మేలుకో ఓటరు .. మార్చుకో ఫ్యూచరు..

Think Before Cast Your Vote - Sakshi

సాక్షి ప్రతినిధి, కాకినాడ : ఓటరు మహాశయా!... ఎన్నో మోసాలు చూశాం. అబద్ధాలెన్నో విన్నాం. అవినీతి అక్రమాలు కళ్లారా చూశాం. యూటర్న్‌ లెన్నో గమనించాం. ఈ మోసాలు, అబద్ధాలు, అవినీతి అక్రమాలకు పాల్పడే పాలకులను ఏమి చేయాలి?, ఎలా బుద్ధి చెప్పాలి అనుకుంటున్నారా? ఆ అవకాశం రానే వచ్చింది. వజ్రాయుధం లాంటి ఆయుధం మీ చేతుల్లో ఉంది. మంచి అభ్యర్థులతో పాటు మాట తప్పని, మడం తిప్పని నేతలను ఎంపిక చేసుకోండి. మళ్లీ రాజ యోగం తీసుకురండి. 

∙అధికారంలోకి వస్తే ఉద్యోగం ఇస్తామని చెప్పారు. అక్కడితో ఆగిపోలేదు ఇంటికో ఉద్యోగం అన్నారు. అప్పటికీ వారి మాట వినరేమోనన్న భయంతో మరో అడుగు ముందుకేసి ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని నమ్మించారు. కానీ ఏమీ ఇవ్వలేదు. 
∙కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని నమ్మించారు. అడిగితే అరెస్టులు. లాఠీ చార్జీలు, ఇదేమని ప్రశ్నిస్తే తుని ఘటనలో రైలు దహన విధ్వంసం బూచిని చూపించి, దోషులగా నిలబెట్టారు. 
∙బీసీలంతా మావైపే అన్నారు. వారిపైనే జులుం చూపించారు. బీసీల్లోని ఓ సామాజిక నేతలు సమస్యలు చెప్పుకుందామని వెళ్తే  తాట తీస్తా అన్నారు. మరో సామాజిక వర్గ నేతలు తమ బాధలు చెప్పుకుందామని కలిస్తే తోక కత్తిరిస్తానన్నారు. 119పైగా హామీలిచ్చి మోసం చేశారు. అడిగితే చిర్రుబుర్రులాడారు. 
∙పుష్కర తొక్కిసలాటలో 29 మంది అక్కడికక్కడ చనిపోయారు. దీంట్లో ప్రత్యక్ష దోషి ఎవరో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ ఘటనలో దోషులకు ఏ శిక్ష పడలేదు. సరికదా తప్పు భక్తులది, మీడియాదని తేల్చి పారేశారు. 
∙పేదలకు అందాల్సిన పింఛన్లపై కమిటీల పెత్తనం చెలాయించాయి. అనర్హులకు మంజూరు చేసి అర్హులకు అన్యాయం చేసిన సందర్భాలు ఉన్నాయి. 
∙ఇలా చెప్పుకుని పోతే అనేక మోసాలు, అన్యాయాలు, అబద్ధాలు ఉన్నాయి. అవన్నీ ప్రత్యక్షంగా మనం చూశాం. ఓటుతో బుద్ధి చెబుదామని అనుకున్నాం. ఇప్పుడా సమయం వచ్చింది. ఓటు అనే ఆయుధంతో మోసాలకు, అన్యాయాలకు, అబద్ధాలకు చెక్‌ పెడదాం.  

