అదనపు డీజీనా..ఐజీనా?

Tension In Vijayawada Police Commissionerate - Sakshi

విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌పై ప్రభుత్వం మల్లగుల్లాలు

కొత్త సీపీ కోసం సీనియర్ల ప్రయత్నాలు ముమ్మరం

అదనపు డీజీ అయితే త్రిముఖపోటీ

ఐజీ స్థాయి అయితే ద్విముఖపోటీ

విజయవాడ నగర పోలీస్‌ కమిషనరేట్‌ను అదనపు డీజీ స్థాయిలో కొనసాగించడమా..? ఐజీ రేంజ్‌కి తీసుకురావడమా..?
ఈ అంశంపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. కొత్త  పోలీస్‌ కమిషనర్‌ (సీపీ) ఎంపికకు  ముందే కమిషనరేట్‌ స్థాయిపై నిర్ణయం తీసుకోవాలి. అదనపు డీజీ స్థాయిలోనే కొనసాగించాలని భావిస్తే సీపీ పోస్టు కోసం త్రిముఖపోటీ ఉంది. ఐజీ స్థాయికి తగ్గిస్తే సీపీ పోస్టు కోసం ద్విముఖపోటీ నెలకొంటుంది.
ఈ నేపథ్యంలో సీపీ పోస్టు కోసం సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

సాక్షి, అమరావతిబ్యూరో :  రాజధాని కార్యకలాపాలు అమరావతి నుంచే నిర్వహించాలని 2016లో ప్రభుత్వం నిర్ణయించింది. విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిని విస్తరించాలని కూడా భావించింది. కమిషనరేట్‌ పరిధిలోకి సీఆర్‌డీఏ ప్రాంతాన్ని మొత్తం చేర్చడంతోపాటు జగ్గయ్యపేట వరకు విస్తరించాలని ప్రతిపాదించింది. కృష్ణా, గుంటూరు రూరల్‌ ఎస్పీల పరిధిలోని ప్రాంతాలు కొన్నింటిని విజయవాడ కమిషనరేట్‌ కిందకు తీసుకురావాలన్నది అప్పట్లో ప్రభుత్వ ప్రణాళిక. ఈ ప్రాంతాలను కలుపుతూ ఏడాదిలోగా అమరావతి పోలీస్‌ కమిషనరేట్‌ను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అం దుకే ఐజీ స్థాయిలో ఉన్న  విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌ స్థాయిని అదనపు డీజీ స్థాయికి 2016లో పెంచేసింది.

కానీ ఆ తరువాత అమరావతి కమిషనరేట్‌ ప్రతిపాదనను పట్టించుకోలేదు.  అదనపు డీజీగా ఉంటూ సీపీగా గౌతంసవాంగ్‌  అసంతృప్తిగానే ఉన్నారు. డీజీపీ పోస్టు మీద ఆశతో ఆయన సీపీగాకొనసాగారు. కానీ నూతన డీజీపీగా ఆర్‌.పి.ఠాకుర్‌ను ప్రభుత్వం నియమించి..సవాంగ్‌ను విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీగా బదిలీ చేసింది. ఈ నేపథ్యంలో విజయవాడ కమిషనరేట్‌ను అదనపు డీజీ స్థాయిలో కొనసాగించడం అవసరమా అన్న చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. అమరావతి పోలీస్‌ కమిషనరేట్‌ ప్రతిపాదన ఇప్పట్లో అమలయ్యేది కాదు. కాబట్టి అదనపు డీజీ స్థాయి అధికారిని సీపీగా  ఎందుకు నియమించాలని హోంశాఖ భావిస్తోంది. తొందరపాటుతో  కమిషనరేట్‌ను అదనపు డీజీ స్థాయికి పెంచిన ప్రభుత్వం మళ్లీ వెనక్కి తగ్గితే తన తప్పును అంగీకరించినట్లే అవుతుంది.

అదనపు డీజీ స్థాయిలో త్రిముఖపోటీ...
విజయవాడ కమిషనరేట్‌ను అదనపు డీజీ స్థాయిలోనే కొనసాగించాలని నిర్ణయిస్తే కమిషనర్‌ పోస్టు కోసం త్రిముఖపోటీ నెలకొంది. ద్వారకా తిరుమలరావు, నళినీ ప్రభాత్, అమిత్‌గార్గ్‌ల పేర్లు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. సీఐడీ అదనపు డీజీగా ఉన్న ద్వారాకా తిరుమలరావు రేసులో ముందున్నారు. ఆయన ప్రస్తుతం అగ్రిగోల్డ్‌ కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు. ఈ కేసు వ్యవహారంతో ఆయన సీఎం చంద్రబాబుకు మరింత సన్నిహితమయ్యారు.  అగ్రిగోల్డ్‌ కేసు దర్యాప్తును కోర్టు  ఓ కంట కనిపెడుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. దర్యాప్తు అధికారిగా ఉన్న ద్వారకా తిరుమలరావును విజయవాడ సీపీగా పంపిస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది. 

ఆయన కూడా అగ్రిగోల్డ్‌ కేసు దర్యాప్తు బృంద సారథిగానే ఉండేందుకే మొగ్గుచూపుతున్నారని సమాచారం. ద్వారకా తిరుమల రావు కాదనుకుంటే నళినీ ప్రభాత్, అమిత్‌గార్గ్‌లలో ఒకరిపట్ల ప్రభుత్వం మొగ్గు చూపించొచ్చు. ఆక్టోపస్‌ అదనపు డీజీగా ఉన్న నళినీ ప్రభాత్‌ సీపీగా వచ్చేందుకు ఆసక్తితో ఉన్నారని తెలుస్తోంది. ఆయన సీఐడీ విభాగం ఉన్న అమిత్‌గార్గ్‌ నుంచి పోటీ ఎదుర్కొంటున్నారు. 2010లో విజయవాడ కమిషనరేట్‌  డీఐజీ స్థాయిలో ఉండగా ఆయన కొన్ని నెలలు సీపీగా చేశారు. 2015 నుంచి 16వరకు  ఐజీ స్థాయిలో విశాఖపట్నం సీపీగా కూడా పనిచేశారు. ఈ ముగ్గురు అధికారుల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది.  సీఐడీ విభాగంలో సైబర్‌ క్రైం, స్టేట్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో అదనపు డీజీ సునీల్‌కుమార్‌ సీపీగా వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం. 

ఐజీ స్థాయి అయితే ద్విముఖం...
విజయవాడ కమిషనరేట్‌ను ఐజీ స్థాయికి తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయిస్తే... సీపీ పోస్టు కోసం ద్విముఖ పోటీ నెలకొంది. ఇంటెలిజెన్స్‌ విభాగం ఐజీ మహేష్‌కుమార్‌ లడ్హా, డ్రగ్స్‌ కంట్రోల్‌ ఐజీ రవిశంకర్‌ల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయవాడ కమిషనరేట్‌ స్థాయి, కొత్త సీపీ ఎంపికపై సీఎం చంద్రబాబే తుది నిర్ణయం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top