పట్టపగలు దొంగతనం

Thief Caught Redhandedly In Srikakulam - Sakshi

శ్రీకాకుళం, ఎచ్చెర్ల క్యాంపస్‌: ఎచ్చెర్లలోని రామ్‌నగర్‌ ప్రాంతంలో మంగళవారం పట్టపగలే దొంగతనం జరి గింది. గ్రామానికి చెందిన జరుగుళ్ల లక్ష్మీనారాయణ ఇంటిలో ఈ చోరీ జరగ్గా దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే.. జరుగుళ్ల లక్ష్మీనారాయణ మంగళవారం ఉదయం పొలం పనులకు వెళ్లారు. పిల్లలు పాఠశాలకు వెళ్లిపోయారు. యజమాని భార్య లక్ష్మి గడ్డి కోసేందుకు పొలాలకు వెళ్లారు. ఇంటిలో ఎవరూ లేకపోవడంతో దొంగ ఇంటికి వేసిన తాళం, గడియను ఇనుప బ్లేడు సాయంతో కోసివేశాడు. ఇంటిలోకి దూరి ఇనుప బీరువా తాళాలు విరగ్గొట్టాడు. మొత్తం బీరువాను చిందరవందర చేసి లోపల అరలో ఉన్న రెండున్నర తుళాల బంగారు పుస్తెలతాడు, అరతులం బంగారు చెవి దుద్దులు పట్టుకుపోయాడు.

లక్ష్మి ఇంటికి వచ్చేసరికి విరిగిన తా ళం, చిందరవందరగా ఉన్న బీరువా కనిపించడంతో అవాక్కైంది.
వీధిలోకి వచ్చి చూడగా అక్కడో యువకుడు అనుమానాస్పదంగా కనిపించాడు. అతడిని ‘ఎవరు నువ్వు’ అని ప్రశ్నించగా నీళ్లు నములుతా పారిపోవడానికి ప్రయత్నించాడు. దీంతో స్థానికులు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ యువకుడి జేబులో మూడు తులాల బంగారాన్ని పోలీసులు గుర్తించారు. నిం దితుడిని విజయనగరం జిల్లా మక్కువకు చెందిన డి.విష్ణుకుమార్‌గా గుర్తించారు. బంగారాన్ని స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ వై.కృష్ణ తెలిపారు.  దువ్వాడ, ఆనందపురం  ప్రాంతాల్లో జరిగిన చోరీల్లోనూ ఈ యువకుడి ప్రమేయం ఉందని తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top