హత్యలు.. అరాచకాలు

The Telugu Desam Party Leaders Are Led To Murder Politics - Sakshi

సాక్షి, గుంటూరు: తెలుగుదేశం పార్టీ నాయకులు అధికారం అండతో హత్యారాజకీయాలకు తెగబడుతున్నారు. పదేళ్ల తరువాత అధికారంలోకి వచ్చింది మొదలు వైఎస్సార్‌ సీపీ శ్రేణులను భయభ్రాంతులకు గురిచేసి ప్రతిపక్షమే లేకుండా చేయాలనే కుయుక్తులు పన్నుతున్నారు. ముఖ్యంగా నరసరావుపేట పార్లమెంటు పరిధిలోని గురజాల, మాచర్ల, నరసరావుపేట, వినుకొండ, పెదకూరపాడు, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో టీడీపీ శ్రేణులు గూండాల్లా రెచ్చిపోతున్నారు.

పోస్టింగ్‌ల కోసం పోలీసు అధికారులు సైతం వీరి ఆగడాలకు అండగా నిలుస్తున్నారు. కొన్నిచోట్ల పోలీసు అధికారుల కనుసన్నల్లోనే దాడులు జరిగాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 1994 నుంచి 2004 వరకు తొమ్మిదేళ్లు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ పల్నాడు ప్రాంత గ్రామాలు ఫ్యాక్షన్‌తో అట్టుడికాయి. 2004లో డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి 2014 వరకు పదేళ్లు ఆ గ్రామాలు ఫ్యాక్షన్‌కు దూరంగా ప్రశాంతంగా ఉన్నాయి. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక మళ్లీ ఫ్యాక్షన్‌ రాజకీయాలు మొదలయ్యాయి. 

ముప్పాళ్లలో ప్రజాస్వామ్యం ఖూనీ
తెలుగుదేశం పార్టీ నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని సైతం ఖూనీ చేశారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఏడుగురు ఎంపీటీసీ సభ్యులును ఐదుగురు ఎంపీటీసులున్న తెలుగుదేశం పార్టీ నేతలు కిడ్నాప్‌ చేసి ఎంపీపీ స్థానాన్ని దక్కించుకున్నారు. ముప్పాళ్ల ఎంపీపీ ఎన్నికకు ఎంపీటీసీ సభ్యులతో వెళ్తున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే మహ్మద్‌ ముస్తఫా, అంబటి రాంబాబుపై శాసన సభ స్పీకర్‌ కోడెల తనయుడు గూండాలతో మేడికొండూరు వద్ద దాడులు చేయించారు.

బస్సు, ఎమ్మెల్యే వాహనాన్ని ధ్వంసం చేయడంతోపాటు ఎమ్మెల్యే ముస్తఫా, అంబటిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచి భయానక వాతావరణం సృష్టించారు. ఇదే విధంగా బెల్లంకొండ, గుంటూరు రూరల్, చిలకలూరిపేట, వినుకొండ ఎంపీపీ స్థానాలను టీడీపీ దౌర్జన్యంగా అధికార పార్టీ కైవసం చేసుకుంది. మేడికొండూరు వద్ద వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే, నేతలపై దాడులకు తెగబడ్డ అధికార పార్టీ గుండాలపై పోలీసులు తూతూ మంత్రంగా కేసులు పెట్టి స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి వదిలేశారు.

నరసరావుపేటలో గూండాయిజం..
పల్నాడు ప్రాంతంలోని నరసరావుపేట పట్టణంలో శాసన సభ స్పీకర్‌ కోడెల, ఆయన తనయుడి అరచకాలకు ఎదురు చెప్పిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులపై అధికార పార్టీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడ్డారు. తాము చెప్పినట్టు వినకపోవడంతో వైఎస్సార్‌ సీపీ నాయకులకు సంబంధించిన ఎన్‌సీవీ, గ్రామీణ కేబుల్‌ నెట్‌వర్క్‌ కార్యాలయాలపై తమ గూండాలతో దాడులు నిర్వహించి కేబుల్‌ పరికరాలన్నింటినీ ధ్వంసం చేయడంతో పాటు మాజీ డీసీసీబీ అధ్యక్షుడు నల్లపాటి చంద్రశేఖర్‌రావుపై దాడి చేసి గాయపరిచారు. పైగా తిరిగి వారిపైనే అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేశారు. అంతేకాకుండా పలుమార్లు నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై దౌర్జన్యాలకు పాల్పడ్డమే కాకుండా అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురిచేశారు. 

అడ్డుపడితే దాడులే..
జిల్లాలో టీడీపీ అధికారంలోకి వచ్చాక తమకు ఎదురుచెప్పిన వారిపై దాడులకు తెగబడటం పరిపాటిగా మారింది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైఎస్సార్‌సీపీ కీలక నేతలను ప్రలోభాలకు గురి చేసి తమ పార్టీలోకి చేర్చుకోవడం లేకపోతే దాడులు చేయడం ఇదీ అధికార పార్టీ నేతల తీరు. టీడీపీ అరాచకాలకు ఎదురుచెప్పినందుకు నరసరావుపేట, సత్తెనపల్లి, చిలకలూరిపేట, గురజాల, రేపల్లె, వినుకొండ నియోజకవర్గాలు సహా వివిధ ప్రాంతాల్లో అనేకమంది వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులు చేసి గాయపరిచారు. పిడుగురాళ్ల, దాచేపల్లి మండలాల్లో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే అక్రమ మైనిం గ్‌ చేస్తున్నాడని కోర్టులో కేసు వేసినందుకు వైఎస్సార్‌సీపీ నేత కుందుర్తి గురవాచారిని రహ స్య ప్రాంతాలకు తరలించి అధికార పార్టీ నేతలు వేధింపులకు గురిచేశారు.      

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top