తిరుమల హుండీలో 4 కోట్ల పాత నోట్లు

తిరుమల హుండీలో 4 కోట్ల పాత నోట్లు - Sakshi

 ఆపదమొక్కుల వాడికి పాతనోట్ల ఆపద

 కేంద్రానికి, రిజర్వు బ్యాంకుకు లేఖ రాసిన టీటీడీ

 సమాధానం కోసం ఎదురు చూపులు

 

తిరుపతి

ఆపద మొక్కుల వాడికే పెద్ద ఆపద వచ్చిపడింది. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి హుండీలో కేంద్ర ప్రభుత్వం రద్దుచేసిన పాత 500, 1000 రూపాయల నోట్లు ఏకంగా నాలుగు కోట్లు వచ్చిపడ్డాయి. ఇవన్నీ కేవలం గత రెండు నెలల్లోనే హుండీలోకి వచ్చాయి. కానీ వాటిని మార్చుకునేందుకు సమయం ఇప్పటికే ముగిసిపోయింది. దాంతో ఈ సొమ్మును ఏం చేయాలో తెలియక అధికారులు తల పట్టుకుంటున్నారు. దీంతో మమ్మల్ని ఏం చేయమంటారు మహాప్రభో అంటూ తిరుమల ఆలయ అధికారులు కేంద్ర ప్రభుత్వానికి, రిజర్వు బ్యాంకుకు లేఖలు రాశారు. వాళ్ల నుంచి తగిన సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు. హుండీలో 4 కోట్ల రూపాయలకు పైగా పాతనోట్లు వచ్చినట్లు టీటీడీ ఈఓ సాంబశివరావు చెప్పారు. దీనిపై ఇప్పటికే రిజర్వు బ్యాంకుకు, కేంద్రానికి రాశామని.. భక్తులు తమ మొక్కులు తీర్చుకోడానికి ఇలా పాతనోట్లు జమ చేసిన విషయం వారికి వివరించామని ఆయన అన్నారు. 

 

సాధారణంగా ఇంట్లో ఏదైనా కోరిక లేదా సమస్య ఉన్నప్పుడు స్వామివారి పేరు మీద ఇంట్లోనే ముడుపులు కడుతుంటారు. మట్టి కుండల్లో గానీ, వస్త్రంలో గానీ ఈ సొమ్మును ముడుపు కట్టి.. కొంత సమయం గడిచిన తర్వాత దాన్ని యథాతథంగా తీసుకెళ్లి హుండీలలో వేస్తుంటారు. తిరుమల వెళ్లడానికి సమయం దొరక్కపోవడమో, లేక ముడుపు వేయాల్సిన సమయం ఆసన్నం కాకపోవడమో జరిగితే.. అప్పటికే ముడుపుకట్టిన వాటిలో పాతనోట్లు ఉండి ఉంటే అవన్నీ ఇలా జమ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. దాంతోపాటు, పెద్ద మొత్తంలో పాతనోట్లు మిగిలిపోయిన వాళ్లు కూడా వాటిని మార్చుకునే అవకాశం లేకపోతే.. ప్రభుత్వానికి ఊరికే ఇచ్చేయడానికి బదులు ఇలా హుండీలో వేస్తే కాస్త పుణ్యం అయినా వస్తుందని భావించి వేసినా వేయొచ్చని అంటున్నారు. 

 

కొసమెరుపు: రద్దు చేసిన పాతనోట్లు పది కన్నా ఎక్కువ ఉంటే కనీసం 10వేల రూపాయలు లేదా పాతనోట్ల విలువకు రెట్టింపు మొత్తంలో జరిమానా విధిస్తామని కేంద్రం ఇటీవలే ప్రకటించింది. ఆ లెక్కన ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి 8 కోట్ల జరిమానా విధిస్తారా.. లేక 4 కోట్ల పాతనోట్లు తీసుకుని కొత్తనోట్లు ఇస్తారా అన్నది తేలాల్సి ఉంది.
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top