కబ్జాకోరుల గుండెల్లో పిడుగు.. ఆ అడుగు

Today Praja Sankalpa Yatra Entry In Bheemili Visakhapatnam - Sakshi

నేడు భీమిలి నియోజకవర్గంలోకి ప్రజాసంకల్పయాత్ర

ఘనమైన భీమిలి ప్రతిష్టను మసకబార్చిన టీడీపీ నేతలు

భూకబ్జాలు, అవినీతి, అక్రమాలు..ఇవే నాలుగున్నరేళ్ల ప్రగతి

సహనం నశించిన ప్రజలు.. వైఎస్‌జగన్‌ కోసం ఎదురుచూపులు

భీమిలి.. అత్యంత పురాతనమైన మున్సిపాలిటీతోపాటు విశాఖ తర్వాత అంతటి సుందరమైన సాగరతీరం, విశాఖ నగరంతోపాటు ఎదిగిన ప్రాంతాల సమాగమంఈ నియోజకవర్గం..బకాసురుడిని వధించిన భీమసేనుని పేరు పెట్టుకున్న నియోజకవర్గాన్ని అభివృద్ధి ముసుగేసుకున్న భూబకాసురులు కబళిస్తున్నారు.నాడు దివంగత నేత వైఎస్‌రాజశేఖరరెడ్డి హయాంలో ఐటీ సెజ్, సినీ స్టూడియోతోపాటు పలు పర్యాటక, అభివృద్ధిప్రాజెక్టులతో వెలుగులీనిన భీమిలి నియోజకవర్గ ప్రభ.. గత నాలుగున్నరేళ్ల టీడీపీ పాలనలో మసకబారిపోయింది. ఆ నియోజకవర్గాన్ని అలుముకున్న చీకట్లను తరిమేసేందుకు సంకల్ప సూరీడు వైఎస్‌జగన్‌ అడుగుపెడుతున్నారు.

సాక్షి, విశాఖపట్నం: ప్రజాసంకల్పయాత్ర శనివారం భీమిలిలోకి అడుగుపెడుతోంది. ప్రజాకంటక పాలనను అంతమొం దించే లక్ష్యంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహిస్తున్న ఈ యాత్రకు.. దానికి సారధ్యం వహిస్తున్న జననేత వైఎస్‌జగన్‌కు ఘన స్వాగతం పలికేందుకు భీమిలి నియోజకవర్గ ప్రజలు ఉవ్విళ్లూరుతున్నారు.బకాసురుడిని సంహరించిన భీముని పేరుతో ఏర్పడిన భీమునిపట్నం కేంద్రంగా ఏర్పడిన భీమిలి నియోజకవర్గం నేడు బకాసురుడినే మించిన భూ బకాసురుల చెరలో చిక్కి శల్యమవుతోంది. మహానేత వైఎస్సార్‌ హయాంలో అభివృద్ధిలో పరుగులు పెట్టిన ఈ నియోజకవర్గం నేడు భూకబ్జాలు, అవినీతి, అక్రమాలకు కేంద్రంగా మారింది.

భూబకాసురులంతా ఇక్కడే..
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన విశాఖ భూ కుంభకోణంలో సిట్‌ గుర్తించిన భూ కబ్జాలు, అక్రమాల్లో అధిక శాతం ఈ నియోజకవర్గ పరిధిలోనివే. సిట్‌ దర్యాప్తులో సుమారు 10వేల ఎకరాల భూముల కబ్జాలు.లిటిగేషన్లలో ఉంటే వాటిలో సగానికి పైగా భీమిలిలోనే జరిగాయని నిర్ధారించారంటే ఏ స్థాయిలో ఇక్కడ భూములను కబళించారో వేరే చెప్ప నవసరం లేదు. ఇదే నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గంటా శ్రీనివాసరావు భీమిలి సాగర తీరంలో సీఆర్‌జెడ్‌ నిబంధనలను ఉల్లంఘించి తన కలల సౌ«ధాన్ని నిర్మించడమే కాకుండా తన బంధువుకు చెందిన ప్రత్యూష కంపెనీ కోసం ఆందపురం, భీమిలి మండలాల్లో తప్పుడు రికార్డులు పుట్టించి ప్రభుత్వ భూములనే రూ.200 కోట్లకు బ్యాంకుల్లో తనఖా పెట్టడం కలకలం రేపింది. అలాగే అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్, అతని కుటుంబ సభ్యులపై ఏకంగా 90 ఎకరాల దేవాదాయ భూములను కాజేశారని సిట్‌ సిఫార్సుతో కేసు నమోదైంది. ఇవే కాదు.. గత నాలుగున్నరేళ్లలో టీడీపీ నాయకుల భూదందాలు ఎంత చెప్పుకున్నా తక్కువే.

జననేత కోసం ఎదురుచూపులు
ఈ నేపథ్యంలో తమ నియోజకవర్గంలో అడుగుపెడుతున్న రాజన్న ముద్దుబిడ్డ జగన్‌మోహన్‌రెడ్డికి అపూర్వ స్వాగతం పలకడమే కాదు.. దోపిడీ పాలనలో పడుతున్న కష్టాలను చెప్పుకునేందుకు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. చిట్టివలస జ్యూట్‌ మిల్లు లాకౌట్, సింహాచలం పంచ గ్రామాల భూసమస్య, జన్మభూమి కమిటీల నిర్వాకం వంటి దీర్ఘకాల సమస్యలతోపాటు.. పరాయిపంచన నలిగిపోతున్న హుద్‌హుద్‌ గృహనిర్మాణ బాధితులు, నాలుగున్నరేళ్లుగా సొంతింటి కల నెరవేరని పేదలు, ఉన్న ఐటీ కంపెనీలు మూతపడి ఉద్యోగాలు కోల్పోతున్నవారు.. జగనన్న భరోసా కోసం నిరీక్షిస్తున్నారు.

పాదయాత్ర సాగేదిలా..
జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన 262వ రోజు పాదయాత్రను విశాఖ తూర్పు నియోజకవర్గం చినగదిలిలోని క్యూ–1 ఆస్పత్రి వద్ద బస చేసిన ప్రాంతం నుంచి శనివారం ర ఉదయం ఏడున్నర గంటలకు ప్రారంభిస్తారని వైఎస్సార్‌సీపీ ప్రొగ్రామ్స్‌ కమిటీ కన్వీనర్‌ తలశిల రఘురాం తెలిపారు. అక్కడ నుంచి రామకృష్ణాపురం, శ్రీకృష్ణాపురం, ఫైనాపిల్‌ కాలనీ, ధారపాలెం మీదుగా అడవివరం వద్ద భీమిలి నియోజకవర్గంలోకి అడుగుపెట్టనున్నారు. అక్కడ నుంచి లండా గరువు క్రాస్‌ మీదుగా దువ్వపాలెం వరకు శనివారం పాదయాత్ర జరుగుతుందని, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని రఘురామ్‌ ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top