పంచభూతాలూ దోపిడీ
వేల కోట్ల ఇసుక దోపిడీ చేసేస్తుంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాం. కోట్లాది రూపాయల మట్టిని మింగేస్తుంటే అడ్డుకోలేకపోయాం. మైనింగ్‌తో వందల కోట్లు కొల్లగొడుతుంటే కళ్లప్పగించి చూశాం. నీరుచెట్టు పేరుతో కోట్లాది రూపాయలను దోచుకుంటుంటే నిలువరించలేకపోయాం. సీసీ రోడ్లు ముసుగులో వందల కోట్ల అవినీతికి పాల్పడుతుంటే ఏమీ అనలేకపోయాం. మరుగుదొడ్లు రూపంలో వంద కోట్లు స్వాహా చేస్తుంటే భరించలేకపోయాం. ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తుంటే.. సమాధులు ఆక్రమిస్తుంటే.. దేవుని భూములను కొల్లగొడుతుంటే.. అయ్యో పాపమని బాధపడ్డాం. సాగునీటి పనుల్లో కమీషన్లకు కక్కుర్తి పడ్డారు. పర్సంటేజీలు ముట్ట జెప్పేవారికే అభివృద్ధి పనులు అప్పగించారు.

పోలీసు అధికారుల నియామకాల దగ్గరి నుంచి అటెండర్‌ స్థాయి ఉద్యోగుల బదిలీలకొక రేటు పెట్టేశారు. పేకాట క్లబ్‌లు, కోడిపందాలు తదితర అడ్డగోలు వ్యవహారాలను ప్రోత్సహించారు. తమ సమస్యలపై పోరాడిన ఉద్యోగులపైన, డిమాండ్ల కోసం ఉద్యమించిన అంగన్‌వాడీ, ఆశా వర్కర్లపైన దాడులు చేశారు. అన్ని రకాలుగా ఉక్కుపాదం మోపారు. ఇవన్నీ చూసి సమాజం ఎక్కడికెళ్తుందని ఆవేదన చెందాం. చిన్నారులపై వికృత చేష్టలు...మహిళలపై అత్యాచారాలు...పట్టపగలే హత్యలు...అక్రమ కేసుల బనాయింపు...ఇలాంటి ఎన్నో దారుణాలు చూసి బాధ పడ్డాం. కానీ ఏమీ చేయలేకపోయాం. నిస్సహాయులగా మిగిలిపోయాం. మార్పు వస్తేనే పరిస్థితులు మారుతాయని భావించాం. ఓటుతోనే బుద్ధి చెబుదామని అనుకున్నాం.. ఐదేళ్లుగా వేచి చూశాం...ఆ గడియలు రానే వచ్చాయి. మరికొద్దిసేపట్లో పోలింగ్‌ బూత్‌కెళ్లి గతమంతా గుర్తు చేసుకుని ఓటేద్దాం. 

ప్రజల కోసం పోరాడిన నేతలకు పట్టం కడదాం
ప్రజల కోసం పోరాడిన నేతలు ఎవరో గత ఐదేళ్లుగా చూశాం. సమస్యలొచ్చినప్పుడు అండగా నిలిచిన నేతలెవరో మీకు తెలుసు. కష్టాల్లోనూ, ఆపదలోనూ అదుకున్నవారెవరో తెలియంది కాదు. ధరలు పెరిగినప్పుడు, విద్యార్థుల ఫీజులు రానప్పుడు, కరువు కాటకాలొచ్చినప్పుడు, విపత్తులు సంభవించినప్పుడు, రోగాలు విలయతాండవం చేసినప్పుడు మన వద్దకు వచ్చి మనల్ని ఓదార్చిన నేతలెవరో అర్థమై ఉంటుంది. ఇక ప్రత్యేక హోదా కోసం ఊరూరా నిరసనలు, దీక్షలు... జిల్లాల వారీగా భేరీలు....రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు.. హోదా కోసం పదవులు త్యాగం చేసిన నేతల గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మన కోసం పనిచేసిన.. మన కోసం పోరాడిన.. ఐదేళ్లుగా అండగా ఉన్న...ఆపదొచ్చినప్పుడు వెంటనే వచ్చిన.. మాటిస్తే మడమ తిప్పకుండా పనిచేసిన నేతలను ఎన్నుకోవల్సిన సమయం ఆసన్నమైంది. విజ్ఞులైన ఓటర్లకు ఇదే మంచి అవకాశం. మేల్కోండి. మంచి పాలన అందించే నేతలను ఎన్నుకోండి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top