామం తీసుకుంటారు.  విరామం తర్వాత కరజాడ మీదుగా నరసన్నపేట నియోజకవర్గంలోకి యాత్ర ప్రవేశించనుంది. ఈ క్రమంలో మడపాం, దేవాది వరకు యాత్ర కొనసాగించి, అనంతరం అక్కడే రాత్రి బస చేయనున్నారని రఘురాం తెలియజేశారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top