తమ్ముళ్ల టికెట్ల లొల్లి


 సాక్షి, అనంతపురం : తెలుగుదేశం పార్టీలో నాయకుల ఆధిపత్య పోరుతో అప్పుడే టికెట్ల గోల మొదలైంది. జిల్లాకు చెందిన ఎన్‌టీ చౌదరి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా పనిచేస్తూ.. ఎక్కువ సమయం హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. ఆర్థికంగా బలంగా ఉన్నందున పార్టీ తరఫున జిల్లాలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎప్పుడో ఒకసారి ఎమ్మెల్యే టికెట్ రాకపోతుందా అనే ఆశతో ఎదురుచూస్తున్నారు. అయితే జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యేలు ఎప్పటికప్పుడు ఆయన ఎదుగుదలకు అడ్డుపడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాకు చెందిన ముఖ్య నేతలు అడ్డుపడుతున్నా తొమ్మిదేళ్ల పాటు వివిధ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ పార్టీ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. కళ్యాణదుర్గం లేదా పుట్టపర్తి అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని మొదటి నుంచి అడుగుతున్నారు. టికెట్ వస్తుందనే ధీమాతో పార్టీ కోసం విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేశారు. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండడం.. పార్టీకి ఆర్థిక అవసరాలు వుంటాయనే ఉద్దేశంతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు.. చౌదరికి రాష్ట్ర స్థాయి బాధ్యతలు అప్పగించారు. అయితే ఆయన్ని ప్రోత్సహించాల్సిన జిల్లా నాయకులు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయాన్ని చౌదరి అధినేత దృష్టికి తీసుకెళ్లినా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

 

 ఈనేపథ్యంలోనే రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు గురువారం ఎన్‌టీ చౌదరి ప్రకటించారు. దీనిపై చంద్రబాబు నాయుడికు లేఖ కూడా రాశారు. ‘జిల్లాలో నాయకుల మధ్య నెలకొన్న గ్రూపు రాజకీయాల వల్ల మీరు నన్ను ప్రోత్సహించలేకపోయారని భావిస్తున్నా.. ఇలాంటి పరిస్థితుల్లో నేను పార్టీలో కొనసాగలేకపోతున్నా.. అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నా’నని బాబుకు రాసిన లేఖలో ఎన్‌టీ చౌదరి పేర్కొన్నారు.

 కాగా.. అనంతపురంలో వచ్చే నెల 2వ తేదీన బీజేపీ సీనియర్ నాయకుడు వెంకయ్యనాయుడు సమక్షంలో ఎన్‌టీ చౌదరి బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

 

 ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా టీడీపీలో టికెట్ల గోల అప్పుడే మొదలవడంతో నాయకుల్లో ఆందోళన మొదలైంది. తెలుగుదేశం పార్టీలో ఒక వర్గం నాయకులు పార్టీ అంటే తమదే అన్నట్లు.. తాము చెప్పినట్లు వినాల్సిందేనంటూ బహిరంగంగా ప్రకటనలు చేస్తుండటంతో కిందిస్థాయి నాయకులు తీవ్ర ఆవేదనకు గురౌతున్నారు. మున్ముందు మరికొంత మంది నాయకులు పార్టీ వీడే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ నాయకులే పేర్కొంటుండటం గమనార్హం.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top