కట్టెదుర వైకుంఠం కాణాచయినా కొండ

కట్టెదుర వైకుంఠం కాణాచయినా కొండ


శ్రీవారి బ్రహ్మోత్సవాలకు నేడే అంకురార్పణ

తొమ్మిది రోజులు వివిధ వాహనాలపై  దర్శనమివ్వనున్న శ్రీవారు

విద్యుద్దీపకాంతులీనుతున్న తిరుమల
తిరుమల ఇదో ఇల వైకుంఠం.  అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు. సాక్షాత్తూ శ్రీమహావిష్ణువు అర్చామూర్తిగా స్వయంభువుగా కొలువై ఉన్నారు. గోవిందా అని పిలిస్తే కోరిన కోర్కెలు తీరుస్తాడు. ఆయన అభయహస్తంమన ఆపదలన్నీ తీరుస్తుంది.  నిరంతర వేదఘోష, వివిధ వాహన సేవలు, ధార్మిక ఉపన్యాసాలు, సంగీత, నాట్య, హరికథ, భజన, కోలాట బృందాల కోలాహలంతో తిరుమల అలరారుతూ ఉంటుంది.


ఈ విశ్వమూర్తికి జరిగే బ్రహ్మోత్సవాలను ప్రత్యక్షంగా తిలకించాల్సిందే.  ఒక్క మాటలో చెప్పాలంటే తిరుమల వైభవమే వేరు. ఈ నెల 23 నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. తొమ్మిది రోజులపాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలకు దేశం నలుమూలల నుంచి   సుమారు పది లక్షల మంది వస్తారని అంచనా. ఈ నేపథ్యంలో తిరుమలక్షేత్ర ప్రాశస్త్యంపై ప్రత్యేక కథనం. –సాక్షి ప్రతినిధి, తిరుపతి


తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు నేడు (శుక్రవారం) అంకురార్పణ జరగనుంది. శ్రీవారి సేనాధిపతి అయిన విష్వక్సేనుడు.. శ్రీవారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించే కార్యక్రమమే అంకురార్పణ. వైఖానస ఆగమోక్తంగా ఈ వేడుక నిర్వహించి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుడతారు. ఇందులో భాగంగా నేటి సాయంత్రం విష్వక్సేనుడు నిర్ణీత పునీత ప్రదేశంలో ‘భూమిపూజ’తో మట్టిని సేకరించి ఛత్ర చామర మంగళవాద్యాలతో ఊరేగుతూ ఆలయానికి చేరుకుంటారు. యాగశాలలో మట్టితో నింపిన 9 పాళికలలో– శాలి, వ్రహి, యవ, ముద్గ, మాష, ప్రియంగు తదితర నవ ధాన్యాలతో అంకురార్పణం చేస్తారు.


రేపు ధ్వజారోహణం, పెద్ద శేషవాహన సేవ

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు శనివారం ధ్వజారోహణం నిర్వహించనున్నారు. సాయంత్రం 5.48 నుంచి 6 గంటల్లోపు మీన లగ్నంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి బ్రహ్మోత్సవాలను ఆరంభిస్తారు. రాత్రి 9 గంటలకు పెద్ద శేషవాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి దర్శనమివ్వనున్నారు. టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్, జేఈవో కేఎస్‌ శ్రీనివాసరాజు సర్వం సిద్ధం చేశారు. అనంతపురం రేంజ్‌ డీఐజీ జె.ప్రభాకరరావు, టీటీడీ సీవీఎస్‌వో రవికృష్ణ, తిరుపతి అర్బన్‌ జిల్లా ఎస్పీ అభిషేక్‌ మహంతి ఉత్సవాల భద్రతను పర్యవేక్షిస్తున్నారు.  రేపు శ్రీవారికి ఏపీ సీఎం పట్టువస్త్రాల సమర్పణ  

బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏపీ సీఎం చంద్రబాబు శనివారం శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. రాత్రి 7.30 నుంచి 8 గంటల మధ్య పట్టువస్త్రాలను శ్రీవారికి సమర్పించి దర్శనం చేసుకుంటారు.
స్వయంభువుగా వెలసిన శ్రీవేంకటేశ్వరస్వామి

ఆదివరాహ క్షేత్రంగా భాసిల్లే వేంకటాచలంపై అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవేంకటేశ్వరస్వామి స్వయంభువుగా అవతరించారు. ఆనంద నిలయంలో అర్చా మూర్తిగా అవతరించిన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవేంకటేశ్వరస్వామి దివ్యమంగళ విగ్రహాన్ని క్షణకాలమైనా వీక్షించాలని గోవిందా..గోవిందా అంటూ వర్షాన్ని..చలిని లెక్క చేయకుండా విచ్చేసే భక్తులను ఆపదమొక్కులవాడు తరింపజేస్తున్నాడు.


సృష్టి, స్థితి, లయ కారకుడైన శ్రీమహా విష్ణువు స్వరూపమైన శ్రీవేంకటేశ్వరస్వామి దివ్య మంగళ  స్వరూపాన్ని ఒక్క క్షణకాలమైనా వీక్షించాలని లక్షలాది మంది భక్తులు నిత్యం క్షేత్రానికి వస్తుంటారు. ఆలయ గోపురాలు, మండపాలు, çపురాతన రాతిస్తంభాలు, ప్రాకారాలు, మంగళవాయిద్య ఘోషలు, శంఖనాథాలు, వేద మంత్రోచ్ఛరణలతో అనునిత్యం తిరుమల క్షేత్రం పవిత్రధామంగా  విరాజిల్లుతోంది.  లక్ష్మీదేవిని వెదకుతూ వేంకటాచలానికి..

భృగుమహర్షికి గర్వభంగాన్ని కలిగించిన మహావిష్ణువు తనపై అలకపూని వైకుంఠం వీడిన లక్ష్మీదేవిని వెదకుచూ భూలోకంలోని వేంకటాచల పర్వతాన్ని చేరుకుంటాడు. మనశ్శాంతి కోసం తింత్రిణీ వృక్షం కింద తపస్సు చేస్తు న్న క్రమంలో గొల్లవాని గొడ్డలివేటు కారణంగా స్వామి వారి తలకు గాయమవుతుంది. సరైన ఔషధం కోసం శ్రీనివాసుడు వనంలో తిరుగుతుండగా ఆ ప్రాంతానికి అధిపతి అయిన వరాహస్వామి ఎదురై శ్రీనివాసుడిని తేరిపార చూసి మహా విష్ణువుగా గుర్తిస్తారు.


ఆ తరువాత వకుళాదేవి దగ్గర కొంతకాలమున్న శ్రీనివాసుడు వేటాడుతూ వెళ్లి నారాయణవనంలో ఆకాశరాజు కుమా ర్తె శ్రీపద్మావతీ అమ్మవారిని చూసి పరమానంద భరితుడవుతాడు. వకుళాదేవిని రాయబారిగా పంపి   పద్మావతిని వివాహమాడి తిరుమల కొండపై కొలువై ఉన్నారు. కలియుగాంతం వరకూ కొండ మీదనే ఉండి భక్తులను అనుగ్రహిస్తుంటానని వేంకటేశుడు వరాహస్వామికి చెప్పినట్లు పురాణాలు చెబుతున్నాయి.నిత్య కల్యాణం..పచ్చతోరణం

