తల్లి పులి ఎక‍్కడ?

tiger missing in kurnool district - Sakshi

సాక్షి, ఆత్మకూరు రూరల్‌:  కర్నూలు జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్‌లోని వెలుగోడు పట్టణ పరిసరాల్లో వారం రోజులుగా కలకలం సృష్టించిన పులి కుటుంబంలో ఒకే ఒక పులి పిల‍్ల సురక్షితంగా తిరుపతి జంతు ప్రదర్శనశాలకు చేరుకోగా మరొక పులి పిల్ల మరణించింది. ఈ పులి పిల్లలు రెండూ ఆడవి(ఫిమేల్‌) కావడం... వాటి తల్లి ఆచూకి తెలియకపోవడం అటు అటవీ అధికారుల్లో, ఇటు ప్రజల్లో గుబులు పుట్టిస్తోంది. సాధారణంగా పులి రెండు నుంచి ఐదు పిల్లల వరకు జన్మనిస్తుంది. ఈ కూనలు రెండున్నర ఏళ్ళవరకు తల్లిని వదలకుండా తిరుగుతుంటాయి. స్వయంగా తమ ఆహారాన్ని తామే వేటాడి సంపాయించుకునే దాకా ఇవి తల్లితో పాటే తిరుగుతూ ఉంటాయి.

ఆ తరువాత మాత్రమే అవి తమ స్వంత ఆవాస ప్రాంతాన్ని గుర్తించుకుంటాయి. వెలుగోడు పట్టణ పరిసరాల్లో కనిపించినవి 12 నుంచి 18 నెలల లోపువేనని అటవీ అధికారులు నిర్దారించారు. ఇదిలా ఉంటే ఈ పులి కూనల తల్లి యేమైనట్లు అన్నది వేయి డాలర్ల ప్రశ్నగా మిగిలింది. ఆహారాన్వేషణలో కూనలను వదలి వెళ్ళే తల్లి పులి తిరిగి పిల్లలను చేరుకుంటుంది. యే పరిస్థితుల్లోనూ కూనలను వదలి తల్లి ఉండే అవకాశమే లేదు. అందుకే వెలుగోడు పరిసరాల్లో తొలుత పులి కూనలు కనిపించినపుడు వాటి తల్లి కూడా వెంట ఉంటుందని భావించారు. చివరకు అక్కడ పులి కూనలు మాత్రమే ఉండడం తల్లి పులి జాడ తెలియకపోవడంతో జనం బెంబేలుపడుతున్నారు. అటవీ అధికారులు ఎంత వెతికినా తల్లిపులి ఆచూకి తెలియలేదు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top