మహిమాన్వితమైన ఈ క్షేత్రంలో ఆనందనిలయం పేరి ట పెద్ద ఆలయాన్ని నిర్మించారు. తొండమాన్‌ చక్రవర్తి దీన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. 15వ శతాబ్దంలో తాళ్లపాక అన్నమయ్య తిరుమలలో నివసించి స్వామి వారి కీర్తిని నలుదిశలా వ్యాపింపజేశారు. ఆ తరువాత పూజలు, ప్రత్యేక కైంకర్యాల్లో వేగం పెరిగింది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఆలయం విశేషంగా రూపుదిద్దుకుం ది. మొదటి ఈఓగా పనిచేసిన అన్నారావు  ఆలయ అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలకు రూపకల్పన చేశారు.తిరుమల సమగ్ర స్వరూపం  

తిరుమల ఆలయం సముద్ర మట్టం కంటే 2,820 అడుగుల ఎత్తులో ఉంది. 1945కి ముందు తిరుమలలో కనిష్ట ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెల్సిఎస్‌ ఉండేది. గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సిఎస్‌. రానురాను వాహనాలు, భక్తులు పెరిగి ఉష్ణోగ్రతలు పెరిగాయి. ప్రస్తుతం కనిష్ట ఉష్ణోగ్రత 16, గరిష్ట ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్‌గా నమోదవుతోంది.4,500మంది ఉద్యోగులు

టీటీడీలోని 38 విభాగాలకు చెందిన 4500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఒకేసారి 40 వేల మంది భక్తులకు వసతి కల్పించేలా తిరుమలలో సత్రాలు, గదులు, మఠాలు, అతిథి గృహాలు, ప్రత్యేక కాటేజీలు నిర్మించారు.  కొండపై 16 చోట్ల కల్యాణకట్టలు, రెండు చోట్ల అన్నదాన సత్రాలు ఉన్నాయి.తిరుమల చరిత్ర తెలుసుకుందా..

1. శ్రీవారి ఆలయంలో మూలమూర్తితో పాటు భోగశ్రీనివాసుడు, కొలువు శ్రీనివాసుడు, శ్రీదేవి, భూ దేవి సమేత శ్రీమలయప్పస్వామి,

ఉగ్ర శ్రీనివాసుడు కొలువై ఉంటారు. వీరినే పంచబేరాలు అంటారు.

2. శ్రీవారి ఆలయం మహాద్వారానికి కింది భాగంలో అటూ, ఇటూ పుష్ఫాలను ధరించిన శంఖనిధి, పద్మనిధి అనే నిధి దేవతల విగ్రహాలు ఉంటాయి.

3. శ్రీవారి పుష్కరిణిలో సంవత్సరానికి నాలుగుసార్లు చక్రస్నానం నిర్వహిస్తారు. అనంత పద్మనాభ చతుర్థశి, బ్రహ్మోత్సవాల చివరి రోజు, వైకుంఠ ద్వాదశి, రథసప్తమి రోజుల్లో చక్రస్నానం నిర్వహిస్తారు.

4. ్రీ.శ. 15వ శతాబ్దంలో తాళ్లపాక వంశీయులు స్వామి పుష్కరిణికి మెట్లు నిర్మించారు.  పుష్కరిణి మధ్యలో ఉన్న పవిత్ర నీరాళి మండపాన్ని క్రీ.శ.1468లో సాళువ నరసింహరాయులు నిర్మించారు.

5. బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణ కోసం ఉపయోగించే ధర్భలతో చేసిన తాడు 1.5 అంగుళాల మందం, 300 అడుగుల పొడవు కలిగి ఉంటుంది.

6.  1933లో తొలిసారి టీటీడీ ఆలయ ధర్మకర్తల మండలి ఏర్పడింది.     

7. 1944లో ఉదయం 5 నుంచి రాత్రి 10 గంటల వరకూ తిరుమలకు బస్సు సౌకర్యం ఉండేది.  ఫస్ట్‌క్లాస్‌ టికెట్‌ ధర రూ.2. రెండవ క్లాస్‌ ధర రూ.1.4 అణాలు.

8. పాపవినాశనం డ్యాం నిర్మాణానికి 1950 జులై 30న మద్రాసు రాష్ట్ర ప్రభుత్వ గవర్నర్‌ కృష్ణకుమార్‌ సిన్హా శంకుస్థాపన చేశారు. 1964లో గోగర్భం డ్యాం నిర్మాణం పూర్తయ్యింది.

9. 1978లో టీటీడీ పరిపాలనా భవనం నిర్మాణం పూర్తయింది. పరిపాలన మొత్తం ఒకేచోట నుంచి మొదలైంది.

10. 944కి ముందు తిరుమల కొండపైకి భక్తులు గుంపులు గుంపులుగానే నడిచే వెళ్లేవారు. ఎందుకంటే పులుల భయం. ఎప్పుడు ఏ సమయంలో క్రూరమృగాలు దాడి చేస్తాయోనని భయపడేవారు. బలమైన ముల్లుగర్రలు, బరిశెలు చేతబట్టుకుని నడిచి వెళ్లేవారు.

11. ఆలయంలో శ్రీవేంకటేశ్వరస్వామి సేవకు నిత్యం 250 కిలోల పూలను వినియోగిస్తారు.


కొండకు చేరుకునే మార్గాలు

1. అలిపిరి ఘాట్‌ రోడ్‌   

దీన్ని 1944లో వేశారు. అప్పటి ప్రఖ్యాత ఇంజినీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య దీన్ని డిజైన్‌ చేశారు. మొదట్లో కాలినడకన, తర్వాత ఎడ్లబండ్లపై భక్తులు కొండకు చేరుకునే వారు. అలిపిరి మార్గంలో కాలినడకన భక్తులు 9 కిలోమీటర్ల పొడవున్న మార్గంలో 3550 మెట్లు ఎక్కుతూ తిరుమల చేరుకోవాలి. ఒకవేళ రోడ్డు మార్గాన వెళితే 22 కిలోమీటర్ల మేర ప్రయాణించాలి.2. శ్రీవారిమెట్టు   

శ్రీనివాసమంగాపురానికి రెండు కిలో మీటర్ల దగ్గరలో కొం డకు దక్షిణాన శ్రీవారి మెట్టు ఉంది. 2.1 కిలోమీటర్ల పొడవున 2388 మెట్లు ఎక్కితే తిరుమల చేరుకోవచ్చు. ఆకాశరాజు కుమార్తె పద్మావతీ అమ్మవారిని వివాహం చేసుకుని వేంకటాచలం వెళ్తూ శ్రీనివాసుడు శ్రీనివాసమంగాపురంలో కొన్నాళ్లు ఉన్నట్లు పురాణాలు చెబుతున్నాయి. అక్కడి నుంచి స్వామి వారు ఈ మార్గాన్నే తిరుమల చేరుకున్నట్లు చరిత్ర చెబుతోంది.3. అన్నమయ్యమార్గం  

వైఎస్సార్‌ కడప జిల్లా మామండూరు నుంచి అటవీ మార్గం లో కాలి బాట మార్గం ఉంది. ఈ మార్గం గుండా నడిచే వెళితే తిరుమల కొండ మీదున్న పారువేట మందిరం దగ్గరకు చేరుకుంటాం. అక్కడి నుంచి రెండు కిలోమీటర్లు నడిచి శ్రీవారి ఆలయాన్ని చేరుకోవచ్చు. అన్నమయ్య ఈ మార్గం నుంచే   ఆలయానికి వచ్చారు.తిరుమలకు బస్‌ చార్జీలు

తిరుపతి నుంచి  తిరుమలకు సాధారణ బస్సుచార్జి రూ. 53, డీలక్స్‌ మినీ బస్సు చార్జి రూ.58

రిటన్‌ టికెట్‌తో కలిపి (తిరుపతి నుంచి తిరుమల, తిరుమల నుంచి తిరుపతి) రూ.96

ప్రైవేట్‌ జీపులు, ట్యాక్సీలు  రూ.60

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top